తిరువూరు వైసీపీలో తిరుగుబాటు

ABN, Publish Date - Mar 14 , 2025 | 12:17 AM

తిరువూరు మునిసిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్ల యుద్ధం తారస్థాయికి చేరింది. చైర్‌పర్సన్‌ గత్తం కస్తూరిబాయిపై అవిశ్వాసం ప్రకటించిన అసమ్మతి కౌన్సిలర్లు గురువారం విజయవాడలో కలెక్టర్‌ లక్ష్మీశకు నోటీసు అందించారు.

తిరువూరు వైసీపీలో తిరుగుబాటు

మునిసిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్ల అవిశ్వాస అస్త్రం

చైర్‌పర్సన్‌పై అవిశ్వాసానికి కలెక్టర్‌కు నోటీసు

అసమ్మతి కౌన్సిలర్ల రహస్య సమావేశం

అధిష్ఠాన ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిర్ణయాలు

తిరువూరు, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : తిరువూరు మునిసిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్ల యుద్ధం తారస్థాయికి చేరింది. చైర్‌పర్సన్‌ గత్తం కస్తూరిబాయిపై అవిశ్వాసం ప్రకటించిన అసమ్మతి కౌన్సిలర్లు గురువారం విజయవాడలో కలెక్టర్‌ లక్ష్మీశకు నోటీసు అందించారు. వైసీపీ అసమ్మతి కౌన్సిలర్లు మోదుగు ప్రసాద్‌, మోడు దుర్గారావు, పసుపులేటి శేఖర్‌బాబు తదితరులు ఈ నోటీసును కలెక్టర్‌కు అందించారు. తిరువూరు మునిసిపాలిటీలో మొత్తం 20 మంది కౌన్సిలర్లలో అవిశ్వాసం నోటీసు ఇచ్చేందుకు సుమారు 11 మంది సంతకాలు అవసరం. దీంతో వైసీపీ అసమ్మతి కౌన్సిలర్లు గురువారం ఉదయం తిరువూరులో భేటీ అయ్యారు. అవిశ్వాసంపై సంతకాలు సేకరించారు.

అధిష్ఠానాన్ని బేఖాతరు చేస్తూ..

తొలి నుంచి తమకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోని అధిష్ఠానం.. ఇప్పుడు తమ ప్రయత్నాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తుండటాన్ని కొందరు వైసీపీ కౌన్సిలర్లు తప్పుబడుతున్నారు. మునిసిపాలిటీలో 20 వార్డులకు 17 స్థానాలు వైసీపీ గెలుపొందింది. 2021, మార్చిలో బోర్డు ఏర్పాటుకు తొలుత చైర్‌పర్సన్‌గా 15వ వార్డు నుంచి గెలుపొందిన మోదుగు ప్రసాద్‌ పేరును అధిష్ఠానం ప్రకటించింది. ఆ తర్వాత కొన్ని సామాజిక సమీకరణల నేపథ్యంలో చైర్‌పర్సన్‌గా కస్తూరిబాయిని పార్టీ ఎంపిక చేసింది. ఆమె ప్రమాణ స్వీకారం సందర్భంలో.. రెండేళ్ల తర్వాత రాజీనామా చేయాలని, ఆ తర్వాత ప్రసాద్‌ను చైర్‌పర్సన్‌గా ఎంపిక చేయాలని పార్టీ పెద్దలు సూచించారు. రెండున్నరేళ్లయినా ప్రస్తుత చైర్‌పర్సన్‌ గద్దె దిగలేదు. పైగా అధిష్ఠానం ఆదేశిస్తే రాజీనామా చేస్తామని చెప్పడంతో వైసీపీ కౌన్సిలర్లలో అంతర్గత పోరు నెలకొంది.

అవిశ్వాసం పెట్టి తీరుతాం

మునిసిపల్‌ చైర్‌పర్సన్‌పై ఎట్టి పరిస్థితుల్లోనూ అవిశ్వాస తీర్మానం పెట్టి తీరుతామని వైసీపీ అసమ్మతి కౌన్సిలర్లు.. కలెక్టర్‌కు నోటీసు అందించారు. ఇటీవల జరిగిన కౌన్సిల్‌ సమావేశానికి ముందురోజు పార్టీ ఇన్‌చార్జి స్వామిదాసు అసమ్మతి కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరు కావాలని, జగన్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకుని ఆయన సమక్షంలో అవిశ్వాసంపై నిర్ణయం తీసుకుందా మనే ప్రతిపాదన తీసుకొచ్చారు. కౌన్సిల్‌ సమావేశానికి గైర్హాజరైన కొందరు అసమ్మతి కౌన్సిలర్లు తమ సంతకాలతో కూడిన అవిశ్వాస నోటీసును కలెక్టర్‌కు అందజేశారు. దీంతో మునిసిపాలిటీలో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని పట్టణ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.

Updated Date - Mar 14 , 2025 | 12:17 AM