Polavaram Project : పోలవరాన్ని సందర్శించిన పార్లమెంటరీ కమిటీ
ABN, Publish Date - Jan 12 , 2025 | 06:48 AM
పోలవరం ప్రాజెక్టును కేంద్ర పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుల బృందం శనివారం పరిశీలించింది. స్టాండింగ్ కమిటీ చైర్మన్ రాజీవ్ ప్రతాప్ రూఢీ నేతృత్వంలో 11 మంది ఎంపీలు, 27 మంది ఇంజనీర్లు ఉదయం 11.30 గంటలకు రాజమహేంద్రవరం
అమరావతి, ఏలూరు, జనవరి 11(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టును కేంద్ర పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుల బృందం శనివారం పరిశీలించింది. స్టాండింగ్ కమిటీ చైర్మన్ రాజీవ్ ప్రతాప్ రూఢీ నేతృత్వంలో 11 మంది ఎంపీలు, 27 మంది ఇంజనీర్లు ఉదయం 11.30 గంటలకు రాజమహేంద్రవరం నుంచి రోడ్డు మార్గాన ప్రాజెక్టుకు చేరుకున్నారు. ఉదయాన్నే పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ వెంకట ప్రతాప్ శివకిశోర్, జేసీ ధాత్రిరెడ్డి వారికి స్వాగతం పలికారు. స్టాండింగ్ కమిటీకి పోలవరం ప్రాజెక్టు ఆవశ్యకతను మంత్రి నిమ్మల వివరించారు. అనంతరం జిల్లా అధికారులు, ప్రాజెక్టు ఇంజనీర్లతో ప్రాజెక్టు కార్యాలయంలో కమిటీ సమావేశమయింది. సమావేశం అనంతరం కమిటీ పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వే, ఎగువ కాపర్ డ్యాం, డయాఫ్రం వాల్ నిర్మాణ ప్రాంతం, వైబ్రో కాంపాక్షన్ పనులు పరిశీలించారు. ఈ బృందానికి ప్రాజెక్టు పనుల ప్రగతి, సంబంధిత వివరాలను సీఈ నరసింహమూర్తి వివరించారు.
2027 నాటికి పూర్తి చేస్తాం: మంత్రి నిమ్మల
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2027 సెప్టెంబరుకు పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయడు అన్నారు. శనివారం ఆయన విలేకరుల తో మాట్లాడారు. ‘గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ప్రాజెక్టు నిర్మాణం 20 ఏళ్ల వెనక్కి పోయింది. గతంలో టీడీపీ ప్రభుత్వ పాలనలో ప్రాజెక్టు నిర్మాణంలో పనులు 72 శాతం పూర్తి అయ్యా యి. 18 నెలలపాటు కష్టపడి డయాఫ్రం వాల్ నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వ అలసత్వం వల్ల ధ్వంసమైంది. సీఎం చంద్రబాబు ఇచ్చిన గడువు ప్రకా రం డయాఫ్రం వాల్ కాంక్రీట్ పనులు చేపడ తాం. 2017లో నిర్వాసితులకు అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు రూ.800 కోట్లు పరిహా రం అందించారు. ప్రస్తుతం మళ్లీ అధికారంలోకి వచ్చిన తక్కువ వ్యవధిలోనే మరో రూ.800 కోట్లకు పైగా నిధులు అందించింది చంద్రబాబే. వైసీపీ పాలనలో నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేకపోయారు.’ అని మంత్రి నిమ్మల విమర్శించారు.
Updated Date - Jan 12 , 2025 | 06:48 AM