Share News

Polavaram Rehabilitation: 6 నెలల్లో పునరావాసం

ABN , Publish Date - Apr 16 , 2025 | 06:39 AM

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆరు నెలల్లో పునరావాసం పూర్తి చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది చింతూరు, కేఆర్‌పురం ప్రాంతాల్లో 48 గ్రామాలకు R&R ముసాయిదా మేలో సిద్ధం కానుంది

Polavaram Rehabilitation: 6 నెలల్లో పునరావాసం

  • పోలవరం తొలి దశలో నిర్వాసితుల కాలనీల పూర్తికి కసరత్తు

  • చింతూరు, కేఆర్‌పురం ఐటీడీఏల పరిధిలో 48 గ్రామాలకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ

  • ఈ నెలాఖరుకల్లా ముసాయిదా సిద్ధం

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకోవడానికి ప్రభుత్వం సమాయత్తమైంది. ప్రధానంగా హెడ్‌వర్క్స్‌ నిర్మాణాలకు సమాంతరంగా పునరావాస కాలనీల నిర్మాణం కూడా చేపట్టి ఆరు నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. చింతూరు, కేఆర్‌పురం ఐటీడీఏల పరిధిలో సహాయ పునరావాస (ఆర్‌ అండ్‌ ఆర్‌) ప్యాకేజీ ముసాయిదాకు రూపకల్పన చేస్తోంది. వేగంగా పనులు జరగని చోట్ల కాంట్రాక్టులు రద్దుచేసింది. కొత్త కాంట్రాక్టర్ల కోసం టెండర్లు పిలిచేందుకు సిద్ధమైంది. ఇటీవల పోలవరం ప్రాజెక్టులో క్షేత్ర స్థాయిలో పర్యటించిన సీఎం చంద్రబాబు.. ప్రాజెక్టు పూర్తయ్యేలోపు నిర్వాసితులకు పూర్తిస్థాయి సహాయ పునరావాసం అందిస్తామని ప్రకటించారు. ప్రాజెక్టు తొలి దశలో మొత్తం 38,060 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఈ పనులను పరుగులు తీయించడానికి తొలి దశ పనులను ఏ, బీ కేటగిరీలు వర్గీకరించారు. ఫేజ్‌-1ఏలో 20,946 కుటుంబాలు ఉన్నాయి. వారికోసం ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 75 కాలనీల నిర్మాణం చేపట్టారు. ఇప్పటి వరకూ 26 పూర్తయ్యాయి. 14,369 కుటుంబాలను తరలించారు. 49 నిర్మాణంలో ఉన్నాయి. ఇంకా 6,577 కుటుంబాలను తరలించాల్సి ఉంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మిగతా 49 కాలనీల్లో పనులు వేగవంతంగా జరుగకపోవడం, గత ప్రభుత్వం నిర్వాకం వల్ల సమస్యలు పేరుకుపోవడం, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవడంతో పనులు మందగించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం జనవరిలో అప్పటి వరకూ ఉన్న పెండింగ్‌ బిల్లులను విడుదల చేసింది. ఇంకా రూ.120 కోట్ల వరకూ పెండింగ్‌లో ఉన్నాయి.


పెండింగ్‌ బిల్లులను ఆయా ఈఈలు సమర్పించాల్సి ఉంది. ప్రస్తుతం అదీ పూర్తవుతోంది. అల్లూరి, ఏలూరు జిల్లాల్లో ప్రస్తుతం కాంట్రాక్టు రద్దయిన 49 కాలనీల్లో మొత్తం 13,938 ఇళ్లు నిర్మించాల్సి ఉండగా ఇప్పటికి 11,659 నిర్మించారు. ఈ ప్రాంతాల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ భవనాలు పూర్తవలేదు. వీటన్నిటినీ సెప్టెంబరుకు పూర్తి చేసి.. నవంబరుకల్లా 6,577 కుటుంబాలను తరలించాలన్నది లక్ష్యం..

48 గ్రామాలకు ముసాయిదా సిద్ధం

ఫేజ్‌-1బీ కింద చింతూరు, కేఆర్‌పురం ఐటీడీఏల పరిధిలోని 48 గ్రామాలకు చెందిన 17,114 కుటుంబాలకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలు చేయడానికి ఆర్‌ అండ్‌ ఆర్‌ ముసాయిదాను ఈ నెలాఖరులోపు సిద్ధం చేయనున్నారు. కేఆర్‌పురంలో గ్రామసభలు పూర్తి చేశారు. చింతూరు పరిధిలోని 32 గ్రామాల్లో సభలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ భూమికి భూమి ఇవ్వడంతో పాటు నష్టపరిహారం, పునరావాస కాలనీల నిర్మాణం చేయాలి. ముసాయిదాను మే 31కల్లా ప్రచురించి.. జూలైకి అవార్డుకు ఆమోదం పొందే దిశగా కసరత్తుచేస్తున్నారు.


పోలవరం చేరుకున్న కేంద్ర నిపుణులు

కేంద్ర బృందం మంగళవారం పోలవరం ప్రాజెక్టు ప్రాం తానికి చేరుకుంది. మట్టి, రాతి నాణ్యత నిపుణులు బి.సిద్దార్ద్‌ హెడావో, సైంటిస్టు ఏఆర్వో విపుల్‌ కుమార్‌ గుప్తా వీరిలో ఉన్నారు. ఈ బృందం ప్రాజెక్టులో గ్యాప్‌-1, గ్యాప్‌-2, డయాఫ్రం వాల్‌ ప్రాంతాల్లో బుధవారం నుంచి 18వ తేదీ వరకు పర్యటించనుంది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో దండంగి, మట్టి డంపింగ్‌ ప్రాంతాల్లో నాణ్యతా ప్రమాణాల పరీక్షలు నిర్వహిస్తుంది. ఆయా నిర్మాణాల వినియోగానికి ఆ మట్టి ఎంతవరకు అనుకూలమో తేల్చి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, పీపీఏ, కేంద్ర జలసంఘానికి నివేదిక సమర్పిస్తుంది.

ఆర్‌అండ్‌ఆర్‌ పనులు వేగవంతం

సీఎం చంద్రబాబు ఆదేశాలతో పోలవరం భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులు వేగవంతం చేశాం. 49 పునరావాస కాలనీల పాత కాంట్రాక్టును రద్దు చేశాం. అతి త్వరలోనే కొత్త టెండర్లు పిలిచి ఆరునెలల్లో పెండింగ్‌ పనులు పూర్తి చేస్తాం. చింతూరు, కేఆర్‌పురం ఐటీడీఏల పరిధిలో నిర్వాసితులకు రెండున్నర ఎకరాల వరకూ భూమికి భూమి ఇస్తాం.

- వి.అభిషేక్‌, పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ర్టేటివ్‌ అధికారి, ధవళేశ్వరం.

Updated Date - Apr 16 , 2025 | 06:40 AM