Share News

Employment Guarantee: మంత్రులూ.. కాస్త పట్టించుకోండి

ABN , Publish Date - Apr 15 , 2025 | 03:54 AM

2014-19 టీడీపీ హయాంలో ఉపాధి హామీ పనులకు 1000 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వంలో బకాయిల చెల్లింపులపై చర్యలు తీసుకోకపోవడం, మంత్రులు స్పందించకపోవడం ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Employment Guarantee: మంత్రులూ.. కాస్త పట్టించుకోండి
MGNREGA

అతీగతీ లేని ‘ఉపాధి’ పనుల బకాయిలు

2014-19లో పనులు చేస్తే నేటికీ పెండింగ్‌

టీడీపీ మద్దతుదారులని చెల్లించని గత సర్కారు

సుమారు రూ.1000 కోట్ల బకాయిలు

కూటమి వచ్చాక సీఎం చంద్రబాబు ఆదేశించినా

చెల్లింపులపై దృష్టి పెట్టని ఇన్‌చార్జి మంత్రులు

ప్రభుత్వం ఏర్పడి 10 నెలలైనా తీరని కష్టాలు

ఎన్టీఆర్‌ హౌసింగ్‌ బకాయిలు మరో 960 కోట్లు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

2014-19 మధ్య టీడీపీ హయాంలో అప్పటి సర్పంచులు, టీడీపీ మద్దతుదారులు చాలా చోట్ల అప్పులు చేసి ఉపాధి హామీ పనులు చేశారు. బిల్లుల బకాయిలు సుమారు రూ.1000 కోట్ల వరకు ఉన్నాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక.. టీడీపీకి చెందిన వారనే సాకుతో బిల్లులు నిలిపివేశారు. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బకాయిలను రూ.2 వడ్డీతో చెల్లిస్తామని చెప్పారు. దీంతో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ కష్టాలు తీరుతాయని పనులు చేసినవారు ఆశించారు. సీఎం చంద్రబాబు బిల్లుల చెల్లింపు బాధ్యతను ఇన్‌చార్జి మంత్రులు (టీడీపీ), బీజేపీకి చెందిన ఇన్‌చార్జి మంత్రి, జనసేన వారైతే జిల్లా మంత్రికి అప్పగించారు. కానీ వారెవరూ బకాయిల వివరాల సేకరణపైనే దృష్టి పెట్టలేదు. ఏ గ్రామంలో ఎంతమందికి ఎంత మొత్తం ఇవ్వాలన్న వివరాలను తెప్పించుకోవడంపై జిల్లా మంత్రులు, ఇన్‌చార్జి మంత్రులు ఎవరూ దృష్టి సారించడం లేదు. పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌, డ్వామా అధికారులను కూర్చోబెట్టి ఉపాధి బకాయిల వివరాలు సేకరించడం పెద్ద పని కాదు. కానీ ఆ దిశగా 26 జిల్లా ల్లో ఏ మంత్రి కూడా బాధ్యత తీసుకోవడం లేదు.


చంద్రబాబు, లోకేశ్‌ చెప్పినా..

‘ఇన్‌చార్జి మంత్రులు జిల్లాల పర్యటనలు తప్పనిసరిగా చేయాలి. జిల్లాలకు వెళ్లినప్పుడు పార్టీ కార్యాలయానికి తప్పకుండా వెళ్లాలి. కార్యకర్తల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారంపై దృష్టి సారించాలి. 2014-19లో టీడీపీ మద్దతుదారులు చేసిన పనులకు సంబంధించిన బకాయిల వివరాలు సేకరించి, వీలైనంత త్వరగా చెల్లింపులు జరిపేలా చూడండి’.. అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీఎల్పీ సమావేశంలోనూ, టెలీకాన్ఫరెన్సుల్లోనూ పదే పదే చెబుతున్నారు. ‘2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఉపాధి హామీ పనులు కానీ స్టేట్‌ డెవల్‌పమెంట్‌ నిధులు, ఇతరత్రా నిధులతో పనులు చేసి బిల్లులు రాని వారందరికీ చెల్లింపులు చేస్తాం. దీనికోసం ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికీ బకాయిలు చెల్లించేలా చూస్తాం’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్‌ పార్టీ నేతలకు హామీ ఇచ్చారు. ఈ మాటలను మంత్రులు ఎవరూ పెద్దగా పట్టించుకున్న దాఖలా కనిపించడం లేదు. ఇన్‌చార్జి మంత్రులు మొక్కుబడిగా జిల్లా సమీక్షా సమావేశాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ముఖ్యంగా టీడీపీకి చెందిన మంత్రులు ఎవరూ పార్టీ కార్యాలయాలకు వెళ్లి కార్యకర్తలతో సమావేశం కావడం కానీ.. 2014-19 మధ్య చేసిన ఉపాధి పనులు, ఇతరత్రా పనుల వివరాలు సేకరించడం కానీ చేయడం లేదు. అప్పట్లో ఈ పనులు చేసిన టీడీపీ మద్దతుదారులు మం త్రుల చుట్టూ తిరిగినా ప్రయోజనం ఉండటం లేదు.

