వైభవంగా శ్రీరామనవమి
ABN , Publish Date - Apr 07 , 2025 | 01:04 AM
రామనవమి వేడుకలు మార్కాపురం పట్టణంలో వైభవంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పట్టణంలోని వాడవాడలా వీధులలో రామాలయాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు.

మార్కాపురం వన్‌టౌన్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): శ్రీరామనవమి వేడుకలు మార్కాపురం పట్టణంలో వైభవంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పట్టణంలోని వాడవాడలా వీధులలో రామాలయాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ప్రసన్న రామస్వామి ఆలయంలో శ్రీపతి అప్పనాచార్యుల ఆధ్వర్యంలో సీతా రాముల కళ్యాణం నిర్వహించారు. మాంగళ్యధారణ, తలంబ్రాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు సీతా రాముల కళ్యాణం తిలకించి పులకరించిపోయారు. పట్టాభిరామాలయం, అయోధ్య రామాలయం, తూర్పు వీధి రామాలయంలతో పాటు అన్ని రామాలయాల వద్ద పానకం, వడపప్పు పంచారు. రామనామజపంతో వీధులన్ని ఆధ్యాత్మీక పారవశ్యంలో మునిగిపోయాయి.
బేస్తవారపేట : బేస్తవారపేటలోని బజార్‌లోని రామాలయంలో, రాణిపేట రామాలయంలో శ్రీసీతారామ కళ్యాణం నిర్వహించారు. సాయంత్రం మెయిన్ రోడ్డులో గ్రామోత్సవం నిర్వహించారు. వేదపండితుల వేదమంత్రలతో శ్రీసీతారామ కళ్యాణం నిర్వహిచారు.
కంభం : శ్రీరామనవమి సందర్భంగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మండలంలోని పెద్దనల్లకాల్వ, చిన్నకంభం గ్రామాల్లోని సీతారాముల వారిని దర్శించుకున్నారు. పెద్దనల్లకాల్వలోని రామాల యంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొ ని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనం తరం చిన్నకంభంలో నిర్వహించిన నవమి వేడుకల్లో భాగంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామనవమి అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని, రైతాంగం సుభిక్షంగా ఉండా లని, అన్నిరంగాలలో రాణించాలని ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కంభం, అర్థవీడు మండలాల్లో సీతారాముల వారి దేవాలయాల్లో సీతారాముల కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. మండలంలోని లింగోజీపల్లి, అర్థవీడు మండలంలోని నాగులవరం, జంగంగుంట్ల, కంభం నెహ్రూనగర్‌లో రాముల వారి దేవాలయాల్లో కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఆయా దేవాలయాల్లో భక్తులకు అన్నదానం నిర్వహించారు.
గిద్దలూరు : గిద్దలూరు, రాచర్ల మండలాల్లో శ్రీరామనవమి పర్వదినాన్ని ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పలు దేవాలయాలలో సీతారాముల కళ్యాణ మహోత్సవాలు కన్నుల పండువగా నిర్వహిం చారు. పట్టణంలోని పాతబద్వేల్ రోడ్డులోని సీతా రాముల దేవాలయంలో స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. వందలాది మంది భక్తులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామి వారికి పూజలు నిర్వహించారు. దేవస్థాన కమిటీ అధ్యక్షులు నాగార్జునరావు, కార్యని ర్వాహక అధ్యక్షులు నరసింహారావు, కమిటీ ప్రతి నిధులు పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో సీతారాముల పట్టాభి షేకం వైభవంగా జరిగింది. దేవస్థాన కమిటీ అధ్యక్షులు వాడకట్టు రంగసత్యనారాయణ, కార్యదర్శి తుమ్మలపెంట సత్యనారాయణ, కమిటీ ప్రతినిధులు ఆయా పూజా కార్యక్రమాలలో పాల్గొనగా భక్తులకు వడపప్పు, పానకాన్ని పంచిపెట్టారు. పట్టాభిరామ స్వామి దేవాలయంలో సైతం కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. కొండపేట ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరగ్గా, మహిళల కోలాట ప్రదర్శన అలరించింది. పొదలకొండపల్లి, ముండ్లపాడు, ఉయ్యా లవాడ, పలు గ్రామాలలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా కల్యాణం వైభవంగా నిర్వహించారు. రాచర్ల మండలం అనుమలవీడులోని రామాలయంలో ఆలయ ధర్మకర్త పిడతల ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యం లో సీతారాముల కళ్యాణం వైభవంగా జరగ్గా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
శోభాయాత్ర
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా విశ్వహిందూ పరిషత్, సమరసత సేవా ఫౌండేషన్, హిందూ దేవాల యాల కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. పాతబద్వేల్ రోడ్డులోని సీతారామ స్వా మి దేవస్థానం నుండి ఆయా కమిటీల ఆధ్వర్యంలో భక్తులు మోటార్ సైకిళ్లపై పట్టణంలో ర్యాలీ నిర్వ హించి శోభాయాత్రలో పాల్గొన్నారు.
