కృష్ణానదిలో చేపల మాఫియా
ABN, Publish Date - Jan 14 , 2025 | 12:15 AM
కృష్ణానదిలో నిషేధిత అలివి వలలతో చేపల వేట యథేచ్ఛగా సాగుతోంది. కృష్ణానది బ్యాక్ వాటర్ తగ్గే కొద్ది ఫిషింగ్ మాఫియా విజృంభిస్తోంది.
తిష్టవేసిన ఇతర రాష్ట్రాల కార్మికులు
నదీ తీరాన, ఎత్తయిన తిప్పలపై స్థావరాలు
రూ.కోట్లలో అక్రమ వ్యాపారం
పట్టించుకునే నాథుడే కరువు
నిద్రావస్థలో మత్స్యశాఖ అధికారులు.
కృష్ణానదిలో నిషేధిత అలివి వలలతో చేపల వేట యథేచ్ఛగా సాగుతోంది. కృష్ణానది బ్యాక్ వాటర్ తగ్గే కొద్ది ఫిషింగ్ మాఫియా విజృంభిస్తోంది. నాలుగైదు నెలల్లోనే చేప పిల్లలతో సహా కృష్ణా నదిలో ఉన్న మత్స్య సంపద మొత్తాన్నీ దోచుకుంటూ రూ.కోట్లు గడిస్తున్నారు. దోమ తెర కంటే సన్నటి రంధ్రాలు ఉన్న వలలు వాడటం వల్ల కృష్ణమ్మ ఒడిలోని చిన్న చేప పిల్లలు సైతం అందులో పడిపోతున్నాయి. గుడ్లను కూడా ఈ వలలతో లాగేస్తుండడంతో మత్స్య సంపద తగ్గిపోతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు చేపల మాఫియాపై కన్నెత్తి చూడటం లేదు.
నందికొట్కూరు, జనవరి 13(ఆంధ్రజ్యోతి): కృష్ణానది తీరంలో నిషేధిత అలివి వలలతో పలువురు చేపల వేట సాగిస్తున్నారు. ఇక్కడ నిత్యం రూ.లక్షల్లో మత్స్య వ్యాపారం సాగుతోంది. నందికొట్కూరు నియోజకవర్గంలోని నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా, కొత్తపల్లి మండలాల్లోని శాతనకోట, మల్యాల, నెహ్రూనగర్, ముచ్చుమర్రి, పోతులపాడు, సంగమేశ్వరం, జానాల గూడెం, బలపాల తిప్ప, ఇలా పాతాళగంగ వరకు 100 కి.మీటర్లకు పైగా కృష్ణా నదిలో చేపల వేట కొనసాగుతోంది. నవంబరు నుంచి కృష్ణానదిలోని క్రమంగా నీరు తగ్గుతుంది. ఈ సమయంలో చేపలు పట్టేందుకు కొందరు అక్రమంగా అలివి వలలతో నదిలోనే మకాం వేస్తారు. శాతనకోట వద్ద, మూర్వకొండ, వీరాపురం, అర్లపాడు, సంగమేశ్వరం తదితర ప్రాంతాల్లో ఉన్న తిప్పలపై గుడారాలు వేసుకుని మరీ అలివితో చేపలవేట కొనసా గిస్తున్నారు. మత్స్యకారుల జీవనోపాధి కోసం మత్స్యశాఖ లక్షల్లో చేపపిల్లలను సంవత్సరంలో రెండు సార్లు నెహ్రూనగర్ వద్ద కృష్ణానదిలో వదులుతారు. అధికారులు చేపపిల్లలను వదిలాక ఫిషింగ్ మాఫియా అలివి వలలతో నదిలో నుంచి తోడేస్తున్నారని, తమకు ఎలాంటి ఉపయోగం ఉండదని స్థానిక మత్స్యకారులు వాపోతున్నారు.
చిన్న పిల్లలకే డిమాండ్
సాధారణంగా కృష్ణానదిలో వదిలే చేప పిల్లల్లో బేర్షలు, బట్టగెండె, పొట్టు, మోసు రకాలు ఉంటాయి. వీటిని ఔషధాలు, కాస్మొటిక్స్‌లో ఉపయోగిస్తారు. ఒకసారి అలివి వల నదిలో వేస్తే సుమారు 10 నుంచి 15 క్వింటాళ్ల వరకు చేపలు, చేపపిల్లలు చిక్కుతాయి. ఇందులో సగం వరకు చిన్న పిల్లలే ఉంటాయి. వాటిని నది ఒడ్డున అరబెట్టి విజయవాడకు రవాణా చేశారు. ఇటు ఏపీ అటు తెలంగాణ రాష్ట్రాల అధికారులు దాడులు చేస్తేనే మత్స్యసంపద పెరిగే అవకాశం ఉంటుంది.
తెలంగాణ నుంచి కూడా..
తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలంలో జటప్రోలు, మంచాలకట్ట, మల్లేశ్వరం, కొల్లాపూర్ మండలంలోని అమరగిరి, సోమశిల తదితర శివార్లలోని నదీ తీరంలో అలివి వలలతో వేట సాగిస్తారు. అక్కడ ఎండ బెట్టిన చిన్న చేపలను సంచుల్లో నింపి పడవల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని నదీ తీర పల్లెలకు తరలిస్తారు. ఇక్కడి నుంచి విజయవాడ, వైజాగ్ తదితర ప్రాంతాలకు మాఫియా ఎండు చేపలను తరలిస్తారు.
పౌలీ్ట్ర ఫాంలకు ఎండు చేపలు ఎగుమతి: ప్రతి ఏటా చేపల మాఫియా రూ.కోట్లలో దోచుకుంటోంది. అలవి వలల ప్రత్యేక ఏమిటంటే నీటిలో అగ్గిపుల్ల ఉన్నా కూడా ఈ వల లాగేస్తుంది. చిన్న చేపలను నది తీరం ప్రాంతంలోనే ఎండబెట్టి బస్తాలలో నింపి విజయవాడ, గుంటూరు, వైజాగ్ తదితర ప్రాంతాల్లోని పౌలీ్ట్ర ఫాంలకు కి.లో. రూ.300 చొప్పున రాత్రి వేళల్లో అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఎండు చేపల వ్యాపారులు ప్రతి ఏటా రూ.కోట్లకు పడగలు ఎత్తుతున్నారు. ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది.
పారిపోవాలని చూస్తే ప్రాణం మీదికే
చేపలు పట్టేందుకు వచ్చిన కార్మికులు ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే.... నదిలోనే గుర్తు తెలియని శవాలుగా తేలుతాయనే ప్రచారం ఉంది. .తమకు ఎదురుతిరిగిన కార్మికులను మత్స్య మాఫియా బతకనివ్వదనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నెలల మధ్యలో అటు తెలంగాణ రాష్ట్రంలో, ఇటు నంద్యాల జిల్లాలోని పగిడ్యాల, జూపాడుబంగ్లా, పాములపాడు, కొత్తపల్లి మండలాల పోలీస్టేషన్‌లలో కేసులు నమోదు అవుతూనే ఉంటాయి.
34 మందిపై బైండోవర్ కేసు నమోదు
కృష్ణానదిలో చేపల వేట కొనసాగించేందుకు వచ్చిన 34 మంది మత్స్యకారులపై ముచ్చుమర్రి పోలీస్టేషన్‌లో జనవరి 4వ తేదీన బైండోవర్ కేసు నమోదైయింది. వివిధ ప్రాంతాల నుంచి చేపల వేట కొనసాగించేందుకు కొంత మంది మైనర్ బాలురులను తీసుకొని వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయంలో 34 మందిపై బైండోవర్ కేసు నమోదు చేశారు.
కన్నెత్తి చూడని మత్స్యశాఖ అధికారులు
ఒకరోజు కాదు...రెండు రోజులు కాదు... దాదాపు 5 నెలల పాటు జరిగే ఈ చేపల మాఫియా ఏ అధికారికీ కనిపించడం లేదు. కృష్ణానదిలో జరుగుతున్న అలవి వలలతో అక్రమంగా సాగుతున్న చేపల వేటను అరికట్టాల్సిన మత్స్యశాఖ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. మత్స్యశాఖ అధికారులు జాలర్లతో మాఫియాతో కుమ్మక్కు అవడం వల్లే ఈ ఫిషింగ్ మాఫియా యథేచ్ఛగా జరుగుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
బానిసలుగా కార్మికులు
నందికొట్కూరు మండలం శాతనకోట గ్రామం నుంచి జానాలగూడెం, బలపాలతిప్ప, పాతాళగంగ వరకు మొత్తం నదిలో దాదాపు 60 బ్యాచ్‌లు చేపల వేట కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్క బ్యాచ్‌లో 20 నుంచి 30 మంది వరకు చేపలు పట్టే వారు ఉంటారు. ఇలా ఒక్కొక్క గుంపు మేస్త్రీ రెండు లేదా మూడు వలలను సిద్ధం చేసుకొని మత్స్యకారులకు భోజన, వసతి సదుపాయాలు కల్పించి మత్స్య సందపను దోచుకుంటున్నారు. జూన్ నుంచి ఫిబ్రవరి, మార్చి వరకు శ్రీశైలం ప్రాజెక్టులో తిరుగు జలాలు నిల్వ ఉంటాయి. మత్స్య మాఫియా జాలర్లకు అడ్వాన్సుగా డబ్బులు ఇచ్చి తమ ఆధీనంలో ఉంచుకుంటారు. చేపలు పట్టడానికి వచ్చే వారంతా వైజాగ్, తమిళనాడు, ఒరిస్సా ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువ. అక్కడి నుంచి వీరిని కొంత డబ్బులు ముందుగానే చెల్లించి నాలుగు, ఐదు నెలల పాటు ఉండాలని ఒప్పందంపై ఇక్కడికి తీసుకొస్తారు.
Updated Date - Jan 14 , 2025 | 12:15 AM