Share News

మనదే పైచేయి

ABN , Publish Date - Apr 13 , 2025 | 12:32 AM

ఇంటర్మీడియెట్‌ పరీక్షా ఫలితాల్లో కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలు తిరుగులేని విజయాన్ని నమోదు చేశాయి. ఏటా మాదిరిగానే రాష్ట్రంలోనే కృష్ణాజిల్లా మొదటి స్థానంలో నిలవగా, ఎన్టీఆర్‌ జిల్లా మూడోస్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తంగా అమ్మాయిలే అధిక ఉత్తీర్ణతా శాతాన్ని నమోదు చేయగా, ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు 980 పైబడి మార్కులతో సత్తా చాటారు. రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు ఆదివారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా, సప్లిమెంటరీ పరీక్షలు మే 12 నుంచి జరగనున్నాయి. - ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం/విజయవాడ

మనదే పైచేయి
విద్యార్థుల విజయ సంకేతం

ఇంటర్‌ ఫలితాల్లో టాప్‌లేపిన కృష్ణా, ఎన్టీఆర్‌

రాష్ట్రంలో కృష్ణా ఫస్ట్‌.. మూడోస్థానంలో ఎన్టీఆర్‌

సత్తా చాటిన ప్రభుత్వ కళాశాల విద్యార్థులు

పాయకాపురం విద్యార్థినికి 984 మార్కులు

నేటి నుంచి రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు

15 నుంచి సప్లిమెంటరీ ఫీజుల చెల్లింపు

మే 12 నుంచి పరీక్షల నిర్వహణ

కృష్ణాలో 93 శాతం ఉత్తీర్ణత

ఇంటర్మీడియెట్‌ పరీక్షా ఫలితాల్లో కృష్ణాజిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌ శనివారం ఇంటర్‌ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. కృష్ణాజిల్లా నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 19,133 మంది విద్యార్థులు హాజరుకాగా, 17,708 మంది ఉత్తీర్ణత సాధించారు. 93 శాతం ఉత్తీర్ణతతో ఏటా మాదిరిగానే కృష్ణాజిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక మొదటి సంవత్సరం పరీక్షలకు 23,219 మంది హాజరు కాగా, 19,743 మంది ఉత్తీర్ణులయ్యారు. 85 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే కృష్ణాజిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల నుంచి 615 మంది పరీక్షలకు హాజరుకాగా, వారిలో 485 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతా శాతం 79గా నమోదైంది. మచిలీపట్నం లేడియాంప్తిల్‌ బాలికల జూనియర్‌ కళాశాలకు చెందిన ఏ.బాలాత్రిపురసుందరి ఎంపీసీ గ్రూపులో 1000/980 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమస్థానంలో నిలిచింది. మొవ్వ క్షేత్రయ్య జూనియర్‌ కళాశాల విద్యార్థి కె.మురళీధర్‌ ఎంపీసీ గ్రూపులో 1000/973 మార్కులు సాధించి ద్వితీయస్థానం పొందాడు. ఉయ్యూరు మండలం ఆకునూరు జూనియర్‌ కళాశాల విద్యార్థిని బి.వరలక్ష్మి ఎంపీసీ గ్రూపులో 1000/954 మార్కులు, అవనిగడ్డ జూనియర్‌ కళాశాల విద్యార్థిని కె.మేఘనసంధ్య ఎంపీసీ గ్రూపులో 1000/954 మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచారు. మొవ్వ క్షేత్రయ్య జూనియర్‌ కళాశాల ఏటా మాదిరిగానే 87 శాతం ఉత్తీర్ణతతో జిల్లాలో మొదటిస్థానంలో నిలిచింది. అవనిగడ్డ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల 83.50 శాతం ఉత్తీర్ణతతో ద్వితీయ, మచిలీపట్నం లేడియాంప్తిల్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల 79 శాతం ఉత్తీర్ణతతో తృతీయ స్థానం సాధించాయని ఆర్‌ఐవో పీబీ సాల్మన్‌రాజు తెలిపారు.

