‘బనవాసి’ విద్యార్థినులకు అస్వస్థత

ABN, Publish Date - Mar 13 , 2025 | 12:53 AM

ఇంటర్‌మీడియెట్‌ పరీక్ష వేళ సమయంలో మండల పరిధిలోని బనవాసి గురుకుల కళాశాల విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

‘బనవాసి’ విద్యార్థినులకు అస్వస్థత
ఆసుపత్రిలో విద్యార్థినులను పరామర్శిస్తున్న సబ్‌ కలెక్టర్‌

తీవ్ర జ్వరంతో బాధపడుతున్న విద్యార్థినులు

పరామర్శించిన సబ్‌ కలెక్టర్‌

ఎమ్మిగనూరు, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌మీడియెట్‌ పరీక్ష వేళ సమయంలో మండల పరిధిలోని బనవాసి గురుకుల కళాశాల విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మండలంలోని బనవాసి ఏపీఆర్‌జేసీ గురుకుల బాలికల కళాశాలలో చదువుతున్న మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు ఉదయం దాదాపు 25 మంది వరకు తీవ్ర జ్వరానికి గురయ్యారు. దీంతో స్థానికంగా ఉన్న వైద్య సిబ్బంది వారికి ప్రాథమిక చికిత్స అందించారు. దీంతో కొంత మందికి జ్వరం తగ్గుముఖం పట్టగా మరో పది మంది విద్యార్థిపేలకు జ్వరం తగ్గకపోవడంతోపాటు అస్వస్థతకు గురయ్యారు. దీంతో కళాశాల సిబ్బంది విద్యార్థినులను మధ్యాహ్నం 3గంటల సమయంలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆస్పత్రి డ్యూటీ వైద్యులు డాక్టర్‌ మల్లికార్జున విద్యార్థినులకు చికిత్స అందించారు. సమాచారం తెలుసుకున్న సబ్‌ కలెక్టర్‌ మౌర్యాభరద్వాజ్‌ హుటాహుటిన ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులతో మాట్లాడి జ్వరం రావడానికి గల కారణాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ జ్వరం, జలుబు వల్ల విద్యార్థినులు కొంత ఇబ్బందికి గురయ్యారని అన్నారు. అయితే విద్యార్థినులకు ఎలాంటి ప్రమాదం లేదని, బాగానే ఉన్నారని తెలిపారు. విద్యార్థినులకు మంచి వైద్యం అందిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కళాశాల సిబ్బందితోపాటు, వైద్య, రెవెన్యూ సిబ్బంది ఆస్పత్రిలో ఉండి విద్యార్థినులను పర్యవేక్షిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా ఎండలు ఎక్కువగా ఉండడంతో కళాశాలలో చదువుతున్న విద్యార్థినులు రేకుల షెడ్డులో ఉన్న డార్మెటరీల్లో చదువుకోవడం, చెట్ల నీడలోని వేడిగాలులకు కూర్చోవడం వల్ల అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

Updated Date - Mar 13 , 2025 | 12:53 AM