లీడ్ వర్కర్ల దారుణాలు
ABN, Publish Date - Mar 14 , 2025 | 12:22 AM
విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌లోని పారిశుధ్య విభాగంలో లీడ్ మేసీ్త్రల దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆ పదవులను అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా, శానిటరీ ఇన్‌స్పెక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్న వీరి తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళా కార్మికులపై వేధింపులు, వడ్డీల పేరిట దోపిడీ వ్యవహారాలు కార్పొరేషన్‌ను కుదిపేస్తున్నాయి.

శానిటరీ ఇన్‌స్పెక్టర్లతో వసూళ్ల వ్యవహారాలు
ఉద్యోగాలు వదిలేసి వడ్డీ వ్యాపారాలు
మహిళా కార్మికులకు లైంగిక వేధింపులు
పారిశుధ్య కార్మికుల నుంచి భారీ వసూళ్లు
తోపుడుబళ్ల నుంచి ఇష్టానుసారంగా..
(ఆంధ్రజ్యోతి, కార్పొరేషన్) : విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 64 డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్‌లో 40 నుంచి 100 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరిని పర్యవేక్షించడానికి శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఉంటారు. వారికి దిగువన శానిటరీ మేసీ్త్రలు పనిచేస్తారు. వీరి ఆధీనంలో వర్కర్లు పనిచేయాల్సి ఉంటుంది. అయితే, మేస్ర్తీలను వేరే పనులకు కేటాయించి, వారి స్థానంలో తమకు కావాల్సిన వారిని లీడ్ వర్కర్లుగా నియమించుకున్నారు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు. కార్పొరేషన్‌లో ఎక్కడా లీడ్ వర్కర్ పోస్టు లేకపోయినా వారి సౌలభ్యం కోసం శానిటరీ ఇన్‌స్పెక్టర్లు నియామకాలు జరపడం గమనార్హం.
మహిళా కార్మికులపై కన్ను
తమకు పైన ఉండే శానిటరీ ఇన్‌స్పెక్టర్ల అండదండలు ఉండటంతో లీడ్ వర్కర్లు ఉద్యోగ విధులను వదిలేసి పక్క వ్యవహారాలు చక్కబెడుతున్నారు. వసూలు కార్యక్రమాలు చేపడుతున్నారు. 64 డివిజన్లలో ఒక్కో డివిజన్‌కు 40 నుంచి 100 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో మహిళలు, పురుషులు ఉంటారు. మహిళలపై కొంతమంది లీడ్ వర్కర్లు కన్నేశారు. వారిని లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తమ ప్రతిపాదనలను అంగీకరించని మహిళలను పని ఒత్తిడి పేరుతో నానా హింసలు పెడుతున్నారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. వేధింపులపై నోరు తెరిస్తే ఉద్యోగాలకు ఇబ్బందులు తలెత్తుతాయని కొందరు మహిళా కార్మికులు బయటకు రావట్లేదు.
భారీగా వడ్డీ వ్యాపారం
ఈ లీడ్ వర్కర్లు నగరవ్యాప్తంగా భారీ మొత్తంలో వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కార్మికుల అవసరాలను గుర్తించి వారికి అధిక వడ్డీకి డబ్బు ఇస్తున్నారు. నూటికి రూ.10 నుంచి రూ.20 వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్లు కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారని సమాచారం. అప్పులు తీసుకున్న వారి నుంచి ఏటీఎం కార్డులు, ఖాళీ చెక్కులు, నోట్‌లు తీసుకుని తమ వద్ద పెట్టుకుంటున్నారు. జీతాలు అకౌంట్‌లో జమ కాగానే, లీడ్ వర్కర్లే వడ్డీని మినహాయించుకుని మిగిలిన డబ్బు పారిశుధ్య కార్మికులకు ఇస్తున్నారు.
కార్మికుల నుంచి నెలవారీ మామూళ్లు
64 డివిజన్లలో సుమారు 2వేల మంది కార్మికులు ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తారు. ఆ సమయంలో ఇళ్ల నుంచి వచ్చే పాలప్యాకెట్లు, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేసి వ్యాపారులకు అమ్ముకుంటుంటారు. అలా కార్మికులకు రోజుకు రూ.100 వస్తుండగా, ఆ డబ్బులో కూడా నెలకు రూ.1,000 లీడ్ వర్కర్లు వసూలు చేస్తున్నారు. అలాగే, తోపుడు బళ్ల నుంచి నెలవారీ వసూళ్లు చేస్తున్నారు. పారిశుధ్య పనులు మినహా మిగతా అన్ని అవినీతి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కమిషనర్ స్పందించి చర్యలు తీసుకోకుంటే రానున్న రోజుల్లో పారిశుఽధ్య నిర్వహణ కష్టసాధ్యంగా మారుతుంది. పలు డివిజన్లలో పనిచేస్తున్న శానిటరీ సూపర్‌వైజర్లతో పాటు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, లీడ్ వర్కర్లు వడ్డీ వ్యాపారాల పేరిట కార్మికులను దోచుకుంటున్న వ్యవహారాలు ఇప్పుడు కార్పొరేషన్‌లో చర్చనీయాంశంగా మారాయి.
Updated Date - Mar 14 , 2025 | 12:22 AM