అనధికార మట్టి తోలకాలు
ABN, Publish Date - Jan 09 , 2025 | 01:44 AM
కొత్తూరు తాడేపల్లిలో స్థానిక వైసీపీ నాయకులు వారం నుంచి పోలవరం కాలువ మట్టిని రాత్రి వేళలో పదుల సంఖ్యలో వాహనాల్లో తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కొత్తూరు తాడేపల్లి, పాతపాడులో పోలవరం కాలువ మట్టి తరలిస్తున్న వైసీపీ నేతలు
ముడుపులందడంతో మిన్నకుంటున్నారని అధికారులపై ఆరోపణలు
వన్‌టౌన్, జనవరి 8(ఆంధ్రజ్యోతి): కొత్తూరు తాడేపల్లిలో స్థానిక వైసీపీ నాయకులు వారం నుంచి పోలవరం కాలువ మట్టిని రాత్రి వేళలో పదుల సంఖ్యలో వాహనాల్లో తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొంతమంది ప్రభుత్వ అధికారుల అండదండలతోనే ఈ తోలకాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఫిర్యాదు చేస్తే అధికారులు తమ సిబ్బందితో వెళ్లి తనిఖీలు చేశారే తప్ప మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మట్టితవ్వే యంత్రాలు, మట్టి తరలించే వాహనాలను కనీసం అడ్డుకోలేదని స్థానికులు చెబుతున్నారు. అధికారులు, సిబ్బంది వెళ్లిన కొద్దిసేపటికే మరలా మట్టి తరలిస్తున్నారని అంటున్నారు. మంగళవారం రాత్రి 9 గంటలకు కొత్తూరు తాడేపల్లి నుంచి 17 టిప్పర్లలో గుణదలలోని ఓ వెంచర్‌కు మట్టి తరలిస్తున్నారని సమాచారమందడంతో నున్న పోలీసులు వచ్చారు. 7 వాహనాలను ఆపి డ్రైవర్ల నుంచి వాహనాల సీ బుక్‌లు, సెల్‌ఫోన్లు, వాహనాల తాళాలు స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న వెనక వస్తున్న 10 టిప్పర్ల డ్రైవర్లు వారి వాహనాలను దారి మళ్లించి జన సంచారం లేని ప్రాంతంలో నిలుపుదల చేశారు. పోలీసులు టిప్పర్లను ఆపారని సమాచారం తెలుసుకున్న కొత్తూరు తాడేపల్లికి చెందిన వైసీపీ నాయకుడు బి.రాజు నున్న పోలీసు స్టేషన్ అధికారులతో బుధవారం తెల్లవారుజామున 4 గంటల వరకు మంతనాలు జరిపినట్లు సమాచారం. తరువాత పోలీసు అధికారులు ఆ వాహనాలపై ఎలాంటి కేసు లేకుండా వదిలివేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ఓ అధికారికి పెద్ద మొత్తంలో ముడుపులు అందాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పాతపాడులో 15 రోజుల నుంచి యథేచ్ఛగా..
నున్న - పాతపాడు మధ్య పోలవరం కాలువ మట్టిని పాతపాడుకు చెందిన వారు 15 రోజుల నుంచి యథేచ్ఛగా రాత్రివేళలో పదుల సంఖ్యలో వాహనాలు (టిప్పర్లు)లో తరలిస్తున్నారు. ఈ వ్యవహారంలో పాతపాడుకు చెందిన ఓ వైసీపీ నాయకుడు కీలకంగా వ్యవహరించినట్లు స్థానికులు చెబుతున్నారు. రోజూ లక్షలాది రూపాయల విలువ చేసే మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని స్ధానికులు బహిరంగంగానే చెబుతున్నారు. దీని వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ప్రభుత్వ అధికారులు స్పందించి మట్టిని తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Updated Date - Jan 09 , 2025 | 01:44 AM