Circadian app: వంద శాతం కచ్చితత్వం

ABN, Publish Date - Apr 05 , 2025 | 02:57 AM

ఎన్నారై విద్యార్థి సిద్ధార్థ్‌ నంద్యాల రూపొందించిన సర్కాడియాన్‌ యాప్‌ గుండె జబ్బుల నిర్ధారణలో 100% ఖచ్చితత్వం చూపింది. విజయవాడ, గుంటూరు ప్రభుత్వాసుపత్రుల్లో చేసిన పైలట్‌ ప్రాజెక్ట్‌లో ఇది నిరూపితమైంది.

Circadian app: వంద శాతం కచ్చితత్వం

సర్కాడియాన్‌ ఏఐ యాప్‌తో గుండె జబ్బుల పరీక్షలు

గుంటూరు, విజయవాడ ప్రభుత్వాస్పత్రుల్లో పైలట్‌ ప్రాజెక్ట్‌

యాప్‌తో వ్యాధి గుర్తించిన వారికి సంప్రదాయ పరీక్షల్లోనూ నిర్ధారణ

గుంటూరు మెడికల్‌, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): గుండె జబ్బుల నిర్ధారణకు ఓ బాలుడు రూపొందించిన సర్కాడియాన్‌ యాప్‌పై సంశయాలు తొలగిపోయాయి. ఆ యాప్‌ వంద శాతం కచ్చితత్వంతో పనిచేస్తోందని స్పష్టమైంది. ఇటీవల ఏఐ నిపుణుడు సిద్ధార్థ్‌ నంద్యాల అనే ఎన్నారై విద్యార్థి 7 సెకన్లలో గుండె జబ్బును నిర్ధారించే ఏఐ ఆధారిత సర్కాడియాన్‌ యాప్‌తో గుండె పరీక్షలు నిర్వహించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ యాప్‌ పనితీరు తెలుగురాష్ట్రాల్లో చర్చనీయాంశం అయింది. వైద్య వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య విద్యా శాఖ అనుమతితో గుంటూరు, విజయవాడ ప్రభుత్వాస్పత్రుల్లో పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద కార్డియాలజీ ఓపీ విభాగాలకు వచ్చే రోగులకు ఈ యాప్‌తో గుండె స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మార్చి 29 నుంచి 31 వరకు, గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఏప్రిల్‌ 1 నుంచి 3 వరకు స్ర్కీనింగ్‌ పరీక్షలు చేశారు. విజయవాడలో 992 మంది రోగులను పరీక్షించగా వీరిలో 19 మందికి గుండె సంబంధిత వ్యాధులు ఉన్నట్లు యాప్‌ నిర్ధారించింది. ఈ 19 మంది రోగులను కార్డియాలజీ వైద్య బృందం ఈసీజీ, 2డి ఎకో పరీక్షలతో మరోసారి వార్డులో పరీక్షలు జరిపింది. ఆశ్చర్యకరంగా మొత్తం 19 మందికి గుండె జబ్బులు ఉన్నట్లు తేలింది. గుంటూరు జీజీహెచ్‌లో 863 మందికి స్ర్కీనింగ్‌ చేయగా, వీరిలో 16 మందికి గుండె జబ్బులు ఉన్నట్లు సర్కాడియాన్‌ యాప్‌ తేల్చింది. అయితే అందులో నలుగురు వైద్య బృందం పరీక్షలకు హాజరుకాకుండా ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారు. మిగిలిన 12మందికి కార్డియాలజిస్టుల ఆధ్వర్యంలో ఈసీజీ, ఎకో పరీక్షలు చేయగా, ఆ 12 మందికి జబ్బు నిర్ధారణ అయ్యింది.


స్ర్కీనింగ్‌ పరీక్షలకు ఎంతో ఉపయోగం

ఆరు రోజుల్లో గుంటూరు, విజయవాడ ప్రభుత్వాస్పత్రుల్లో మొత్తం 1,855 మంది ఓపీ రోగులకు సర్కాడియాన్‌ యాప్‌తో స్ర్కీనింగ్‌ నిర్వహించారు. 35 మందికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు యాప్‌ తేల్చింది. తదుపరి వైద్య పరీక్షలకు హాజరైన 31 మందికి గుండె జబ్బులు ఉన్నట్లు నిర్ధారణ అయింది.

వంద శాతం కచ్చితత్వంతో సర్కాడియాన్‌ ఏఐ యాప్‌ పని చేస్తోందని, ఈ టూల్‌ గుండెజబ్బుల స్ర్కీనింగ్‌ పరీక్షలకు చక్కగా సరిపోతుందని విజయవాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ ఎ.వి.రావు ప్రశంసించారు.

యాప్‌పై సానుకూల అభిప్రాయం వ్యక్తం చేసిన గుంటూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమణ యశస్వి శుక్రవారం సర్కాడియాన్‌ యాప్‌ రూపకర్త, ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన ఏఐ నిపుణుడు సిద్ధార్థ్‌ నంద్యాలను సన్మానించారు.

ఈ రెండు ఆసుపత్రుల్లోని పైలట్‌ ప్రాజెక్ట్‌ నివేదికను ఆరోగ్య శాఖకు అందజేస్తామని సిద్ధార్థ్‌ తండ్రి మహేశ్‌ తెలిపారు.

Updated Date - Apr 05 , 2025 | 02:57 AM