Police Dogs: పోలీసు జాగిలం.. బిజీబిజీ..
ABN , Publish Date - Apr 14 , 2025 | 03:33 AM
అమరావతిలో విఐపీల భద్రత, నేరాల దర్యాప్తులో పోలీసు జాగిలాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. పనిభారం ఎక్కువగా ఉండటంతో అవి నిరంతరం బిజీగా ఉంటున్నాయి. మందుపాతరలు, డ్రగ్స్, నేరస్థుల ఆచూకీ గుర్తించడంలో అవి అద్భుతంగా సహాయపడుతున్నాయి.

రాజధాని అమరావతితో జాగిలాలపై పెరిగిన పనిభారం
సీఎం, డిప్యూటీ సీఎం, మాజీ సీఎంల ఇళ్ల వద్ద భద్రతా విధులు
అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు వద్ద తనిఖీలు షరా మామూలే
వీటితోపాటునేర పరిశోధన, మందుపాతరల అన్వేషణ భారమూ
అమరావతిలో వీవీఐపీల కార్యక్రమాలతో జాగిలాలు ఉక్కిరిబిక్కిరి
(గుంటూరు-ఆంధ్రజ్యోతి)
పనిభారం మనుషులకే కాదు.. పోలీసు జాగిలాలకూ తప్పడం లేదు. అమరావతి రాజధాని కారణంగా వాటికి క్షణం తీరిక ఉండటం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇళ్ల వద్ద రోజువారీ తనిఖీలకు తోడు అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు రక్షణ బాధ్యతలతో అవన్నీ బిజీ బిజీగా ఉంటున్నాయి. దానికితోడు రాజధాని పరిధిలో ముమ్మరంగా జరుగుతున్న వీవీఐపీల భారం కూడా పడటంతో ఈ జాగితాలు పనిభారంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి.
నేర పరిశోధనలో కీలకం
నేరస్థుల అడుగుజాడలు, మందుపాతరల ఆచూకీ గుర్తించడంలో పోలీసు జాగిలాల పాత్ర కీలకం. దీంతో వీవీఐపీల భద్రతతో పాటు వారి నివాసాల వద్ద, వారు ప్రయాణించే మార్గాల్లో కోసం వీటినే ఉపయోగిస్తున్నారు. గుంటూరు జిల్లా పోలీసు శాఖ సంరక్షణలో ఉన్న నాలుగు జాగిలాలు కూడా మందుపాతరలను కనుగొనటంలో ఎంతో శిక్షణ పొందాయి. నేరం జరిగిన ప్రాంతాల్లో ఆధారాలతో పాటు బాంబులు, మందుగుండు సామగ్రి, మత్తు పదార్థాలను గుర్తించడం, తప్పిపోయిన వ్యక్తుల ఆచూకీ కనిపెట్టడంలో అవి అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాయి.
కేసుల ఛేదనలో...
గుంటూరులో డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించడంలో ఒక జాగిలం కీలక పాత్ర పోషించింది, అతి తక్కువ సమయంలో డ్రగ్స్ నిల్వలు ఉన్న ప్రదేశాన్ని గుర్తించి పోలీసులకు దారి చూపింది. అలాగే ఒక ప్రసిద్ధ కార్యక్రమంలో అనుమానాస్పద బాంబును జాగిలాల సాయంతో పోలీసులు గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఒక దోపిడీ కేసులో, నేరస్థులు ఎక్కడికి పారిపోయారో గుర్తించడంలో డాగ్ స్క్వాడ్ సహకారం కీలకంగా మారింది. గుంటూరు జిల్లాలో నేర పరిశోధనల్లో ఈ జాగిలాలు నిత్యం పోలీసులకు సహకారం అందిస్తున్నాయి.
అమరావతితో మరింత పని
రాజధాని అమరావతి ప్రాంతం కూడా గుంటూరు జిల్లా పరిఽధిలోనే ఉండటంతో వీటికి పనిభారం పెరిగింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచి ముగిసే వరకు వీటి పాత్ర ఎంతో కీలకంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతిలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో ముఖ్యమంత్రి, మంత్రుల కార్యక్రమాలు పెరిగాయి. ఆ సమయంలో కూడా వీటికి పని ఎక్కువగా ఉంటోంది.
