అవే తప్పులు
ABN, Publish Date - Feb 10 , 2025 | 12:52 AM
భూముల రీసర్వేలో మళ్లీ గత తప్పిదాలే చోటుచేసుకుంటున్నాయి. క్షేత్రస్థాయిలో సర్వేయర్ల నిర్లక్ష్యం, నిర్వాకాల కారణంగా సర్వే నెంబర్ల రీ ఫిక్సేషన్‌ను సరిగ్గా చేయట్లేదని రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా కాకుండా, గ్రామ సర్వేయర్ల ఇష్టారాజ్యంగా రీసర్వే జరగటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.

భూముల రీసర్వేలో గ్రామ సర్వేయర్ల నిర్వాకాలు
టార్గెట్లు నిర్దేశించకున్నా హడావిడిగా పనులు
సర్వేలో భూమి ఎక్కువగా తేలితే బేరాలు
క్షేత్రస్థాయిలో పరిశీలన లేకుండానే లెక్కలు
గూగుల్ మ్యాప్ ఆధారంగా అస్తవ్యస్తంగా..
అర్జీలు పరిష్కారమయ్యాయని సంతకాలకు డిమాండ్
లబోదిబోమంటున్న భూ యజమానులు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలోని భూముల రీసర్వే కొత్త సమస్యలు తెచ్చి పెడుతోంది. గ్రామ సర్వేయర్లు బేరాలు పెట్టడం మొదలుపెట్టేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరపకుండా సర్వే నెంబర్‌ను, అందులోని సబ్ డివిజన్స్ పరిధిలోని భూములను పరిశీలించకుండా, కనీసం రైతులతో కూడా మాట్లాడకుండా పని కానిచ్చేస్తున్నారు. గూగుల్ మ్యాప్ ఆధారంగా ఓ అంచనాకు వచ్చి, ఆ భూమి నాలుగు వైపులా కొలతలు తీసుకుని రీసర్వే చేసేస్తున్నారు.
సమస్యలు ఇలా..
భూముల శిస్తుల కోసం బ్రిటీషు కాలంలో బీ నెంబర్లు ఇచ్చారు. 1925లో సరిహద్దు బౌండరీల చట్టం ఏర్పడ్డాక రీ సర్వే ప్రారంభమైంది. ఒక సర్వే నెంబర్‌లో గరిష్టంగా 20 ఎకరాల్లోపు ఉంటుంది. మాగాణి అయితే 10, మెట్ట అయితే 20 ఎకరాల్లోపు ఉంటుంది. రీ సర్వేలో ముఖ్యంగా సదరు సర్వే నెంబర్‌లో ఎంతమంది ఉన్నారు, విస్తీర్ణం ఎంత.. అనేది రీ ఫిక్సేషన్ చేయాలి. ఇది ఎంత సమర్థవంతంగా చేయగలిగితే రీసర్వే అంత చక్కగా ఉంటుంది. నిర్ణీత పరిమాణం కంటే భూమి ఎక్కువ ఉంటే.. ఆ సర్వే నెంబర్ పరిధిలోని వారికే తలా కొంత పంచుతూ సర్దుబాటు చేయాలి. కానీ, కొంతమంది సర్వేయర్లు ఆ మిగులు భూమిని వేరే సర్వే నెంబర్‌లోని వారికి కలపటానికి బేరాలు కుదుర్చుకుంటున్నారు. ఒకచోట ఉన్న ఎక్కువ భూమిని మరో సర్వే నెంబర్‌లోని తాను బేరం కుదుర్చుకున్న సబ్ డివిజన్ హోల్డర్‌కు కలిపితే రీసర్వేలో శాస్ర్తీయత కనిపించదు. ఎక్కువ, తక్కువలు రావటానికి దోహదపడుతుంది. భవిష్యత్తులో ఇది సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి సర్వేయర్లు సర్వే నెంబర్ల ప్రాతిపదికన కాకుండా ఆ గ్రామ ఫీల్డ్ మెజర్‌మెంట్ బుక్ (ఎఫ్‌ఎంబీ) ఆధారంగా రీ ఫిక్సేషన్‌ను సక్రమంగా చేపట్టాలి. అలాగే, కొన్ని సర్వే నెంబర్లలో భూమి తక్కువగా చూపించే అవకాశముంది. పూర్వం రోజుల్లో గొలుసులతో కొలవటం వల్ల అంత ప్రామాణికంగా సర్వే జరగకపోయి ఉండొచ్చు. కాల్వగట్లను, ఇతర పోరంబోకులను కూడా కలుపుకొని అప్పట్లో మాన్యువల్ విధానంలో ఎక్కువగా నమోదు చేయించుకుని ఉండొచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ, తక్కువలు తప్పకుండా వస్తాయి. ఎక్కువ వస్తే బేరాలు పెట్టుకుని వేరే సర్వే నెంబర్ల వారికి కలిపి చూపటం, తక్కువ వస్తే వారికి అర్థమయ్యేలా చెప్పకపోవటం వంటి అంశాలు ప్రస్తుతం రీసర్వేలో ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ఆరోజు ఎంతమందికి రీసర్వే పూర్తి చేశామని సర్వేయర్లు ఆలోచిస్తున్నారే కానీ, గ్రామం అనే పరిధిని దృష్టిలో ఉంచుకుని నిర్వహించటం లేదన్న విమర్శలు భూ యజమానుల నుంచి వస్తున్నాయి. సర్వే నెంబర్ల రీ ఫిక్సేషన్ సక్రమంగా జరగకపోతే పోరంబోకు భూములు అన్యాక్రాంతమయ్యే పరిస్థితి ఉంది.
రైతులపై సర్వేయర్ల ఒత్తిడి
కిందటి వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అడ్డగోలు సర్వేతో రైతుల భూములకు సంబంధించి చాలా వివాదాలు తలెత్తాయి. ఎన్టీఆర్ జిల్లాలోనే 3 వేల వరకు రైతుల నుంచి ప్రజా ఫిర్యాదుల వేదికకు ఫిర్యాదులు అందాయి. కృష్ణాజిల్లాలో పరిస్థితి కూడా అదే. మొత్తంగా 6 వేల వరకు అర్జీలు అందాయి. వీటి పరిష్కారం రెవెన్యూ అధికారులకు తలనొప్పిగా మారింది. ఆరు నెలలుగా బాధితులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఏ ప్రయోజనం లేదు. కాగా, ఈ అర్జీలను పరిష్కరించాల్సిన అధికారులు రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. మీరు పెట్టిన అర్జీలు పరిష్కారమయ్యాయని సంతకం చేసి ఇవ్వాలంటున్నారు. ఇలా చే స్తే పెండింగ్ శాతాన్ని తగ్గించుకోవచ్చన్నది వీఆర్వోలు, సర్వేయర్ల అభిప్రాయం. కానీ, ఇలాంటి అర్జీలకు సంబంధించి కూడా రీసర్వే చేస్తే సమస్య పరిష్కారమవుతుంది. ఆ పని మాత్రం చేయట్లేదు. గ్రామానికో సర్వేయర్ ఉన్నా సమస్యను ఎందుకు పరిష్కరించటం లేదో అర్థంకాని పరిస్థితి. ఈ అంశాలపై రెండు జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు సీరియస్‌గా దృష్టి సారించకపోతే రైతుల్లో అసంతృప్తి పెరిగే అవకాశముంది.
Updated Date - Feb 10 , 2025 | 12:52 AM