గాలివాన బీభత్సం

ABN, Publish Date - Apr 08 , 2025 | 01:05 AM

గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు తోడు దుమ్మూధూళి, జోరువర్షం కూడా రావడంతో బెజవాడ గజగజలాడింది. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మారిన వాతావరణానికి నగరవాసులు అతలాకుతలం కాగా, విజయవాడ రూరల్‌ మండలాల్లోని రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. మామిడి, మొక్కజొన్న నేలరాలగా, కల్లాల్లో ఉన్న ధాన్యంపై పట్టాలు కప్పే సమయం కూడా లేకుండాపోయింది. మీనాక్షి నగర్‌లో ఓ రేకుల షెడ్డు కూలిపోగా, జి.కొండూరులో గోడ కూలి వ్యక్తి మరణించాడు. మరో రెండు మూడు రోజుల పాటు ఈ వాతావరణం కొనసాగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

గాలివాన బీభత్సం
ఇబ్రహీంపట్నం రింగ్‌ సెంటర్‌లో గాలి దుమ్మూధూళి

జిల్లాను కుదిపేసిన ఈదురుగాలులు, వర్షాలు

ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం

నగరంలో భారీగాలులకు జనజీవనం అస్తవ్యస్తం

రూరల్‌ మండలాల్లో పంటలకు తీవ్రనష్టం

నేలరాలిన మామిడి కాయలు, మొక్కజొన్న

కల్లాల్లోని ధాన్యంపై పట్టాలు కూడా కప్పుకోలేని స్థితి

జి.కొండూరులో కోళ్లఫారం గోడ కూలి కండక్టర్‌ మృతి

మీనాక్షి నగర్‌లో కూలిన రేకుల షెడ్డు

పలుచోట్ల విద్యుత సరఫరాకు అంతరాయం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : అప్పటి వరకు వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. చెట్లన్నీ అటూ ఇటూ ఊగాయి. గాలులకు దుమ్ముధూళి పైకి లేచింది. జిల్లాలో సోమవారం సాయంత్రం గంటపాటు కనిపించిన దృశ్యాలివి. విజయవాడతో పాటు నగరానికి 30-40 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ముందు ఈదురుగాలులు.. ఆ తర్వాత వర్షం మొదలైంది. గాలులకు దుమ్ముధూళి పైకి లేవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు. మామిడి నేల రాలింది. మైలవరం, నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లోని మైలవరం, రెడ్డిగూడెం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్‌ మండలం, వీరులపాడు మండలం జుజ్జూరులో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. రెడ్డిగూడెంలో భారీవర్షం కురిసింది. ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్‌ మండలంలో కల్లాల్లో ఉన్న ధాన్యంపై పట్టాలు కప్పే సమయం ఇవ్వకుండా గాలులు బీభత్సం సృష్టించాయి. హోరున కురిసిన వర్షానికి ధాన్యం తడిచి ముద్దయింది. జి.కొండూరు మండలంలో మిర్చిపంట తడిచిపోయింది. రెడ్డిగూడెం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద చెట్టు విరిగిపోయింది. మైలవరం మండలంలో మామిడి కాయలు రాలిపోయాయి. ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి గ్రామంలో మొక్కజొన్న రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. వీరులపాడు మండలం జుజ్జూరులో మొక్కజొన్న పంట మొత్తం నేలవాలింది. విస్సన్నపేటలో వర్షం కురవకపోయినా ఈదురుగాలులు మాత్రం భారీగా వీచాయి. ఈ గాలులకు ఓ తాటిచెట్టు పక్కనే ఉన్న విద్యుత తీగలపై పడిపోయింది. దీంతో విద్యుతకు అంతరాయం ఏర్పడింది. విజయవాడలోని ఉడా కాలనీలో పలువీధుల్లో చెట్లు నేల కూలాయి.

కూలిన రేకుల షెడ్డు

పాతపాడు పంచాయతీ పరిధిలోని మీనాక్షి నగర్‌లో ఓ రేకుల షెడ్డు కూలిపోయింది. ఒకటో లైన్‌లోని రాజు అనే వ్యక్తి నూతనంగా నిర్మించిన రేకుల షెడ్డు పైభాగం అమాంతం ఎగిరి పక్కనే ఉన్న ఖాళీస్థలంలో పడిపోయింది. ఇంట్లోని సామాన్లు మొత్తం రోడ్డు పైకి ఎగిరి పడ్డాయి. ఆ సమయంలో ఇంట్లోని ఐదుగురు పాయకాపురంలోని బంధువుల ఇంటికి వెళ్లడంతో పెనుప్రమాదం తప్పింది.

వెంటాడిన మృత్యువు

ఈదురు గాలుల బీభత్సానికి ఓ వ్యక్తి మృతిచెందాడు. జి.కొండూరుకు చెందిన ఉయ్యూరు మంగారావు (45) ఆర్టీసీలో కండక్టర్‌ పనిచేస్తున్నారు. ఆయన సోమవారం సాయంత్రం ఇద్దరు స్నేహితులతో కలిసి పినపాక రోడ్డుపైకి వెళ్లారు. ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడి వర్షం పడటంతో సమీపంలో పాడుబడిన కోళ్లఫారం వద్దకు పరుగులు తీశారు. వారు వెళ్లిన క్షణంలోనే గాలుల వేగానికి కోళ్లఫారం గోడ కూలిపోయింది. అతని వెనుక ఉన్న ఇద్దరు స్నేహితులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నాయి. ఈ ఘటనతో జి.కొండూరులో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

బూడిద ముసుగు

ఇబ్రహీంపట్నం ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఎన్టీటీపీఎస్‌ పక్కన ఉన్న ఫ్లైయాష్‌ ఈ గాలులకు ఎగిరింది. అక్కడున్న ఇళ్లను ఈ బూడిద కమ్మేసింది. బూడిద ఎగిరి ఇళ్లలోకి చేరింది. వాహనదారుల కళ్లలో పడటంతో వారు ఇబ్బందులు పడ్డారు.

థండర్‌సా్ట్రమ్‌ల వల్లే..

వరుసగా కొన్ని రోజులపాటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదైతే తర్వాత థండర్‌సా్ట్రమ్‌లు ఏర్పడతాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. అందులో భాగంగానే ఈదురుగాలులు, వర్షాలు వస్తున్నాయని వారు అభిప్రాయ పడుతున్నారు. నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో గంటకు 100 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. ఈ పరిస్థితి మరో రెండు, మూడు రోజులు ఉంటుందని పేర్కొంటున్నారు.

Updated Date - Apr 08 , 2025 | 01:05 AM