ఆపరేషన్ ఇండస్ట్రీస్
ABN, Publish Date - Jan 05 , 2025 | 01:22 AM
అమరావతి రాజధాని ప్రాంత పరిధిలో అంతర్భాగంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవాంతరాలు రాకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఇండస్ర్టీ సేఫ్టీ దిశగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం కదిలింది. పారిశ్రామిక ప్రమాదాలను నివారించడం ప్రధానమని గ్రహించి, ఆపరేషన్ ఇండస్ర్టీస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లావ్యాప్తంగా ఉన్న పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలను మరింత పటిష్టం చేసేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అధికార యంత్రాంగాలను తట్టి లేపడంతో పాటు పరిశ్రమల యాజమాన్యాలు వీటిపై దృష్టి సారించేలా అప్రమత్తం చేయాలని నిర్ణయించింది.
పరిశ్రమల్లో మాక్‌డ్రిల్ తప్పనిసరి
యాజమాన్యాలు, జిల్లా యంత్రాంగం సమష్టి కృషితో ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
పరిశ్రమల భద్రతా కమిటీ ఎన్టీఆర్ జిల్లా సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ
విజయవాడ /వన్‌టౌన్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): విజయవాడలోని కలెక్టరేట్‌లో శనివారం జిల్లా పరిశ్రమల భద్రతా కమిటీ సమావేశం కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలో 47 రిజిస్టర్డ్ ఫ్యాక్టరీలు ఉన్నాయని, వీటిలో 44,096 మంది కార్మికులు పనిచేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. కార్మికుల రక్షణకు యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమలు, కార్మికశాఖ, ఫ్యాక్టరీలు, కాలుష్యనియంత్రణ మండలి, అగ్నిమాపక అధికారులు సమన్వయంతో ప్రమాద నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా క్రైసిస్ కమిటీకి భద్రతా చర్యలను పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు. కొండపల్లి, కట్టుబడివారిపాలెంలో గెయిల్ ఇండియా, హెచ్‌బీసీఎల్, బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఎన్టీటీపీఎస్, ల్యాంకో కొండపల్లి పవర్ ప్రాజెక్టు పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు అనుసరించాల్సిన ప్రామాణిక విధానాలను కచ్చితంగా పాటించాలన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే కాకుండా ముందుగానే రక్షణ చర్యలు తీసుకున్నట్లయితే కార్మికుల విలువైన ప్రాణాలను కాపాడగలుగుతామన్నారు. పరిశ్రమల్లో ఉన్న చిన్న లోపాలను గుర్తించి తెలియజేసిన కార్మికులకు అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. కర్మాగారాల్లోనే కాకుండా నగరంలోని ప్రధాన వాణిజ్య కూడళ్లు, అపార్టుమెంట్లు, ప్రధాన కాలువలు, రిజర్వాయర్లు ఉండటం వల్ల ఏదైనా ప్రమాద సంఘటన జరిగితే ప్రాణాలు రక్షించుకునేలా అగ్నిమాపక శాఖ, పోలీసు శాఖలు తప్పనిసరిగా మాక్‌డ్రిల్లు నిర్వహించాలన్నారు. ఏ చిన్నపాటి నిర్లక్ష్యం కూడా తగదని సూచించారు. క్రైసిస్ గ్రూప్ సభ్యులు కర్మాగారాలలో భద్రతా చర్యలను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ఫ్యాక్టరీల్లో ప్రమాదాల నివారణకు, ప్రమాదాల సమయంలో చేపట్టాల్సిన అత్యవసర చర్యలకు అటు కార్మికుల్లోనే కాకుండా, ప్రజల్లోనూ అవగాహన కల్పించాలన్నారు. ఐటీఐ కళాశాల విద్యార్థులకు కర్మాగారాల్లో అనుసరించాల్సిన రక్షణ చర్యలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రమాదం ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న పరిశ్రమల్లో తనిఖీలు చేయాలన్నారు. ఏఏ భద్రతా చర్యలు తీసుకున్నది యాజమాన్యాలు, యంత్రాంగానికి తెలియజేయాలన్నారు.
కార్మికుల రక్షణ ముఖ్యం
పారిశ్రామిక అభివృద్ధి ఎంత అవసరమో, కార్మికుల రక్షణ కూడా అంతే అవసరమని పేర్కొన్నారు. పొరపాట్లకు తావులేకుండా భద్రతలో, ప్రమాద నివారణలో నిబంధనలను పాటిస్తూ ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దుదామని పేర్కొన్నారు. ఒక చిన్న మానవ తప్పిదం వల్ల కార్మికులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం రాకూడదని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో క్రైసిస్ గ్రూప్ కమిటీ కన్వీనర్ పరిశ్రమల ఉప ముఖ్య తనిఖీ అధికారి ఎం.వి.శివకుమార్ రెడ్డి, ఫ్యాక్టరీల ఇన్సెపెక్టర్ పి.రాజు, జిల్లా ఫైర్ ఆఫీసర్ ఎ.వి.శంకర్‌రావులతో పాటు ఆయా ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, పరిశ్రమల యాజమాన్యం ప్రతినిధులు పాల్గొన్నారు.
Updated Date - Jan 05 , 2025 | 01:22 AM