లైబ్రేరియన్‌ను శిక్షించాలి
ABN, Publish Date - Jan 03 , 2025 | 12:27 AM
మండలం లోని బనవాసి గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన లైబ్రేరియన్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాల నాయకులు, కళాశాల విద్యార్థినిలు ఆందోళనకు దిగారు
రోడ్డుపై విద్యార్థి సంఘాలు, విద్యార్థినుల బైఠాయింపు
నిందితుడి అరెస్టు
ఎమ్మిగనూరు రూరల్, జనవరి 2(ఆంధ్రజ్యోతి): మండలం లోని బనవాసి గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన లైబ్రేరియన్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాల నాయకులు, కళాశాల విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. గురువారం బనవాసి ఫారంలోని ఆదోని రహదారిపై బైఠాయించారు. లైబ్రేరియన్‌ను తొలగించాలని, అరెస్టుచేసి శిక్షించాలని, విద్యార్థినులకు రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు. రెండు నెలలుగా లైబ్రేరియన్ వేధింపులకు పాల్పడుతున్నా చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. విద్యార్థిని తల్లిదండ్రులకు తెలిపేవరకు గోప్యంగా ఉంచడం దారుణమన్నారు. కళాశాల అధికారుల ఉదాసీనతవైఖరి వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లైబ్రేరియన్‌ను విధుల నుంచి తొలగించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఎస్‌ఐ శ్రీనివాసులు నిందితుడినొ శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వీరేష్‌యాదవ్, మహేంద్ర బాబు, రాజేష్, ఉదయ్, రాఘవేంద్ర, విజయేంద్ర, షాహిద్ అఫ్రిది పాల్గొన్నారు.
నిందితుడిపై పోక్సో కేసు నమోదు
బాధితురాలు, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు లైబ్రేరియన్‌పై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్‌ఐ కె.శ్రీనివాసులు తెలిపారు. కేసు నమోదు చేశాని డీఎస్పీ, సీఐ ఆదేశాల మేరకు అరెస్టు చేసినట్లు తెలిపారు.
ప్రిన్సిపాల్ సస్పెన్షన్
ఎమ్మిగనూరు: బనవాసి గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసగుప్తాను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. విద్యార్థినిపై లైబ్రేరియన్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనకు బాధ్యుడిని చేస్తూ చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఏపీఆర్‌ఈఐ సొసైటీ సెక్రటరీ మస్తానయ్య ఆదేశాలు జారీ చేసినట్లు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ తెలిపారు.
Updated Date - Jan 03 , 2025 | 12:27 AM