నగరానికి దాహం

ABN, Publish Date - Mar 14 , 2025 | 11:45 PM

నగరానికి దాహం

నగరానికి దాహం
కర్నూలు నగరం శివారు కాలనీల్లో ట్యాంకర్ల వద్ద తాగునీటి సమరం (ఫైల్‌)

వేసవిలో కర్నూలు వాసులకు పొంచి ఉన్న నీటి ముప్పు

రోజుకు 83 ఎంఎల్‌డీల నీరు అవసరం.. ఇస్తున్నది 78 మిలియన్‌ లీటర్లు

వర్షాభావ పరిస్థితులతో తీవ్ర కష్టాలు

పాతికేళ్లుగా నివేదికలకే పరిమితమైన ప్రత్యామ్నాయ ప్రాజెక్టులు

తుంగభద్రపై 0.50 టీఎంసీలతో చెక్‌ డ్యాంకు సన్నాహాలు

గోరుకల్లు నుంచి పైపులైన్‌ ఉత్తమం అంటున్న నిపుణులు

కర్నూలు నగరంలో జనాభాతో పాటు తాగునీటి కష్టాలు కూడా పెరుగుతున్నాయి. ఎస్‌ఎస్‌ ట్యాంకు సామర్థ్యం 0.15 టీఎంసీలే. అంటే 45 రోజులకు కూడా సరిపోవడం లేదు. నగరవాసుల ప్రాణాధారం సుంకేసుల జలాశయం సామర్థ్యం 1.20 టీఎంసీలే. తుంగభద్రపై 0.50 టీఎంసీల సామర్థ్యంతో చెక్‌ డ్యాం నిర్మించాలనే ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గోరుకల్లు జలాశయం ద్వారా కర్నూలు నగరానికి కృష్ణా జలాలు సరఫరా చేయడమే ఉత్తమం పరిష్కారమని నిపుణులు పేర్కొంటున్నారు. ఆ వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

కర్నూలు, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగర జనాభా 6 లక్షలు మైలురాయి దాటింది. వేసవి శివారు కాలనీల్లో కార్పొరేషన్‌ వాటర్‌ ట్యాంక్‌ దాహం తీర్చే పరిస్థితి ఉంది. రోజుకు రోజుకు 83 మిలియన్‌ లీటర్లు (ఎంఎల్‌డీ) సరఫరా చేయాల్సి ఉంటే.. 78 ఎంఎల్‌డీకు మించి ఇవ్వడం లేదు. నగరవాసుల దాహం తీర్చే ఎస్‌ఎస్‌ ట్యాంకు సామర్థ్యం 0.15 టీఎంసీలే. సుంకేసుల జలాశయం సామర్థ్యం 1.20 టీఎంసీలు. ప్రస్తుతం 0.45 టీఎంసీలకు నీటి నిల్వ ఉంది. 2007, 2012, 2014లో సుంకేసులు పూర్తిగా ఎండిపోతే.. తంగభద్ర నదిలో దేవమ్మమడుగు నుంచి నీటికి ఎత్తిపోసి నగర ప్రజల గొంతు తడిపారు.

తుంగభద్రపై చెక్‌ డ్యాం సాధ్యమేనా..?

నగర శివారులో రాఘవేంద్రస్వామి మఠం వద్ద తుంగభద్ర నదిపై 0.50 టీఎంసీల సామర్థ్యంతో చెక్‌ డ్యాం నిర్మిస్తే.. తాగునీటి సమస్యతో పాటు నది ఆవలి ఒడ్డున ఉన్న పలు గ్రామాలకు రహదారి సమస్య తీరుతుందని 2013లో రూ.64.89 కోట్లు మంజూరు చేస్తూ 2013 జూన్‌ 18న జీవో 56 జారీ చేశారు. రాష్ట్ర విభజన తరువాత ఈ ప్రాజెక్టు అటకెక్కింది. 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఎస్వీ మోహన్‌రెడ్డి ఆ తరువాత టీడీపీలో చేరారు. గాజులదిన్నె జలాశయం నుంచి రూ.350 కోట్లతో పైపులైన్‌ నిర్మించాలనే ప్రతిపాదన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. నాటి సీఎం చంద్రబాబు ఓకే చెప్పడంతో జీడీపీ నుంచి కర్నూలుకు తాగునీటి పైపులైన్‌ పట్టాలెక్కుతుందని అనుకుంటే.. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది.

రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్‌ రాఘవేంద్రస్వామి మఠం - గొందిపర్ల మధ్య 0.50 టీఎంసీలతో చెక్‌ డ్యాం సాధ్యసాధ్యాలపై జలవనరులు, కార్పొరేషన్‌ ఇంజనీర్లు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇది అనుకూలమే అని నివేదిక ఇచ్చినా.. ఎగువన రోజుకు 60 ఎంఎల్‌డీ మురుగునీరు తుంగభద్రలో కలుస్తుండడంతో నదీజలాలు కలుషితమై తాగడానికి పనికి రావని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

గోరుకల్లు నుంచి పైపులైన్‌ ప్రతిపాదన:

గోరుకల్లు జలాశయం సామర్థ్యం 12.44 టీఎంసీలు. అందులో డెడ్‌ స్టోరేజీ కెపాసిటీ 2.15 టీఎంసీలు నిత్యం నిల్వ ఉంటుంది. కృష్ణా నదికి ప్రతియేటా వరదలు వస్తున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి గోరుకల్లు రిజార్వయర్‌ను గ్రావిటీ ద్వారా నింపుతున్నారు. సోమయాజులపల్లె కొండపై గ్రౌండ్‌ లెవల్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (జీఎల్‌బీఆర్‌) నిర్మించి.. గోరుకల్లు నుంచి సోమయాజులపల్లె జీఎల్‌బీఆర్‌కు కృష్ణా జలాలు ఎత్తిపోసి.. అక్కడి నుంచి జగన్నాథగట్టుపై నిర్మించే జీఎల్‌బీఆర్‌కు, అక్కడి నుంచి మునగాలపాడు ఎస్‌ఎస్‌ ట్యాంక్‌కు గ్రావిటీ పైపులైన్‌ ద్వారా నీటిని సరఫరా చేయవచ్చని ఇంజనీర్లు అంటున్నారు. గోరుకల్లు నుంచి కర్నూలు తాగునీటి పథకం కోసం సుమారుగా రూ.270 కోట్లతో అమృత్‌-0.2 పథకం కింద ప్రతిపాదనలు తయారు చేశారు. గోరుకల్లు జలాశయం నుంచి కలుషితం లేని కృష్ణా జలాలు పంపింగ్‌ చేస్తుడడంతో తాగునీటికి మంచిదని నిపుణులు అంటున్నారు. జగన్నాథగట్టుపై ఫిల్టర్‌ బెడ్స్‌ నిర్మించి పాణ్యం నియోజకవర్గంలో విస్తరిస్తున్న కాలనీలకు పుష్కలంగా తాగునీరు ఇవ్వవచ్చు అని, గోరుకల్లు-కర్నూలు తాగునీటి పథకం ఉత్తమమని పలువురు అంటున్నారు.

కర్నూలు నగర పాలక సంస్థ తాగునీటి వివరాలు

నగరం జనాభా : 6 లక్షలు

ఇండ్ల తాగునీటి కుళాయిలు : 65,720

వాణిజ్య సరఫరా కుళాయిలు : 1,350

అవసరమైన తాగునీరు : 83 ఎంఎల్‌డీ

ప్రస్తుతం సరఫరా : 78 ఎంఎల్‌డీ

తాగునీటి పన్ను ఆదాయం : రూ.19.87 కోట్లు

ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు

ఎస్‌ఎస్‌ ట్యాంకు : 0.15 టీఎంసీలు

సుంకేసుల బ్యారేజీ : 0.45 టీఎంసీలు

ట్యాంకర్ల ద్వారా సరఫరా : 16-20 ట్యాంకర్ల

Updated Date - Mar 14 , 2025 | 11:45 PM