మార్కెట్ పాలనాధీశులు ఎవరు?
ABN, Publish Date - Jan 03 , 2025 | 12:27 AM
రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) నూతన పాలకవర్గాల నియామకానికి టీడీపీ కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఉమ్మడి కర్నూలులో 15 మార్కెట్ యార్డులు
రిజర్వేషన్లు ఖరారు చేసిన కలెక్టర్లు
చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికలో ఎమ్మెల్యేలు బిజీ
సంక్రాంతి నాటికి పదవులు భర్తీ చేసే అవకాశం
కీలక నాయకులపై ఆశావాహుల ఒత్తిళ్లు
రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) నూతన పాలకవర్గాల నియామకానికి టీడీపీ కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సంక్రాంతి నాటికి ఏఎంసీల నూతన పాలనాధీశులు కొలువుదీరే అవకాశం ఉంది. చైర్మన్, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లను నామినేట్ చేయనున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు రిజర్వేషన్లు ఖరారు చేశారు. పదవుల పందేరంలో ఆశావహులు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఒకటి రెండు నియోజకవర్గాల్లో దాదాపుగా ఖరారు అయినప్పటికీ మెజార్టీ నియోజకవర్గాల్లో మార్కెట్ చైర్మన్‌గా సమర్థవంతమైన వ్యక్తిని ఎంపిక చేసేందుకు ఎమ్మెల్యేలు కసరత్తు చేస్తున్నారు. త్వరలో చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు డైరెక్టర్ల జాబితా పంపాలంటూ ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జ్‌లకు అధిష్ఠానం నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏఎంసీ నామినేటెడ్ పదవుల పందేరంతో రాజకీయ వేడి రాజుకుంది.
కర్నూలు, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ మార్కెట్ కమిటీలు రెగ్యులర్‌గా క్రయవిక్రయాలు జరిగితే.. మంత్రాలయం (కోసిగి), కోడుమూరు, ఆలూరు మార్కెట్‌లు అలంకారప్రాయంగా ఉన్నాయి. నంద్యాల జిల్లాలో నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, కోవెలకుంట్ల మార్కెట్లలో రెగ్యులర్‌గా క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. మిగిలిన మార్కెట్ యార్డులు వారాంతపు మార్కెట్లుగా మారితే.. కొన్ని పేరుకే మార్కెట్‌లుగా ఉన్నాయి. కర్నూలు జిల్లాలో ఏడు మార్కెట్లలో ఏడాదికి రూ.3,600 కోట్లకు పైగా విలువైన వ్యవసాయ ఉత్పత్తులు క్రయవిక్రయాలు జరుగతున్నాయి. మార్కెట్ సెస్సు రూపంలో రూ.36 కోట్లు ఆదాయం వస్తోంది. నంద్యాల జిల్లాలో ఎనిమిది మార్కెట్ యార్డుల పరిధిలో ఏడాదికి రూ.2,600 కోట్ల విలువైన వ్యవసాయ పంట ఉత్పత్తుల లావాదేవీలు జరుగుతున్నాయి. సెస్సు ద్వారా రూ.26 కోట్లు ఆదాయం వస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం 2022లో మార్కెట్ కమిటీలకు నూతన పాలవర్గాలను నియమించింది. ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఆరు నెలల తర్వాత నామినేటెడ్ పదవుల పంపకానికి శ్రీకారం చుట్టింది.
రిజర్వేషన్లు ఖరారు చేసిన కలెక్టర్లు
ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం మార్కెట్ యార్డు చైర్మన్, డైరెక్టర్ల నియామకాల్లో ఎస్టీలకు 6 శాతం, ఎస్సీలకు 15 శాతం, బీసీలకు 29 శాతం రిజర్వేషన్ కల్పించాలి. మిగిలిన పదవులు ఓపన్ కేటగిరి (ఓసీ)లో భర్తీ చేయాల్సి ఉంటుంది. మొత్తం స్థానాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాల్సి ఉంటుంది. ప్రతి మార్కెట్ కమిటీలో వ్యవసాయ/ఉద్యాన శాఖ, కో-ఆపరేటివ్ శాఖ, మార్కెటింగ్ శాఖ, పంచాయతీ/మున్సిపాలిటీల నుంచి నలుగురు ప్రభుత్వ అధికారులు, ముగ్గురు ట్రేడర్స్, 13 మంది రైతులు కలిపి 20 మంది డైరెక్టర్లు ఉంటారు. రిజర్వేషన్లు ఖరారు చేయాలని డిసెంబరు 10న జిల్లా కలెక్టర్లు, మార్కెంటింగ్ శాఖ ఉన్నతాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో రిజర్వేషన్లు పరిగణలోకి తీసుకున్న అధికారులు రూల్ ఆఫ్ రిజర్వేషన్ మేరకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. కర్నూలు జిల్లాలో కర్నూలు, పత్తికొండ ఏఎంసీ చైర్మన్ పీఠాలు ఓసీ జనరల్, కోడుమూరు, మంత్రాలయం ఓసీ మహిళా, ఆదోని బీసీ/మైనార్టీ మహిళా, ఎమ్మిగనూరు బీసీ/మైనార్టీ జనరల్, ఆలూరు ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. ఏడింటిలో మూడు స్థానాలు మహిళలకు ఇచ్చారు.
