ఎంతో కోల్పో‘యినాం’.. సమస్య పరిష్కరించండి

ABN, Publish Date - Mar 14 , 2025 | 12:19 AM

నందిగామలోని సీఎం రోడ్డులో నివాసముంటున్న వీరమాచినేని కృష్ణమోహన్‌ తండ్రి 1974లో ఏడు సెంట్ల స్థలం కొన్నాడు. తండ్రి నుంచి కృష్ణమోహన్‌కు 3.75 సెంట్ల స్థలం వచ్చింది. ప్రస్తుతం పిల్లలిద్దరూ బీటెక్‌ చదువుతున్నారు. ఆయన పిల్లల చదువుకు ఆర్థికంగా పలు ఇబ్బందులు పడుతున్నాడు. రిజిసే్ట్రషన్‌ లేనందున ఆ భూమిని అమ్ముదామనుకుంటే ఎవరూ రావట్లేదు. రుణం తీసుకుందామన్నా బ్యాంకులు ఇవ్వట్లేదు. మహమ్మద్‌ బడేమియా సర్వే నెంబర్‌ 646/1సీ1లో మూడు దశాబ్దాల కిందట 2.50 ఎకరాలు కొన్నాడు. జాతీయ రహదారి విస్తరణలో అర ఎకరం పోయింది. మిగతా రెండెకరాల భూమికి దస్తావేజులు, పాసుపుస్తకం ఉన్నాయి. కూతురుకు కట్నంగా ఇచ్చిన ఆ భూమిని వారి పేరిట మార్చేందుకు వీలు పడకపోవటంతో కుటుంబపరంగా సమస్యలు తలెత్తాయి. దీంతో బడేమియా మానసికంగా కుమిలిపోతున్నాడు.

ఎంతో కోల్పో‘యినాం’.. సమస్య పరిష్కరించండి
ఇనాం భూములు అధికంగా ఉన్న నందిగామ ప్రాంతం

జిల్లాలోని ఈనాం భూ బాధితుల మొర

రెండు జిల్లాల్లో 3,511 ఎకరాల్లో ఈనాం భూములు

నిషేధిత భూములతో యజమానుల అష్టకష్టాలు

రిజిసే్ట్రషన్‌ లేక, రుణాలు రాక ఇబ్బందులు

ఇంకెన్నాళ్లు ఈ కష్టాలంటూ ప్రభుత్వానికి మొర

నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ ప్రభుత్వానికి వినతులు

(ఆంధ్రజ్యోతి, కంచికచర్ల) : స్వాతంత్ర్యానికి పూర్వం రాజులు, జమిందార్లు దేవాలయాలకు సేవలందించే వారి జీవనోపాధి నిమిత్తం సాగు భూములను ఈనాం (విరాళం)గా ఇచ్చారు. స్వాతంత్య్రం వచ్చాక రాచరిక, జమిందారీ వ్యవస్థలు రద్దు కావటంతో 1956లో ప్రభుత్వం ఈనాం చట్టాన్ని తీసుకొచ్చింది. అర్హులైన వారికి అధికారులు రైత్వారీ పట్టాలిచ్చారు. కాలక్రమేణా కొంతమంది కుటుంబ అవసరాలకు అమ్ముకున్నారు. భూములు చేతులు మారాయి. గ్రామాలు, పట్టణాలుగా విస్తరించటంతో ఎక్కువ శాతం భూములు, స్థలాలుగా మారాయి. ఎక్కడికెక్కడ విలువైన భవనాలు, అపార్టుమెంట్లు పుట్టుకొచ్చాయి. కొత్తకొత్త కాలనీలు వెలిశాయి. పట్టణాల్లో అంతర్భాగమయ్యాయి. అయితే, 2013లో ఈనాం భూములపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో సర్వీస్‌ ఈనాం భూముల రిజిసే్ట్రషన్‌ను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయాల్సి వచ్చింది. 2013లో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఈనాం ల్యాండ్‌ ఎబాలిషన్‌ చట్టానికి చేసిన సవరణలో చిన్న తప్పిదం వల్ల అంతా తారుమారైంది. సవరణలో విత ప్రాస్పెక్టివ్‌ ఎఫెక్ట్‌ అని ఉండాల్సి ఉండగా, విత రెట్రాస్పెక్టివ్‌ అని ఇవ్వటంతో 1956 ఈనాం ఎబాలిష్‌ యాక్టు దగ్గర నుంచి జరిగిన లావాదేవీలన్నీ నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. వాస్తవానికి 2013 వరకు సర్వీసుదారులుగా ఉన్నవారికి ఈనాం భూములు చెందాలని, 2013 తర్వాత కొత్తగా ఇవ్వరాదని చట్ట సవరణ చేయగా, అక్షరం తప్పిదం వల్ల అప్పటికే రాష్ట్రంలో ఈనాం భూములు కొన్న వేలమంది చిన్న, మధ్యతరగతి కుటుంబాల వారు బాధితులయ్యారు.

