Double Summer Effect: డబుల్ సమ్మర్
ABN, Publish Date - Apr 03 , 2025 | 04:32 AM
పసిఫిక్ మహాసముద్రంలో లానినా ముగియడంతో తటస్థ వాతావరణ పరిస్థితులు ప్రారంభమయ్యాయి. అయితే, దేశంలో అధిక ఉష్ణోగ్రతలు, సుదీర్ఘ వేసవి, వడగాడ్పులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలతో సుదీర్ఘ వేసవి
వాతావరణ నిపుణుల అంచనా
నైరుతి సీజన్‌లో ఎల్‌నినో రాదు: ఐఎండీ
నేడు రాయలసీమ, కోస్తాకు వర్షసూచన
విశాఖపట్నం, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): పసిఫిక్ మహాసముద్రంలో లానినా ముగిసింది. ప్రస్తుతం తటస్థ పరిస్థితులు ప్రారంభం కావడంతో భూమధ్యరేఖకు ఆనుకుని తూర్పు, పశ్చిమ పసిఫిక్ మహా సముద్రంలో సాధారణం కంటే తక్కువగా ఉండే ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పులు వచ్చాయి. దీంతో 4నెలలపాటు కొనసాగిన లానినా ముగిసి, తటస్థ పరిస్థితులు ఏర్పడ్డాయని అంతర్జాతీయ వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితులు సెప్టెంబరు, నవంబరు వరకు కొనసాగే అవకాశాలున్నాయని అంచనా వేశారు. రానున్న నైరుతి రుతుపవనాల సీజన్‌లో తటస్థ పరిస్థితులు పోయి, ఎల్‌నినో వచ్చే అవకాశం లేదని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తేల్చిచెప్పింది. అయితే పసిఫిక్ మహాసముద్రంలో తటస్థ పరిస్థితులు కొనసాగుతున్నా.. దేశంలో ప్రస్తుత వేసవి సీజన్‌లో ఎండలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. ఎక్కువ రోజులు పగటి ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా నమోదుకానున్నాయని, వచ్చే 3నెలల్లో డబుల్ సమ్మర్ ఎఫెక్టు ఉంటుందని చెప్పారు. దేశంలో రానురాను వడగాడ్పులు, అధిక ఉష్ణోగ్రతల నమోదుతోపాటు సుదీర్ఘమైన వేసవి కాలం కొనసాగుతుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు వేసవిగా పరిగణిస్తుంటారు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే వేసవి తీవ్రత మొదలైంది. వేసవికాలం సుదీర్ఘంగా కొనసాగడం, పగలు, రాత్రి వేడి వాతావరణం నెలకొనడం ప్రజల ఆరోగ్యాలు, జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. దిగుబడులు తగ్గడం, కొన్ని పంటలు బాగా దెబ్బతినడంతో వ్యవసాయ రంగం నుంచి వచ్చే ఆదాయం తగ్గుతుందని, తద్వారా దేశ ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతుందని ఇప్పటికే పలు ఆర్థిక సంస్థల అధ్యయనంలో వెల్లడైందని గుర్తుచేస్తున్నారు. ఇప్పటివరకూ కొనసాగుతున్న పంటల సాగు విధానాలు, ప్రజల జీవన విధానం ముఖ్యంగా ఇళ్ల నిర్మాణాల్లో మార్పులు చేసుకోవాలని సూచించారు.
నేడు, రేపు పిడుగులతో వానలు
దక్షిణ ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కామెరూన్‌లలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో రెండు సముద్రాల నుంచి తేమగాలులు భూ ఉపరితలంపైకి వీస్తున్నాయి. వాటి ప్రభావంతో బుధవారం రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో రాయలసీమలో ఎక్కువచోట్ల, కోస్తాలో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. గాలులు, ఉరుములు, పిడుగులు సంభవించే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయని పేర్కొంది. కాగా, రానున్న రెండు రోజులు కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. గురువారం అల్లూరి, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో, శుక్రవారం మన్యం, అల్లూరి, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయన్నారు. పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, తూర్పుగోదావరి జిల్లాల్లోని 23 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందన్నారు.
ఇవి కూడా చదవండి:
FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..
Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..
Updated Date - Apr 03 , 2025 | 04:32 AM