రిజర్వేషన్ల ఖరారుపై ఆరోపణలు
నంద్యాల జిల్లాలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధుల సిఫారసుల మేరకు రిజర్వేషన్లు ఖరారు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నంద్యాల జిల్లాలో నందికొట్కూరు, ఆత్మకూరు, కోవెలకుంట్ల, బనగానపల్లె మార్కెట్ కమిటీలు ఓసీ (జనరల్), నంద్యాల ఓసీ (మహిళ)కు కేటాయిస్తే.. ఆళ్లగడ్డ ఎస్సీ (మహిళ), డోన్, పాణ్యం బీసీ (మహిళ)కు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీలకు 21 శాతం రిజర్వేషన్ ప్రకారం రెండు మార్కెట్ కమిటీలు కేటాయించాల్సి ఉంది. ఎస్టీ రిజర్వేషన్‌ను పరిగణలోకి తీసుకోకుండా ఎస్సీ రిజర్వేషన్ మాత్రమే పరిగణలోకి తీసుకుని ఎస్సీలకు ఆళ్లగడ్డ చైర్మన్ రిజర్వేషన్ కల్పించి మహిళలకు కేటాయించారు. బీసీలకు రెండు రావాల్సి ఉంటే.. ఆ రెండు స్థానాలు మహిళలకు కేటాయించారు. వాస్తవంగా అయితే ఒకటి జనరల్, ఒకటి మహిళలకు ఇవ్వాలి. ఓపన్ కేటగిరి (ఓసీ) కింద నాలుగు మార్కెట్ల చైర్మన్ స్థానాలు కేటాయించాల్సి ఉంటే ఐదు మార్కెట్లు కేటాయించారు. అందులో మహిళలకు సగం అంటే.. కనీసం రెండు చైర్మన్ పదవులు ఇవ్వాల్సి ఉండగా ఒక స్థానంతో సరిపుచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆశావహుల ప్రయత్నాలు
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు టీడీపీ నాయకులు అప్పటి నేతల వేధింపులతో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అక్రమ కేసులు ఎదుర్కొన్నారు. ప్రతిపక్షంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన నాయకులు ఎందరో ఉన్నారు. మార్కెట్ యార్డు పదవుల పందేరంలో తమకు న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులపై ఒత్తిడి తెస్తున్నారు. కర్నూలు మార్కెట్ పీఠం కోసం కల్లూరు మండలం పెద్దపాడు గ్రామానికి చెందిన ఆర్.చంద్రకళాధర్‌రెడ్డి పేరును పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితలు ప్రతిపాదించినట్లు సమాచారం. ఎమ్మిగనూరు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా గోనేగండ్ల మండలం పెద్దనెలటూరు గ్రామానికి చెందిన కురువ మల్లయ్య, వైస్ చైర్మన్‌గా నందవరం మండలం మాచాపురం గ్రామానికి చెందిన ఖాశీంవల్లి పేర్లు ఖారరు చేసినట్లు సమాచారం. పత్తికొండ మార్కెట్ చైర్మన్ పదవికి కృష్ణగిరి మండలానికి చెందిన నబీసాహెబ్ పేరు ఎంపిక చేశారని తెలుస్తుంది. ఆలూరు పీఠం కోసం ఆరేడుగురు పోటీ పడుతున్నా.. రాజారత్నం, నర్సప్ప, శేషగిరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక ఆదోని రాయలసీమలోనే అతిపెద్ద మార్కెట్‌గా గుర్తింపు ఉంది. ఈ పీఠం బీసీ/మైనార్టీ మహిళకు కేటాయించారు. ఈ పీఠం కోసం కూటమి పార్టీల్లో తీవ్ర పోటీ ఉంది. జనసేన ఇన్‌చార్జి మల్లప్ప భార్యకు ఆ స్థానం కేటాయించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పొత్తుల్లో భాగంగా తమకే వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. అదే క్రమంలో మైనార్టీ కోటాలో టీడీపీ మైనార్టీ నాయకుడు ఉమ్మి సలీం, బీసీ వాల్మీకి కోటాలో టీడీపీ సీనియర్ నాయకుడు ఆరేకల్లు రామకృష్ణలు ప్రయత్నాలు చేస్తున్నారు. నంద్యాల జిల్లాలో కూడా చైర్మన్ పదవుల కోసం ఆశావహులు ఎమ్మెల్యేలను కలసి ప్రయత్నాలు షురూ చేశారు. ఉమ్మడి జిల్లాలో రెండు మూడు నియోజకవర్గాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు ఐదేళ్లు వైసీపీలో పార్టీ బలోపేతం కోసం కష్టపడిన కార్యకర్తలను కాదని ఎన్నికల ముందు, ఆ తరువాత టీడీపీలో చేరిన వారినే చైర్మన్‌గా ఎంపిక చేసేందుకు యత్నాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధిష్ఠానం విచారించి పార్టీ కోసం కష్టపడ్డ వారికే ప్రాధాన్యత ఇవ్వాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.
మార్కెట్ కమిటీ చైర్మన్ల రిజర్వేషన్ల వివరాలు
మార్కెట్ కమిటీ రిజర్వేషన్
కర్నూలు జిల్లా
కర్నూలు ఓసీ జనరల్
ఆదోని బీసీ/మైనార్టీ (మహిళ)
కోడుమూరు ఓసీ (మహిళ)
మంత్రాలయం ఓసీ (మహిళ)
ఎమ్మిగనూరు బీసీ/మైనార్టీ జనరల్
ఆలూరు ఎస్సీ -జనరల్
పత్తికొండ ఓసీ జనరల్
నంద్యాల జిల్లా:
నంద్యాల ఓసీ (మహిళ)
ఆళ్లగడ్డ ఎస్సీ (మహిళ)
డోన్ బీసీ (మహిళ)
నందికొట్కూరు ఓసీ జనరల్
ఆత్మకూరు ఓసీ జనరల్
బనగానపల్లె ఓసీ జనరల్
కోవెలకుంట్ల ఓసీ జనరల్
పాణ్యం బీసీ (మహిళ)
Updated Date - Jan 03 , 2025 | 12:27 AM