గుంటూరు పోలీసు పరిధిలో ఏడు జాగిలాలు ఉండగా అందులో ఒకటి ఇటీవలే మరణించింది. మరో రెండు రిటైర్ అయ్యాయి. ప్రస్తుతం నేర పరిశోధనలో నాలుగు జాగిలాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. అదేవిధంగా స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డే రోజుల్లోనూ పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో ముందురోజు నుంచే ఈ జాగిలాలు విధులు నిర్వహిస్తాయి. ఈ వేడుకల్లో కూడా పాల్గొని తమ విన్యాసాలు ప్రదర్శిస్తాయి. గత స్వాతంత్య్ర దినోత్సవం రోజుల ఇన్‌చార్జ్ మంత్రి హోదాలో గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో జరిగిన వేడుకలకు మంత్రి లోకేశ్ వచ్చారు. ఆ సమయంలో సీనియర్ పోలీస్ డాగ్‌గా పేరొందిన మార్షల్ తన హ్యాండ్లర్ సంజీవరావు తో కలసి లోకేశ్‌కు ఎదురేగి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికింది.
రోజుకు రెండు పూటలే ఆహారం
హైదరాబాద్‌లోని కుక్కపిల్లల విక్రయ కేంద్రం నుంచి 3నెలల వయసులో ఈ జాగిలాలను తీసుకొచ్చి శిక్షణ ఇస్తారు. వీటి ఆలనా పాలనా మొత్తం హ్యాండ్లరే చూసుకోవాలి. ఉదయం 6గంటలకే నిద్ర లేపి ఎక్సర్‌సైజ్‌లు చేయించడంతో వీటి దినచర్య ప్రారంభమవుతుంది. అనంతరం ఒక్కో జాగిలం ఒక్కో ప్రదేశానికి డ్యూటీకి వెళ్లిపోతుంది. ఇవి రోజుకు రెండు పూటల ఆహారం తీసుకుంటాయి. రోజు మొత్తం మీద 500 గ్రాముల ఆహారం ఇస్తారు. రాయల్ కెనైల్, మాక్సీ అడల్ట్ అనే నాన్‌వెజ్‌తో కూడిన డ్రై ఫీడ్‌ను అందిస్తారు. నాలుగు రోజులకోసారి చొప్పున ఒక్కో జాగిలానికి విశ్రాంతి కల్పిస్తారు.
రూప అనే ఆడ జాగిలానికి హ్యాండ్లర్‌గా కానిస్టేబుల్ పి. సుబ్బారావు వ్యవహరిస్తున్నారు. లేబ్రడార్ రిట్రైవర్ జాతికి చెందిన దీని వయసు 6 సంవత్సరాల 3నెలలు. మందు పాతరలు కనుగొనటంలో దీనికి ఎంతో నైపుణ్యం ఉంది.
ఆర్మీ అనే పేరు గల జాగిలానికి కానిస్టేబుల్ పి. శ్రీనివాసరావు హ్యాండ్లర్‌గా ఉన్నారు. దీని వయసు నాలుగేళ్లు. లేబ్రడార్ రిట్రైవర్ జాతికి చెందిన ఈ మగ జాగిలం వయసు తక్కువైనప్పటికీ నేర పరిశోధనలో మాత్రం ఎంతో చురుగ్గా వ్యవహరిస్తుంది.
గుంటూరు పోలీసులకు నేర పరిశోధనలో కీలకంగా ఉపయోగపడుతున్న జాగిలాల్లో మార్షల్ అత్యంత సీనియర్. ఈ మగ జాగిలం వయసు తొమ్మిదేళ్లు. దీనికి హ్యాండ్లర్‌గా హెడ్ కానిస్టేబుల్ సంజీవరావు వ్యవహరిస్తున్నారు. లేబ్రడార్ రిట్రైవర్ జాతికి చెందిన ఇది మందుపాతరలను గుర్తించడంలో పేరొందింది.
గుంటూరు పోలీసులకు నేర పరిశోధనలో ఉపయోగపడుతున్న జాగిలం మాక్స్. వయసు ఏడేళ్లు. బెల్జియం మాలినోయిస్ జాతికి చెందిన ఈ మగ జాగిలానికి కానిస్టేబుల్ కె. శ్రీనివాసరావు హ్యాండ్లర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈయన కనుసన్నల్లోనే ఇది పనిచేస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ
AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..
TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
For AndhraPradesh News And Telugu News