పది పరీక్షలకు కసరత్తు
ABN, Publish Date - Mar 14 , 2025 | 11:41 PM
జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ నెల 17 నుంచి మొదలు కాబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నారు.

జిల్లాలో హాజరు కానున్న 40,776 మంది విద్యార్థులు
172 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
నిర్వహణపై నేడు సమీక్ష సమావేశం
కర్నూలు ఎడ్యుకేషన్, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ నెల 17 నుంచి మొదలు కాబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాలో పూర్తి స్థాయిలో ఫర్నీచర్, లైటింగ్, ఫ్యాన్లు, తాగునీరు, వైద్య, రవాణా సౌకర్యాలు కల్పించేందుకు కలెక్టర్ రంజిత్ బాషా ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో హాజరు కానున్న 40,776 మంది విద్యార్థులు
జిల్లాలో 517 ఉన్నత పాఠశాలల నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు 40,776 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు 31,410 మంది కాగా, ప్రైవేటుగా హాజరయ్యే విద్యార్థులు 7,038 మంది, ఓపెన్ స్కూల్ ద్వారా 2328 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 172 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాను 46 జోన్లుగా విభజించారు. 33 పోలీస్ స్టేషన్‌లలో స్ర్టాంగ్ రూమ్‌లను ఏర్పాటు చేసి ప్రశ్నపత్రాలు భద్రపరిచారు. ఏ-కేటగిరి పరీక్ష కేంద్రాలు 92, బి-కేటగిరి పరీక్ష కేంద్రాలు 64, సి-కేటగిరీ పరీక్ష కేంద్రాలు 16 ఏర్పాటు చేశారు. ఓపెన్ స్కూల్ పదో తరగతి విద్యార్థులకు 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 177 మంది విద్యార్థులకు స్కైబ్స్‌ను జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షల నిర్వహణకు 2,234 మందిని నియమించారు. ఇందులో పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు 172 మంది, డిపార్టుమెంటు ఆఫీసర్లు 172 మంది, ఇన్విజిలేటర్లు 1840 మంది, ఫ్లయింగ్ స్క్వాడ్స్ 7, రూట్ ఆఫీసర్లు 12, అడిషనల్ రూట్ ఆఫీసర్లు 12, సి-కస్టోడియన్లు 11 మందిని నియమించారు. ఏర్పాట్ల సమీక్ష సమావేశం శనివారం ఉదయం 10 గంటలకు కర్నూలు బీ.క్యాంపు టీజీవీ కళ్యాణ మండపంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు డీఈవో శామ్యూల్ పాల్ శుక్రవారం తెలిపారు.
Updated Date - Mar 14 , 2025 | 11:41 PM