ఆర్డినెన్స్‌ను తొక్కిపెట్టిన వైసీపీ

ఈనాం భూముల క్రయవిక్రయాలు నిలిచిపోవటం, రిజిసే్ట్రషన్లు లేకపోవటం వల్ల పడుతున్న ఇబ్బందులను పలువురు బాధితులు 2019లో అప్పటి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌ ఈనాం (ఎబాలిషన్‌ అండ్‌ కన్వర్షన్‌ ఇన్‌ టూ రైత్వారీ) అమెండ్‌మెంట్‌ ఆర్డినెన్స్‌-2019 పేరుతో ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. దీని ప్రకారం 2013కు ముందు ఇచ్చిన పట్టాలు చెల్లుబాటు అవుతాయి. అయితే, ఈనాం సర్వీసు భూముల అంశం కేంద్ర, రాషా్ట్రలకు సంబంధించిన ఉమ్మడి జాబితాలో ఉన్నందున అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపారు. దీనికి చట్టబద్ధత కల్పించాల్సి ఉండగా, ఈలోగా అధికారంలోకి వచ్చిన వైసీపీ పూర్తిగా పక్కన పడేసింది. చట్టబద్ధత కల్పిస్తే క్రెడిట్‌ అంతా చంద్రబాబుకు దక్కుతుందని జగన్‌ ఆమోదముద్ర వేయలేదు. దీంతో ఆర్డినెన్స్‌కు కాలం చెల్లింది. బాధితులు పలుమార్లు విన్నవించినప్పటికీ పెడచెవిన పెట్టారు. దీంతో ఈనాం భూముల సమస్య మళ్లీ మొదటికొచ్చింది.

ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఇలా..

ఉమ్మడి కృష్ణాజిల్లాలో 3,511.88 ఎకరాల ఈనాం భూములున్నాయి. నందిగామలో 650 ఎకరాలు, జగ్గయ్యపేటలో 400 ఎకరాలు ఉన్నాయి. ఈ రెండు పట్టణాల్లో కలిపి 16 వేల మందికిపైగా బాధితులు ఉన్నారు. పుష్కర కాలంగా వారంతా ఇబ్బంది పడుతున్నారు. పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు, వైద్యానికి, ఇతరత్రా కుటుంబ అవసరాలకు అమ్ముకునేందుకు వీలుపడని దుస్థితి నెలకొంది. ఏదో ఒక ధరకు అమ్ముదామనుకున్నా రిజిసే్ట్రషన్‌ లేనందున కొనేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. తాకట్టు పెట్టుకుని రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సైతం ముందుకు రావట్లేదు. ఆ భూములన్నీ నిషేధ జాబితా 22 (ఏ) (1)(సీ)లో ఉన్నాయి. నిషేధ జాబితా నుంచి తొలగించాలని బాధితులు కోరుతున్నారు. రెవెన్యూ అధికారులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులను కలిసి వినతులు ఇస్తూనే ఉన్నారు. రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌సీ సిసోడియా దృష్టికి కూడా తీసుకెళ్లారు. మంత్రి నారా లోకేశ్‌, సీఎం చంద్రబాబును సైతం కలిసి తమ గోడు చెప్పుకొన్నారు. సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. అసెంబ్లీ సమావేశాల్లో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ప్రస్తావించారు. పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

బాధితులకు న్యాయం చేయండి

12 ఏళ్లుగా అష్టకష్టాలు పడుతున్నాం. ఇప్పటికే ఒకటికి పదిసార్లు రిజిసే్ట్రషన్లు జరిగిన భూములు, స్థలాలు కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయి. వైసీపీ హయాంలో జగన్‌ సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేశారు. ఆర్డినెన్స్‌కు కావాలనే చట్టబద్ధత కల్పించలేదు. కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. సీఎం చంద్రబాబు పెద్ద మనసుతో నిషేధ జాబితాను తొలగించి, బాధితులకు న్యాయం చేయాలి.

- రాటకొండ రామకోటేశ్వరరావు, రాష్ట్ర ఈనాం భూముల బాధితుల సంఘం నాయకుడు

Updated Date - Mar 14 , 2025 | 12:19 AM