‘కాటి’న్యం

ABN, Publish Date - Mar 14 , 2025 | 12:23 AM

మృతదేహాన్ని ఖననం చేయడానికి గొయ్యి తియ్యాలా రూ.10 వేలు.. తీసిన గొయ్యి వద్ద సమాధి కట్టాలా.. అయితే, రూ.లక్ష. శవాల మీద కూడా చిల్లర ఏరుకునే ఈ పరిస్థితి మరెక్కడో లేదు.. నగరంలోని శ్మశాన వాటికల్లో అడుగడుగునా కనిపిస్తోంది. తమవారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంతో కర్మ భూముల్లో అడుగు పెడుతున్న అయినవారికి అక్కడి కాటి కాపర్లు చెబుతున్న రేట్లు కలవరపెడుతున్నాయి. దహన సంస్కారాలకు, గోతులు తీయడానికి, సమాధుల నిర్మాణానికి వీఎంసీ నిర్దిష్ట ధరలను నిర్ణయించినప్పటికీ అనధికారికంగా శ్మశానాల్లో రాజ్యమేలుతున్న కొందరు ఇలా అందినకాడికి దండుకుంటున్నారు. అడిగినంత చేతిలో పెడితేనే శవాన్ని కదుపుతున్నారు. ఈ దారుణమైన పరిస్థితి గుణదలలోని ఈఎస్‌ఐ ఆసుపత్రి వద్ద ఉన్న శ్మశాన వాటికలో ఎక్కువగా జరుగుతుండగా, కొందరు ప్రైవేట్‌ వ్యక్తుల పెత్తనంపై స్థానిక ఎమ్మెల్యేకు వందల సంఖ్యలు ఫిర్యాదులు అందడం కాటి కష్టాలను తెలియజేస్తోంది.

‘కాటి’న్యం
ఈఎస్‌ఐ ఆసుపత్రి వద్ద శ్మశాన వాటిక

నగరంలోని శ్మశానాల్లో కాటి కాపరుల ‘పైసా’చికం

శవాన్ని పూడ్చే గొయ్యి తవ్వడానికి రూ.10 వేలు

సమాధి నిర్మించాలంటే రూ.లక్ష వరకు వసూలు

డబ్బు ముట్టందే శవం కదలదంతే..

ఈఎస్‌ఐ వద్ద శ్మశాన వాటికలో పరిస్థితి దారుణం

తూర్పు ఎమ్మెల్యేకు వందల సంఖ్యలో ఫిర్యాదులు

ఓ ప్రైవేట్‌ వ్యక్తిపై బాధితుల పోరాటం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : నగరంలో మొత్తం 18 శ్మశానాలు ఉన్నాయి. ఇందులో క్రైస్తవులకు సంబంధించినవి 3. అలాగే, క్రైస్తవులు, హిందువులకు కలిపి 4 శ్మశాన వాటికలున్నాయి. ఇక హిందువులకు ఐదు శ్మశానాలు, ముస్లింలకు ఐదు కబర్‌స్థాన్‌లు ఉన్నాయి. ఎక్కువగా ఎవరైనా చనిపోయినప్పుడు ముస్లింలు, క్రిస్టియన్లు మాత్రమే సమాధులు నిర్మించుకుంటారు. ఈ సంస్కృతి హిందువుల్లో తక్కువగా ఉంటుంది. కాగా, క్రిస్టియన శ్మశాన వాటికలో పరిస్థితి దారుణంగా ఉంటుందని పలువురు కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే గద్దె రామ్మోహనకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా గుణదలలోని ఈఎస్‌ఐ ఆసుపత్రి వద్ద ఉన్న శ్మశాన వాటికలో శవాలను తీసుకొచ్చిన వారి నుంచి దారుణంగా వసూళ్లు చేస్తున్నారని అక్కడున్న వ్యక్తులపై 600 మంది ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

