ప్రాచీన పద్ధతిలో...
ABN, Publish Date - Feb 10 , 2025 | 12:24 AM
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయాలతో పాటు ప్రాంగణంలోని పరివార ఆలయాల్లో సైతం చాలా చోట్ల పైకప్పు దెబ్బతిన్నది.

శ్రీశైలంలో ఆలయ పైకప్పు మరమ్మతు పనులు
రూ.3 కోట్ల అంచనాతో త్వరలో ప్రారంభం
నేడు మంత్రుల సమక్షంలో ఒప్పందం
నంద్యాల, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయాలతో పాటు ప్రాంగణంలోని పరివార ఆలయాల్లో సైతం చాలా చోట్ల పైకప్పు దెబ్బతిన్నది. నీటి లీకేజీలతో ఈ సమస్య ఏర్పడింది. ఈ పరిణామం ఇటు ఆలయ అధికారులను, భక్తులను కలవరపరిచింది. ప్రాచీన ఆలయానికి మరమ్మతు పనులు ఆధునిక పద్ధతిలో చేపడితే ప్రాచీనతకు భంగం వాటిల్లుతుంది. భారతీయ ప్రాచీన నిర్మాణ పద్ధతులు అనుసరించి మరమ్మతులు చేయాలని సర్వత్రా డిమాండ్లు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు గత ఏడాదిలో పూణేకు చెందిన లార్డ్ వెంకటేశ్వర చారిటబుల్ అండ్ రిలీజియస్ ట్రస్ట్ వారిని సదరు పనులు చేయాలని కోరారు. దీంతో వెంటనే స్పందించిన సదరు ట్రస్ట్ సభ్యులు గత ఏడాది అక్టోబరు 2వ తేదీన మరమ్మతు చేయాల్సిన ప్రాంతాలను పరిశీలించారు. చేయాల్సిన పనులు తదితర అంశాలపై ఆలయ అధికారులతో మాట్లాడి వెళ్లారు. తాజాగా సదరు సంస్థ పనులు చేపట్టేందుకు ముందుకొచ్చింది. సుమారు రూ.3 కోట్లతో స్వచ్ఛందంగా శాస్త్రీయ పద్ధతుల్లో పనులు చేపట్టనున్నారు. ఈ సంస్థ గతంలో వివిధ దేవాలయాల్లో ఈ తరహా పనులు చేపట్టింది.
నేడు మంత్రుల సమక్షంలో ఒప్పందం
శ్రీశైలంలో సోమవారం మంత్రుల సమక్షంలో సదరు సంస్థ పనులు చేసేందుకు తగిన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకోనుంది. 3,17,988 చదరపు అడుగులు విస్తీర్ణం కలిగిన ఈ ఆలయ ప్రాంగణంలో వేల సంవత్సరాల నాటి పురాతన మండపాలకు, ఆలయాలకు సదరు సంస్థ మరమ్మతులు చేసేందుకు ఒప్పుకుంది. ఆలయ అధికారులు కోరడం.. సంస్థ సభ్యులు వెంటనే పరిశీలించి పనులు చేస్తామని ముందుకు రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ప్రాచీన పద్ధతిలో ఇలా...
శాస్త్రీయ పద్ధతిలో మరమ్మతులు చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. వెయ్యేళ్ల క్రితం నిర్మాణాలు జరిగిన పద్ధతిలోనే ఒక మిశ్రమం తయారు చేస్తారు. సున్నం, బెల్లం, కరక్కాయ పొడి, కాల్చిన మట్టి, ఇటుక ముక్కలు, ఇటుకల పొడితో పాటు అరబ్ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న బంక (ఆ ప్రాంతపు చెట్ల నుంచి సేకరించేది) వాడుతారు. వేర్వేరు డ్రమ్ముల్లో వీటిని దాదాపు కొన్ని రోజుల పాటు నానబెట్టుకున్నాక సమపాళ్లలో ఇసుకతో కలిపి ఒక మిశ్రమం సిద్ధం చేసుకుంటారు. ఆపై మరమ్మతులు ఉన్న చోట ఆ మిశ్రమాన్ని ఒక క్రమపద్ధతిలో ప్లాస్టింగ్ చేసుకుంటూ వెళ్తారు.
శివరాత్రి తరువాత పనులు ప్రారంభం
పూణేకు చెందిన ఓ సంస్థ నేడు ఒప్పందం పక్రియ చేసుకోనుంది. ఇప్పటికే సదరు సంస్థ సింహాచలం దేవాలయంలో పనులు చేస్తున్నారు. ఇక్కడ శివరాత్రి బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత మార్చి 2వ తేదీ నుంచి శ్రీశైలంలో పనులు ప్రారంభిస్తారు. శాస్త్రీయ పద్ధతుల్లో మరమ్మతు పనులు చేపడితే ఆలయ ప్రాచీనతకు ఎలాంటి భంగం కలగకుండా ఉంటుంది.
- నరసింహారెడ్డి, ఈఈ, శ్రీశైలం
Updated Date - Feb 10 , 2025 | 12:24 AM