గోదా రంగనాథుల కల్యాణోత్సవం
ABN, Publish Date - Jan 14 , 2025 | 12:06 AM
కర్నూలు నగర శివారు మామిదాల పాడులోని గోదా రంగనాథ స్వామి దేవస్థానం (గోదా గోకుల క్షేత్రం)లో ధనుర్మాస వేడుకలు వైభవంగా సాగుతున్నాయి.
కర్నూలు కల్చరల్, జనవరి 13(ఆంధ్రజ్యోతి): కర్నూలు నగర శివారు మామిదాల పాడులోని గోదా రంగనాథ స్వామి దేవస్థానం (గోదా గోకుల క్షేత్రం)లో ధనుర్మాస వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. సోమవారం గోదా రంగనాథుల లఘు కల్యాణోత్సవం కన్నులపండువగా సాగింది. ధనుర్మాస నిత్యారాధనల్లో భాగంగా వేకువ జామున 4:30 గంటలకు అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథ స్వామి వారికి, గోదాదేవి, శ్రీకృష్ణులకు సాలగ్రామాలకు పంచసూక్త పారాయణంతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. తోమాల సేవ, తిరుప్పావై పఠనం చేశారు. అనంతరం శ్రీరంగనాథ, శ్రీలక్ష్మీ, శ్రీగోదాదేవి అమ్మవార్లకు శతనామార్చాన, తిరుప్పావై గానం చేశారు. ఆలయంలో భోగి పండుగ వేడుకలను, సాయంత్రం గోదా రంగనాథుల లఘు కల్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోదా గోకుల క్షేత్రం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజ గుప్త, మేనేజింగ్ ట్రస్టీ పల్లెర్ల నాగరాజు, గోకులం సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - Jan 14 , 2025 | 12:06 AM