త్రిపురాంతకం : శ్రీరామనవమి వేడుకలను భక్తులు మండలంలోని అన్ని గ్రామాలలో ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని పాతరామాలయం, కోదండరామాలయం, టి.చెర్లోపల్లిలోని వేంకటేశ్వరాలయాలతోపాటు అన్ని గ్రామాలలో చలువ పందిళ్లు ఏర్పాటు చేసి మంత్రోచ్చరణల నడుమ సీతారాముల కల్యాణం నిర్వహించారు. కల్యాణ క్రతువును తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. అనంతరం పానకం, వడపప్పు పంపిణీ చేశారు. అన్నసముద్రం మెట్ట ఆంజనేయ స్వామి ఆలయం, త్రిపురాంతకంలోని వై.పాలెం కూడలి వద్ద ఉన్న అభయాంజనేయస్వామి ఆలయం, వెల్లంపల్లిలో వీరాంజనేయ స్వామి ఆలయాల్లో శ్రీరామనవమి సందర్బంగా భక్తులు ప్రత్యేక పూజలు చేసి పొంగళ్లు వండి స్వామివారికి నైవేద్యం సమర్పించారు.
ఎర్రగొండపాలెం రూరల్ : శ్రీరామనవమి సందర్భం గా మండలంలోని వెంకటాద్రిపాలెం, బోయలపల్లి, కొత్తపల్లి, ఆయ్యంబొట్లపల్లి, తిరుమలగిరి కాలనీతో పాటు పలు గ్రామాలలో దేవాలయాల్లో ఆదివారం నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొత్తపల్లి గ్రామంలోని దేవాలయంలో స్వామి వారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. గురిజేపల్లిలో నూతన ఆలయంలో సీతారాముల నూతన విగ్రహాలను ఏర్పాటు చేసి హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వ హించారు. అలాగే స్థానిక పట్టాభిరామస్వామి దేవాలయంలో నిర్వహించిన కల్యాణ మహోత్సవంలో ఆలయ ఉభయ దాతలు, కమిటి సభ్యులు చక్కిలం నాగరాజు, సూరే రమేష్ దంపతులు పాల్గొన్నారు. ఆలయ ఆర్చకులు బొడ్డుపల్లి పవన్‌కుమార్ కల్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తులకు పానకం, వడపప్పుతో పాటు తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
ఎర్రగొండపాలెం : శ్రీరామనవమి సందర్భంగా ఎర్రగొండపాలెం, బోయలపల్లి, అమానిగుడిపాడులో పట్టాభిరామస్వామి, సీతాదేవిలకు అర్చకులు కల్యాణం వైభవంగా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల్లోని రామాలయాల్లో శ్రీరామనవమి సందర్భంగా కల్యాణం నిర్వహించారు. ఆలయాల్లో భక్తి కమిటి ఆధ్వర్యంలో భక్తులకు పానకం, వడపప్పు, తీర్ధప్రసాదములు పంపిణీ చేశారు.
