మద్యం మార్గం
ABN, Publish Date - Feb 10 , 2025 | 12:55 AM
పగలంతా ఎక్కడ ఉంటారో తెలియదు. ఎక్కడెక్కడ తిరుగుతారో తెలియదు. చీకటి పడుతున్న సమయంలో రహదారులను వెతుక్కుంటూ బయటకొస్తారు. ఎక్కడ మద్యం దుకాణం కనిపిస్తే అందులోకి దూకుతారు. కౌంటర్లను ఖాళీ చేస్తారు. కొద్దిరోజులుగా వరుసగా ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మద్యం దుకాణాల్లో సాగుతున్న చోరీల తీరిది. విజయవాడ, మంగళగిరి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ చోరీలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో దుకాణాల్లోని కౌంటర్లను కొల్లగొడుతున్నారు. జనవరి 31 నుంచి శనివారం అర్ధరాత్రి వరకు జరిగిన ఘటనలకు సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీలు ఈ విషయాలను తెలియజేస్తున్నాయి.

మద్యం షాపులే టార్గెట్‌గా వరుస చోరీలు
తొలుత వన్‌టౌన్.. తర్వాత మంగళగిరి..
తాజాగా బెంజిసర్కిల్ వద్ద..
కౌంటర్లను కొల్లగొడుతున్న దొంగలు
చడ్డీలు వేసుకుని, ముసుగులతో దొంగతనాలు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ముఖానికి ముసుగు.. శరీరం నిండా నూనె.. అండర్‌వేర్ మాత్రమే వేసుకుని ఉన్న వీరిని చూస్తే చడ్డీగ్యాంగ్ గుర్తొస్తుంది. రెండేళ్ల క్రితం చడ్డీగ్యాంగ్ నగరంలో వరుసగా అపార్ట్‌మెంట్లలో చోరీలకు దిగగా, పోలీసులు మధ్యప్రదేశ్‌కు వెళ్లి అక్కడి నుంచి కొంతమంది చడ్డీగ్యాంగ్ సభ్యులను లాక్కొచ్చారు. ఇప్పుడు అదే పోలికలతో ఉన్న నిందితులు మద్యం షాపుల్లో చోరీలకు దిగుతున్నారు. మద్యం దుకాణాలకు పక్కన ఉండే చిన్నచిన్న సందుల్లోకి వెళ్లి షాపు పైభాగాన ఉండే రేకును కట్ చేస్తున్నారు. ఆ కన్నం నుంచి నెమ్మదిగా షాపులోకి దిగుతున్నారు. క్యాష్ కౌంటర్‌లో ఉన్న మొత్తాన్ని ఒక కవర్‌లో వేసుకుంటున్నారు. కౌంటర్లకు తాళాలు వేసి ఉంటే పగలగొడుతున్నారు.
బెంజిసర్కిల్ వద్ద మద్యం షాపులో చోరీ
శనివారం అర్ధరాత్రి బెంజిసర్కిల్ వద్ద ఉన్న మద్యం షాపులోకి ఓ వ్యక్తి ఇలాగే ప్రవేశించాడు. జనవరి 31న సితార సెంటర్, మంగళగిరిలో ఉన్న మద్యం దుకాణాల్లోకి ఈ విధంగా దిగారు. ఈ మూడు షాపుల్లో చోరీ చేసిన వ్యక్తుల అవతారాలు ఒకేలా ఉన్నాయి. ఈ ముగ్గురు ఒకే గ్యాంగ్‌గా ఉంటున్నారన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు చోరీలు జరిగిన షాపుల్లోకి నిందితులు సరిగ్గా అర్ధరాత్రి 1-2 గంటల మధ్య దిగినట్టు సీసీ కెమెరాల్లోని ఫుటేజీని బట్టి తెలుస్తోంది. బెంజిసర్కిల్ మద్యం షాపులోని కౌంటర్ నుంచి రూ.20 వేలు దొంగిలించారు. సితార సెంటర్ వద్ద జరిగిన చోరీలోనూఇంతే మొత్తాన్ని చోరీ చేశారు. మంగళగిరిలోని మద్యంషాపు నుంచి మాత్రం రూ.3 లక్షలు తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే, వీరు చడ్డీగ్యాంగ్‌కు సంబంధించిన వారు కాదని పోలీసులు చెబుతున్నారు. మద్యం షాపుల్లో ఇప్పటివరకు జరిగిన చోరీలన్నీ స్థానిక దొంగల పనేనంటున్నారు. చడ్డీగ్యాంగ్ ఈ చోరీలు చేసిందని దృష్టిని మళ్లించడానికే ఇలా చేస్తున్నారని పోలీసులు పేర్కొంటున్నారు. వాస్తవానికి చడ్డీగ్యాంగ్‌లోని వ్యక్తులు ముఖానికి ముసుగు ధరించి, అండర్‌వేర్ వేసుకుని, ఒంటికి నూనె గానీ, గ్రీజు గానీ రాసుకుంటారు. వారి చేతులకు గ్లౌజ్‌లు ఉంటాయి. తాజాగా మద్యం దుకాణాల్లో జరిగిన చోరీల్లో ఫుటేజీలను పరిశీలిస్తే.. ఈ దొంగలకు గ్లౌజ్‌లు లేకపోవడంతో పోలీసు వర్గాలు స్థానికతను పరిగణనలోకి తీసుకుంటున్నారు.
Updated Date - Feb 10 , 2025 | 12:55 AM