Andhra Pradesh: ప్రపంచ శాంతి కోసమంటూ.. సజీవ సమాఽధిలోకి

ABN, Publish Date - Mar 31 , 2025 | 04:21 AM

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో భూదేవి భక్తుడు కోటిరెడ్డి ప్రపంచ శాంతి కోసం సజీవ సమాధి యత్నం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు 8 గంటల తర్వాత ఆయనను గుంత నుంచి బయటకు తీయడంతో ఉత్కంఠ ముగిసింది.

Andhra Pradesh: ప్రపంచ శాంతి కోసమంటూ.. సజీవ సమాఽధిలోకి

ఆరు అడుగుల గుంతలోకి వెళ్లి.. కుమారుడితోనే పూడ్పించుకున్న ఓ వ్యక్తి

విషయం తెలిసి అడ్డుకున్న పోలీసులు

8 గంటల తర్వాత గుంతలోంచి బయటకు

ఉగాది నాడున ప్రకాశం జిల్లాలో ఘటన

భూదేవికి రెండు ఆలయాలు నిర్మించిన భక్తుడు

తాళ్లూరు, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): భూదేవి మాత నిత్యం తన ఒంట్లోకి వస్తోందని, ప్రపంచ శాంతి కోసమంటూ ఓ వ్యక్తి సజీవ సమాఽధికి యత్నించిన ఘటన ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో ఆదివారం ఉగాది పండుగ నాడున చోటుచేసుకుంది. ఆరు అడుగుల గుంతలోకి వెళ్లి, తన కుమారుడితోనే పైన ఒక రేకు పెట్టించి, దానిపైన మట్టితో పూడ్పించుకోవడం సంచలనంగా మారింది. దీన్ని వీడియో తీసిన కుమారుడు స్నేహితులకు పంపడంతో.. ఈ వ్యవహారం పోలీసులకు తెలిసింది. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసు సిబ్బంది.. గుంతలోని వ్యక్తిని బయటకు తీయడం ద్వారా 8 గంటల పాటు సాగిన ఉత్కంఠకు తెరపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లూరు మండలం విఠలాపురం గ్రామానికి చెందిన కైపు కోటిరెడ్డి అనే వ్యక్తి భూదేవి భక్తుడు. అమ్మవారిపై భక్తితో కొంతకాలం క్రితం భూమిలో 40 అడుగుల లోతు గుంత తీసి భూదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. పైవరకు ఆలయం కూడా నిర్మించాడు. నిత్యం ఆ గుంతలోకి వెళ్తూ తనకు తోచిన రీతిలో పూజలు చేస్తుంటాడు. అయితే ఆ గుంతలోకి వెళ్లే భక్తులు గాలి ఆడక ఇబ్బందులు పడేవారు. దీంతో రెండేళ్ల క్రితం భూమిపైనే మరో ఆలయం నిర్మించాడు. భూదేవి అమ్మవారు తన ఒంట్లోకి వస్తుందని చెబుతూ ఇటీవల దాని పక్కనే ఆరు అడుగుల గుంత తీశాడు. ఆదివారం వేకువజామున 4 గంటల సమయంలో కోటిరెడ్డి ఆ గుంతలో కూర్చున్నారు. ఆయన ఆదేశాలతో కుమారుడు పైన రేకు పెట్టి, మట్టితో పూడ్చివేశాడు. దీన్ని వీడియో తీసి తన ఫోన్‌లో స్నేహితులకు పంపాడు. దీంతో కోటిరెడ్డి సజీవ సమాధి అయ్యాడన్న వార్త చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ మల్లికార్జునరావు సిబ్బందితో కలిసి ఉదయం 11 గంటలకు గ్రామానికి చేరుకున్నాడు. గుంతలో నుంచి బయటకు రావాలని కోరగా.. మొదట కోటిరెడ్డి నిరాకరించాడు. చివరికి పోలీసుల విజ్ఞప్తి మేరకు 8 గంటల పాటు గుంతలో ఉన్న ఆయన బయటికి వచ్చాడు. అనంతరం పోలీసులు గుంతను పూడ్పించారు. ఇలాంటి పనులు చేయడం నేరమని, కోటిరెడ్డికి ప్రాణాపాయం జరిగితే కుటుంబీకులపై చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..

Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..

TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్‌

For More AP News and Telugu News

Updated Date - Mar 31 , 2025 | 04:21 AM