వాళ్లవి శవ రాజకీయాలు
ABN, Publish Date - Jan 11 , 2025 | 12:10 AM
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి రోజా శవ రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆరోపించారు.
ఉనికి కోసమే వైసీపీ నాయకుల అసత్య ఆరోపణలు
బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
కర్నూలు ఎడ్యుకేషన్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి రోజా శవ రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆరోపించారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తిరుమలలో భక్తుల రద్దీ వల్ల జరిగిన హఠాత్ పరిణామం మీద వైసీపీ నాయకులు శవ రాజకీయాలు చేస్తున్నారని ఆమె అన్నారు. బాబాయి గొడ్డలి పోటు, కోడి కత్తి, గులకరాళ్ల ఘటనలు ఎలా జరిగిందీ ప్రజలందరికీ తెలుసునన్నారు. గతంలో అన్నమయ్య జిల్లాలో వరదలు సంభవించినప్పుడు వరద బాధితులను చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి సందర్శించి పరామర్శించారని, ఆర్థిక సాయం చేశారని అన్నారు. విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబు నాయుడు రాత్రింబవళ్లు ఉండి పర్యవేక్షించారన్నారు. తిరుపతిలో జరిగిన సంఘటన చాలా బాధాకరమన్నారు. సంఘటన జరిగిన వెంటనే అక్కడకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు పవన్ కళ్యాణ్, అనిత వెళ్లి పరిశీలించారన్నారు. బాధితులను పరామర్శించి రూ.25 లక్షల ఆర్థిక సాయాన్ని, గాయపడిన ఆసుపత్రిలో కోలుకుంటున్న బాధితులకు రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం ప్రకటించారన్నారు. ఇవన్నీ మరిచి వైసీపీ నాయకులు తమ పార్టీ ఉనికి కోసం అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, టీడీపీ నాయకులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jan 11 , 2025 | 12:10 AM