Pawan Kalyan: కుంభకోణాల్లో వైసీపీ రికార్డులు
ABN, Publish Date - Jan 11 , 2025 | 04:24 AM
కుంభకోణాల్లో గత వైసీపీ ప్రభుత్వం రికార్డులు సృష్టించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
కుగ్రామాల వారు అవస్థలు
పడుతుంటే 500 కోట్లతో ప్యాలస్ కట్టుకున్నారు
ప్రజలకు చాకిరీ చేసేందుకే వచ్చా
పిఠాపురం సభలో పవన్‌కల్యాణ్
కాకినాడ, జనవరి 10(ఆంధ్రజ్యోతి): కుంభకోణాల్లో గత వైసీపీ ప్రభుత్వం రికార్డులు సృష్టించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా ఏజెన్సీలో 414 కుగ్రామాల ప్రజలు ఆస్పత్రులకు డోలీలు కట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ ఇబ్బందులను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తే రూ.39 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. కానీ, గత వైసీపీ పాలనలో విశాఖలో రూ.500 కోట్లతో ప్యాలస్ కట్టుకున్నారని.. ఏకంగా రూ.2 నుంచి రూ.3 కోట్ల వ్యయంతో బాత్‌రూమ్‌లు నిర్మించుకున్నారని దుయ్యబట్టారు. చిన్నపాటి రోడ్డును కూడా నిర్మించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో కుంభకోణాల్లో రికార్డులు సృష్టించిందని తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ శుక్రవారం పర్యటించారు. కుమారపురం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 12,500 చిన్నస్థాయి గోకులాలను ఆయన ప్రారంభించారు. అనంతరం పిఠాపురం బహిరంగసభలో ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే.. గత వైసీపీ ప్రభుత్వంలో అలవాట్లు ఇంకా కొంతమంది అధికారులకు పోలేదు. కొందరు నిర్లక్ష్యంగా ఉంటున్నారు.
నాకు పనిచేయడం తప్ప వేరేది తెలియదు. పిఠాపురంలో ప్రజలు ఇచ్చిన విజయంతో కూటమి ప్రభుత్వం ద్వారా ప్రధాని మోదీ రాష్ట్రానికి రూ.2.08లక్షల కోట్ల పెట్టుబడులు ఇచ్చారు. దీంతో పిఠాపురంలో ఈ సంక్రాంతి అద్భుతంగా జరపాలని, ఊరంతా పందిరి వేద్దామని అనుకున్నాం. కానీ, తిరుపతి ఘటనతో ఇలా కష్టసమయంలో స్థాయి తగ్గించి చేద్దామని పాఠశాలకే పరిమితం చేశాం. స్టార్‌డమ్ వదులుకుని నేను ఒకటిన్నర దశాబ్దంగా నలిగిపోతూ ఫలితం ఆశించకుండా పోరాటం చేశా. ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ గాయాలకు ప్రజలు విజయంతో మందు పోశారు. నా తండ్రి జీతంగా తీసుకున్న డబ్బులతో ఎదిగిన వాళ్లం మేమంతా. అందుకే అన్నమయ్య జిల్లాలో ఎంపీడీవోపై దాడి జరిగితే కన్న తండ్రిపై దాడి జరిగితే కన్నకొడుకు ఎలా స్పందిస్తాడో అలా స్పందించా. రాజకీయాల్లోకి నేను గొడ్డు చాకిరీ చేయడానికి వచ్చా. 26 జిల్లాలు తిరగాలని అనుకున్నా. ఇంటిని శుభ్రం చేసిన తర్వాత రాష్ట్రం సంగతి చూద్దామని.. పిఠాపురం నుంచే నా యాత్ర మొదలుపెడతా. పిఠాపురంలో ఈవ్‌టీజింగ్ పెరిగింది. ఆడపిల్లలను ఏడిపిస్తే తొక్కి నార తీస్తా.
Updated Date - Jan 11 , 2025 | 04:24 AM