గొయ్యి తీస్తే రూ.10వేలు.. సమాధి అయితే రూ.లక్ష

క్రిస్టియన, ముస్లింలు గోతులు తీసి ఖననం చేస్తారు. కొంతమంది ఈ ఖననం చేసిన ప్రదేశాల్లో సమాధులు నిర్మించుకుంటారు. ఈఎస్‌ఐ ఆసుపత్రి వద్ద ఉన్న శ్మశాన వాటికలో గొయ్యి తవ్వినందుకు రూ.10 వేలు, సమాధి నిర్మించడానికి రూ.లక్ష వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై పలువురు బాధితులు వీఎంసీకి ఫిర్యాదు చేశారు. ప్రయోజనం లేకపోవడంతో ప్రజాప్రతినిధులను ఆశ్రయించారు. నగరంలోని శ్మశాన వాటికలు వీఎంసీలోని ప్రజారోగ్య విభాగం పరిధిలో ఉంటాయి. ముస్లిం, క్రిస్టియన శ్మశానాలకు సంబంధించి ఒక కమిటీ ఉంటుంది. ఏ మతానికి చెందిన వారిని ఆ మతానికి సంబంధించిన శ్మశానంలోనే దహనం, ఖననం చేయాలి. క్రిస్టియన, ముస్లిం శ్మశానాల్లో మృతదేహాలను ఖననం చేయడానికి గొయ్యి తవ్వాల్సి ఉంటుంది. ఖననం చేయాల్సిన ప్రదేశంలో ఎక్కువమంది సమాధులను నిర్మించుకోవాలని భావిస్తారు. దీనికి అక్కడ పనిచేసే కాటికాపర్లు చోటు చూపించాలి. దీన్ని అడ్డుపెట్టుకుని కొన్ని శ్మశానాల్లో డబ్బు భారీగా దండుతున్నారు. ముఖ్యంగా ఈఎస్‌ఐ ఎదురుగా ఉన్న శ్మశాన వాటికలో ఎలాంటి సంబంధం లేని దత్తు అనే వ్యక్తి దారుణంగా వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి కర్మభూముల్లో స్థలాభావం కారణంగా సమాధుల నిర్మాణాన్ని వీఎంసీ నిలుపుదల చేసింది. ఈఎస్‌ఐ ఎదురుగా ఉన్న శ్మశాన వాటిలో ఈ దత్తు అనే వ్యక్తి అనధికారికంగా సమాధులను నిర్మిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనికోసం ఆయా వ్యక్తుల నుంచి రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు వసూలు చేస్తున్నాడని చెబుతున్నారు. వీఎంసీ నిబంధనల ప్రకారం గొయ్యి తవ్వినందుకు రూ.250 వసూలు వసూలు చేయాలి. అతడు మాత్రం రూ.10 వేలు వసూలు చేస్తున్నాడు. ఇదే విషయాన్ని బాధితులు ఎమ్మెల్యే గద్దెకు ఫిర్యాదు చేశారు. శ్మశానంలో సమాధులు నిర్మించుకోవడానికి ఎక్కడా ఖాళీ లేదని చెబుతూ ఇలా.. పెద్ద మొత్తంలో డిమాండ్‌ చేస్తున్నాడని తెలిసింది. దత్తుపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు అందడంతో మరో రాజకీయ నాయకుడు వద్దకు వెళ్లి కాళ్లు పట్టుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఇక్కడ కలపాల ఐజాక్‌, కలపాల ఇమ్మానియేల్‌ కాటికాపర్లుగా ఉంటారని వీఎంసీ గుర్తించింది. శ్మశాన వాటికతో సంబంధం లేని దత్తు కర్మభూమికి వచ్చే వారి నుంచి భారీగా వసూలు చేయడం ఏమిటని అధికారులు సైతం విస్తుపోతున్నారు. అతడిపై చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆపేది లేదని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి.

Updated Date - Mar 14 , 2025 | 12:23 AM