కొత్త సంవత్సర వేడుకలు
ABN, Publish Date - Jan 01 , 2025 | 11:59 PM
తీపి, చేదు జ్ఞాపకాలను పంచి పెట్టిన 2024కు వీడ్కోలు పలుకుతూ, కోటి ఆశలు, కొంగొత్త ఊసులతో 2025 ఆంగ్లనామ సంవత్సరాన్ని జిల్లా వాసులు ఉత్సాహంగా స్వాగతించారు.
అర్థరాత్రి నుంచి ఆనందోత్సాహాల్లో యువత
సంతాప దినాల వల్ల వేడుకలకు అధికారులు దూరం
ప్రజా ప్రతినిధుల ఇళ్ల వ ద్ద అభిమానుల సందడి
కర్నూలు (కల్చరల్), జనవరి 1(ఆంధ్రజ్యోతి): తీపి, చేదు జ్ఞాపకాలను పంచి పెట్టిన 2024కు వీడ్కోలు పలుకుతూ, కోటి ఆశలు, కొంగొత్త ఊసులతో 2025 ఆంగ్లనామ సంవత్సరాన్ని జిల్లా వాసులు ఉత్సాహంగా స్వాగతించారు. కొత్త సంవత్సర ఆరంభ వేడుకలు జిల్లాలో బాగా సందడి చేశాయి. మంగళవారం అర్థరాత్రి నుంచే వివిధ ప్రాంతాల్లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. రాత్రి 12 గంటలకు కేక్‌లు కట్‌చేసి, స్వీట్లు పంచుకుంటూ సంబరంగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు. వేర్వేరు ప్రాంతాల్లో డీజే సౌండ్ సిస్టమ్‌లు ఏర్పాటు చేసి, సాంస్కృతిక కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి పది గంటలనుంచి ఆట పాటలతో అర్థరాత్రి వరకు సంబరాలు నిర్వహించి, అనంతరం కేక్‌లను కట్ చేసి పంపిణీ చేస్తూ ‘హ్యాపీ న్యూ ఇయర్...వెల్‌కమ్ న్యూ ఇయర్’ అంటూ పరస్పర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కాగా బుధవారం కొత్త సంవత్సర ప్రారంభాన్ని ఉత్సాహంగా ప్రారంభించారు. ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు, సామాజిక స్వచ్ఛంద సంస్థలు, యోగ శిక్షణ కేంద్రాల్లో కేక్‌లను కట్‌చేసి, మిఠాయిలు పంపిణీ చేసి ఉత్సాహంగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు. అయితే భారత మాజీ ప్రధాని మన్మోహనసింగ్ మృతికి సంతాప దినాల కారణంగా జిల్లా అధికారులు ఈ వేడుకలకు దూరంగా ఉన్నారు. వివిధ పార్టీల ప్రజా ప్రతినిధుల ఇండ్ల వద్ద సందడి కొత్త సంవత్సర ఆరంభ వేడుకల సందడి కనిపించింది. కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలని కోరుతూ వివిధ దేవాలయాల్లో పూజలు నిర్వహించారు.
ఫ చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు...కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ జిల్లాలోని అన్ని చర్చిలలో క్రైస్తవ మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నూతన సంవత్సరంలో ఎలా సంతోషంగా జీవించాలో ఉద్బోధించారు. నగరంలో కోట్ల సర్కిల్ సమీపంలోని కోల్స్ సెంటీనియల్ బాప్టిస్టు చర్చి, పెద్దపార్కు సమీపంలోని సీఎస్‌ఐ చర్చి, ఐదు రోడ్లు కూడలి లోని రాక్‌వుడ్ చర్చి, శ్రీనివాసనగర్‌లోని స్టాంటన చర్చి, సి. క్యాంపులోని ప్రార్థన మందిరం, నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని హోసన్న మందిరం, ఆర్‌సీఎం చర్చి, గుడ్ షప్పర్ట్ చర్చి, ఎలోహీమ్ చర్చి, షమ్మా చర్చిలతోపాటు పలు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, మత పెద్దలు దైవ సందేశాన్ని తెలియజేశారు.
Updated Date - Jan 01 , 2025 | 11:59 PM