మూడోస్థానంలో ఎన్టీఆర్‌

ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం 89 శాతం, మొదటి సంవత్సరం 81 శాతం ఉత్తీర్ణతతో ఎన్టీఆర్‌ జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. గుంటూరు జిల్లా రెండోస్థానంలో నిలిచింది. ఎన్టీఆర్‌ జిల్లాలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 35,484 మంది హాజరు కాగా, 31,736 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 39,200 మంది హాజరుకాగా, 31,676 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే అధిక సంఖ్యలో ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 86 శాతం మంది అమ్మాయిలు ఉత్తీర్ణులు కాగా, అబ్బాయిలు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరంలో అమ్మాయిలు 75 శాతం, అబ్బాయిలు 66 శాతం ఉత్తీర్ణత పొందారు. ఈ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు సత్తా చాటారు. జిల్లాలో మొత్తం పది ప్రభుత్వ కళాశాలలు ఉండగా, ద్వితీయ సంవత్సరం 606 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 398 మంది ఉత్తీర్ణత సాధించగా, 66 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వృత్తి విద్యాకోర్సులకు సంబంధించి 189 మంది పరీక్షలు రాయగా, 177 మంది ఉత్తీర్ణులై 94 శాతం ఉత్తీర్ణతను సాధించారు. మొదటి సంవత్సరంలో 997 మంది పరీక్షలకు హాజరు కాగా, 485 మంది ఉత్తీర్ణులయ్యారు. 49 ఉత్తీర్ణతా శాతం నమోదైంది. వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి మొత్తం 241 మంది పరీక్షలు రాయగా, 206 మంది ఉత్తీర్ణులయ్యారు. 85 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో జి.రాజ్యలక్ష్మి (984), ఎం.రాజేశ్‌ (940), సీహెచ్‌ నవీశ్రీ (923), సీహెచ్‌ సాయికుమార్‌ (918) మార్కులు సాధించారు. బైపీసీలో షేక్‌ రేష్మా (984), జె.అంజలి (953), వి.భువనేశ్వరి (911), బి.మేఘన (904) మార్కులు సాధించారు. సీఈసీలో జె.ప్రకాష్‌ (878), డి.సాయి లిఖిత (823), సీహెచ్‌ వైష్ణవి (812) సాధించగా, హెచ్‌ఈసీలో షేక్‌ అయిషా పర్వీన్‌ (812) మార్కులు పొందింది.

సె్ట్రచర్‌పై వచ్చి పరీక్షలు రాసిన విద్యార్థి పాస్‌

జగ్గయ్యపేట, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి) : రోడ్డు ప్రమాదానికి గురై ఇంటర్‌ బోర్డు ప్రత్యేక అనుమతి తీసుకుని సె్ట్రచర్‌పై వచ్చి పరీక్ష రాసిన పట్టణానికి చెందిన సాయిరాజు శనివారం విడుదలైన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించాడు. పట్టణంలోని ఓ కళాశాలలో ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న సాయిరాజు గత ఫిబ్రవరిలో ఇంటికి నడిచి వెళ్తుండగా బైక్‌ ఢీకొనడంతో గాయాలపాలయ్యాడు. అతని కుడి మోకాలితో పాటు వెన్నుకు దెబ్బ తగిలింది. ఆపరేషన్‌ అనంతరం డిశ్చార్జి చేసిన వైద్యులు పూర్తి విశ్రాంతి అవసరమని చెప్పటంతో పరీక్ష లు రాయటం సాధ్యం కాదని అంతా అనుకున్నారు. కుటుంబసభ్యులు వద్దని వారించారు. కానీ సాయిరాజు ఇంటర్‌ బోర్డు అనుమతితో పరీక్షలు రాసి 308 మార్కులు సాధించాడు.

Updated Date - Apr 13 , 2025 | 12:32 AM