fg.jpg

‘ఉపాధి’ బకాయిల వివరాలిలా..

2014-19 ఉపాధి బకాయిల్లో.. రూ.180 కోట్లు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బకాయిలు చెల్లించకుండానే మొత్తం చెల్లింపులు జరిపినట్లు చూపి అప్పట్లో వైసీపీ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక ఇచ్చింది. దీంతో ఈ ఖాతాలను కేంద్రం క్లోజ్‌ చేసింది. ఈ మొత్తం రావాలంటే కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఆ ఖాతాలను తెరవాల్సి ఉంటుంది. ఇవి కాకుండా మరో రూ.150 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంది. హైకోర్టుకు వెళ్లి బిల్లులు చెల్లించాలని ఆదేశాలు తెచ్చుకున్నా అప్పటి జగన్‌ సర్కార్‌ ఈ రూ.150 కోట్లు ఇవ్వకుండా పెండింగ్‌లో ఉంచింది. ఈ రెండు మొత్తాలు కాకుండా సుమారు రూ.600 కోట్ల వరకు నరేగా, కన్వెర్జెన్స్‌ నిధులు అతీగతీ లేకుండా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ వివరాలనే సేకరించాలని మంత్రులకు సీఎం ఆదేశించారు. మొత్తం మీద సుమారు రూ.1000 కోట్ల వరకు ఉపాధి పనుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.


‘ఎన్టీఆర్‌’ బకాయిలూ పెండింగ్‌..

టీడీపీ హయాంలో 2014-19 నడుమ చేపట్టిన ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి రూ.960 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్టీఆర్‌ హౌసింగ్‌ కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలకు చెల్లింపులు చివరి ఏడాదిలో నిలిచిపోయాయి. అప్పట్లో కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వానికి దూరం పెరగడంతో ఇళ్ల నిర్మాణ బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడంతో ఆ బిల్లుల చెల్లింపును నిలిపివేశారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటుతున్నా ఆ బిల్లుల ఊసెత్తడం లేదు.

జగనన్న ఇళ్లకు మాత్రం క్లియర్‌

వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసిన జగనన్న ఇళ్లకు అదనంగా చెల్లిస్తానన్న మొత్తం మాత్రం ఇటీవల విడుదల చేశారు. ఈ ఏడాది మార్చి 31న రూ.229 కోట్లు చెల్లింపులు చేశారు. 2014-19లో ఎన్టీఆర్‌ హౌసింగ్‌ బకాయిలు రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల మంది లబ్ధిదారులకు సుమారు రూ.960 కోట్ల వరకు ఉండగా, వాటిని పట్టించుకోకుండా జగనన్న ఇళ్లకు చెల్లింపులు చేయడం ఏమిటని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఈ మొత్తాన్ని విడుదల చేస్తున్నట్లు ఎక్కడా కనీస ప్రచారం లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు పంపడం విమర్శలకు తావిస్తోంది.

58 మంది ఆత్మహత్య

గత టీడీపీ ప్రభుత్వంలో అప్పులు తీసుకొచ్చి ఉపాధి హామీ పనులు చేసిన వారు.. అప్పులు, వాటిపై వడ్డీలు పెరిగి దిక్కుతోచని స్థితిలో 58 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. చాలా మంది హైకోర్టును ఆశ్రయించారు. బిల్లులు చెల్లించాలని హైకోర్టు ఆదేశించినా గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.


ఈ వార్తలు కూడా చదవండి:

Visakhapatnam: మరో 24 గంటల్లో డెలివరీ కానున్న భార్య.. భర్త ఎంత దారుణానికి ఒడికట్టాడో..

PM Narendra Modi: కంచ గచ్చిబౌలి భూములు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ..

Updated Date - Apr 15 , 2025 | 09:59 AM