వంద పడకల ఆసుపత్రి నిర్మించాలి: ఏఐవైఎఫ్‌

ABN, Publish Date - Mar 22 , 2025 | 01:05 AM

నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి, ఇండోర్‌ స్టేడియం నిర్మించాలని ఏఐవైఎఫ్‌ జిల్లా సహాయకార్యదర్శి రాజివ్‌, మండలాధ్యక్ష, కార్యదర్శులు చిన్న, రాజు డిమాండ్‌ చేశారు.

వంద పడకల ఆసుపత్రి నిర్మించాలి: ఏఐవైఎఫ్‌
ధర్నా చేస్తున్న ఏఐవైఎఫ్‌ నాయకులు

మంత్రాలయం, మార్చి 21(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి, ఇండోర్‌ స్టేడియం నిర్మించాలని ఏఐవైఎఫ్‌ జిల్లా సహాయకార్యదర్శి రాజివ్‌, మండలాధ్యక్ష, కార్యదర్శులు చిన్న, రాజు డిమాండ్‌ చేశారు. శుక్రవారం అంబేడ్కర్‌ సర్కిల్‌ నుంచి రాఘవేంద్ర సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించి మాన వహారం చేసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ నియోజక వర్గ అధ్యక్షుడు జాఫర్‌ పటేల్‌ మాట్లాడుతూ నిత్యం భక్తులు, చట్టుపక్కల గ్రామాల ప్రజలతో రద్దీగా ఉండే మంత్రాలయంలో సరైన వసతులతో కూడిన ప్రభుత్వ ఆస్పత్రి లేకపోవడం శోచనీయమన్నారు. మూడు కి.మీదూరంలో ఉన్న కల్లుదేవకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, శ్రీమఠం ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు లేవన్నారు. అత్యవసర చికిత్సలు అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని వాపోయారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ప్రతిసారి స్థలం లేదని చెబుతున్నారని, రాఘవేంద్రస్వామి మఠానికి చెందిన స్థలం కేటాయిచాలని కోరారు. అదే విధంగా ఫిల్లర్లకే పరిమితమైన ఇండోర్‌స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. నాయకులు నరసింహులు, భాష, మురళి, విజయ్‌, ప్రానేష్‌, ప్రవీణ్‌, శ్రీశైలం, చిన్నరాజు, వినీష్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2025 | 01:05 AM