ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో భాగం కావాలి
ABN, Publish Date - Feb 10 , 2025 | 12:38 AM
ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో భాగం కావాలి

ఆదివాసుల ఉద్యమాలకు మద్దతు ఇద్దాం
విరసం రాష్ట్ర అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ పిలుపు
ముగిసిన 24వ సాహిత్య పాఠశాల
కర్నూలు కల్చరల్, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో సాహిత్యకారులు భాగం కావాలని విరసం (విప్లవ రచయితల సంఘం) రాష్ట్ర అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ పిలుపునిచ్చారు. నగరంలో వెంకటాద్రినగర్‌లోగల వెంకటేశ్వర కల్యాణ మంటపంలో ఏర్పాటు చేసిన విరసం 24వ పాఠశాల సాహిత్య పాఠశాల ఆదివారం రాత్రి ముగిసింది. ‘సంక్షోభ కాలంలో సాహిత్యకారుల పాత్ర’ అనే అంశం పై నిర్వహించిన ఈ రెండు రోజుల కార్యక్రమాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ ప్రాంతాల నుంచి విరసం నేతలు, సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా విరసం నేతల ప్రసంగాలు ఆలోచనాత్మకంగా సాగాయి. రచయితలు, కవులు, బుద్ధిజీవులు చేయాల్సిన కార్యక్రమాలపై వక్తలు చైతన్యవంతమైన ప్రసంగాలు చేశారు. ఈ సాహిత్య కార్యక్రమాల్లో పలువురు రచయితల పుస్తక ఆవిష్కరణలు జరిగాయి. విప్లవ మేధావి ప్రొఫెసర్ సాయిబాబా స్మృతిపథంలో ప్రొఫెసర్ సాయిబాబా వేదికపై సాగిన ఈ కార్యక్రమంలో ఆదివారం నాగేశ్వర్, రాంకి నేతృత్వంలో 27 పుస్తకాలు ఆవిష్కరించారు. విరసం నాయకురాలు వరలక్ష్మి అధ్యక్షతన ‘తెలుగు సాహిత్యంలో వెలుగు నీడలు’ అనే అంశంపై విరసం రాష్ట్ర అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ మాట్లాడుతూ నేటి ఫాసిజం సాహిత్య, కళా, మేధోరంగాలపై ప్రభావితం చూపుతోందని, ఎక్కడ ధిక్కార స్వరాలు వినిపించినా తొక్కేసే ధోరణితో ముందుకు పోతోందని చెప్పారు. రచయితలారా మీరు ఎటువైపు అన్న ప్రశ్నలోంచి 1970లో విరసం ఆవిర్భవించి అనేక ఉద్యమ, సంక్షోభ కాలాల్లో తన రచన, ఆచరణలతో ప్రజా పోరాటాల పక్షాన నిలిచిందని గుర్తు చేశారు. పీడిత సమూహాల సమస్యల పరిష్కారానికి అనేక ప్రజాస్వామిక పోరాటాలు ముందుకు వచ్చాయని చెప్పారు. విరసం నాయకురాలు వరలక్ష్మి మాట్లాడుతూ సాహిత్యకారుల నుంచి ఈ సమాజం ఏమీ ఆశిస్తున్నదీ గుర్తించి రచన చేయాలని అన్నారు. ‘విప్లవోద్యమంపై ఫాసిస్టు యుద్ధం - బుద్ధివుల పాత్ర’ అనే అంశంపై పాణి మాట్లాడుతూ వనరుల దోపిడీ కోసం రాజ్యం విప్లవోద్యమం మీద యుద్ధం చేస్తున్నదని అన్నారు. దీని వెనుక కార్పొరేట్ శక్తులు ఉన్నాయని అన్నారు. కార్పొరేట్లు బీజేపీని అధికారంలోకి తెచ్చారని, అందుకే మోదీ కార్పొరేట్ల స్నేహితుడయ్యారని అన్నారు. వికసిత భారత్ అంటే కార్పొరేట్ ఇండియా అని అన్నారు. ముగింపులా ప్రొ. హరగోపాల్ మాట్లాడుతూ ప్రజల్లోకి ఫాసిస్టు ప్రమదాన్ని తీసుకపోవడానికి అనేక సృజనాత్మక రూపాలను రచయితలు ఎంచుకోవాలని అన్నారు. ఫాసిస్టు వ్యతిరేకపోరాటంలో సంస్కృతి పాత్ర కీలకం అన్నారు. ఈ రెండు రోజుల సాహిత్య కార్యక్రమాల్లో విరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవేరా, శశికళ, నాగేశ్వరాచారి, అల్లం రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సభలో ప్రగతిశీల కవిత్వాన్ని కవులు చదివి వినిపించారు. అరుణోదయ, ప్రజాకళామండలి కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కర్నూలు కవులు, రచయితులు కెంగార మోహన్, జంధ్యాల రఘుబాబు, ఎస్‌డీవీ అజీజ్, ఎస్‌ఎండీ ఇనాయతుల్లా, గజల్ గాయకుడు మహ్మద్ మియా తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Feb 10 , 2025 | 12:38 AM