పెద్దారవీడు : శ్రీరామనవమి పర్వదినం సందర్భం గా సీతారాముల వారి కళ్యాణం మండలంలోని పలు గ్రామాలలోని రామాలయాలలో ఆదివారం వైభవంగా నిర్వహించారు. పెద్దారవీడు పంచాయతీలోని పడమటి పల్లి, తూర్పుపల్లి, సిద్ధినాయునిపల్లిలోని మూడు రామాలయాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికలపై వేదపండితులు మేడవరపు రాఘవశర్మ కల్యాణ ఘట్టాలను వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కల్యాణాన్ని తిలకించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు. రాత్రి గ్రామోత్సవాలు నిర్వహించారు.
మార్కాపురం రూరల్ : మండలంలోని గ్రామాలలో రామాలయాలలో శ్రీరామనవమి సందర్బంగా సీతా రాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. మండలంలోని బోడపాడు గ్రామంలో వెలసిన పట్టాభి రామాలయంలో శ్రీరామనవ మి వేడుకలు ఆదివారం ప్రారంభమయ్యాయి. గ్రామంలో మూడురోజులపాటు ఏటా నిర్వహిస్తారు. మొదటి రోజు సీతారాముల కళ్యాణంతో ప్రారంభమైంది. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, స్వామివారి గ్రామోత్సవం నిర్వహిం చారు. ఈ పండుగకు గ్రామంలో అందరూ పాల్గొన డమే కాకుండా వివిధ రకాల ఉద్యోగాలలో స్ధిర పడ్డ వారు కూడా భక్తితో గ్రామానికి వచ్చి స్వామి సేవలో పాల్గొంటారు. మూడవ రోజు అంగరంగ వైభవంగా రధమహోత్సవ కార్యక్రమం గ్రామస్తులతో వారి బందువులు కూడా అదిక సంఖ్యలో పాల్గొంటారు.
మండలంలోని దరిమడుగు, బొడిచెర్ల, గజ్జలకొండ, రాజుపాలెం, రాయవరం, నాయుడుపల్లి, పెద్ద యాచవరం గ్రామాలతో పాటు అన్ని గ్రామాలలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థాన కమిటి పెద్దలు, గ్రామస్థులు మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్ద ప్రసాదాలు స్వీకరించారు.
తర్లుపాడు : మండలంలోని వాడవాడలా శ్రీరామ నవమి వేడుకలు భక్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామాలయాల వద్ద చలువ పందిళ్లు వేసి విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అర్చకులు ఓరుగంటి పవన్‌కుమార్, ప్రసాద్‌శర్మ, రమణాచార్యుల ఆధ్వర్యంలో సీతారామ కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కల్యాణ మహోత్సవం తిలకిం చేందుకు అధికసంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసా దాలు స్వీకరించారు. తర్లుపాడు, బొడిచర్లలో వీరాం జనేయస్వామికి భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
పుల్లలచెరువు : మండలంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం మండల కేంద్రమైన పుల్లలచెరువులోని రామాలయంలో గ్రామపెద్దలు ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం నిర్వహించారు. అనంతరం భక్తులకు పానకం, వడపప్పు పంపిణీ చేశారు. మండలంలోని ఉమ్మడివరం, మల్లాపాలెం, కవలకుంట్ల, చెన్నంపల్లి, పిడికిటివారిపల్లి, మర్రివేములతోపాటు పలు గ్రామాలలో సీతారాముల కల్యాణం నిర్వహించారు. మండలంలోని చాపలమడుగు, ఉమ్మడివరం, పుల్లలచెరువు ప్రసన్నాంజనేయ స్వామిలతోపాటు అన్ని గ్రామాలలోని ఆంజనేయస్వామి విగ్రహాల వద్ద భక్తులు తెల్లవారుజామున నుంచి పూజలు నిర్వహించారు. ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద భక్తులకు మంచినీరు, పానకం, వడపప్పు పంపిణీ చేశారు.