ఘనంగా ముక్కోటి ఏకాదశి
ABN, Publish Date - Jan 10 , 2025 | 11:23 PM
ముక్కోటి ఏకాదశిని పట్టణంలోని పలు ఆలయాల్లో శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
మార్కాపురం వన్‌టౌన్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ముక్కోటి ఏకాదశిని పట్టణంలోని పలు ఆలయాల్లో శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక శ్రీ లక్ష్మీచెన్నకేశవ స్వామి ముక్కోటి పురస్కరించుకుని ఉత్తరద్వార దర్శనం ఇచ్చారు. ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనాచార్యుల ఆధ్వర్యంలో చెన్నకేశవస్వామి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ చేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి శ్రీమహావిష్ణువు అలంకారంలో శేష తల్పంపై భక్తులకు ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి స్వామిని దర్శించు కుని పూజలు చేశారు. తెల్లవారుజామున 3గంటల నుంచే భక్తులు బారులుతీరారు. క్యూలైన్‌లు నిండి పోయాయి. ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఈవో గొలమారి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు. రథసప్తమి కమిటీ ఛైర్మన్ యక్కలి కాశీ విశ్వనాథం, సలహాదారు వక్కలగడ్డ మల్లికార్జున్, ఆలంపల్లి శ్రీనివాసరావు, బొంతల సుధీర్, సముద్రాల రమేష్ తదితరుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని పర్య వేక్షించారు. అనంతరం లక్ష్మీచెన్నకేశవ స్వామి తూర్పు ద్వారంలో భక్తులకు దర్శనం ఇచ్చి నగరోత్సవంలో విహరించారు. పట్టణంలోని కళ్యాణ వేంకటేశ్వర స్వామి, ప్రసన్న వేంకటేశ్వర స్వామి, ప్రసన్న రామ స్వామి ఆలయాలలో భక్తులు తూర్పు ద్వారంలో స్వాములను దర్శించుకున్నారు. టీడీపీ నాయకులు మాలపాటి వెంకటరెడ్డి, కాశీరావు తదితరులు పాల్గొ న్నారు. పట్టణ ఎస్‌ఐలు సైదుబాబు, రాజమోహన్‌రావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్‌ఐ అహరోన్, పోలీసు సిబ్బంది భక్తులను క్యూలైన్‌లో పంపేందుకు సహకరించారు.
కంభం : కంభం వేంకటేశ్వరస్వామి దేవాలయంలో భక్తులు శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు బారులు తీరారు. తెల్లవారుజామున 3.40 గంటల నుంచి ఆలయ ద్వారాలు తెరువగా భక్తులు సుమారు కిలోమీటరు క్యూలో వేచియుండి దర్శించుకున్నారు. ఆలయ పరిసరసరాలు గోవింద నామస్మరణలతో మారుమోగాయి. భక్తులకు కమిటీ వారు అల్పాహారం, భోజనం సదుపాయాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం స్వామి వారి గ్రామోత్సవం నిర్వహించారు.
పెద్దారవీడు : ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకను శుక్రవారం మండలంలోని వైష్ణవ దేవాలయాలలో ఘనంగా నిర్వహించారు. రాజంపల్లి గొడ్రాలికొండ తిరుమలనాథస్వామి దేవాలయంలో శ్రీదేవీ భూదేవీ సమేత తిరుమలనాథస్వామిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు భవానీ ప్రసాద్ దేవేరులతో కూడిన స్వామివారి ఉత్సవ విగ్రహాలను తెల్లవారుజామున ఉత్తర ద్వారాన ప్రతిష్ఠించారు. సూర్యోదయ అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
ఎర్రగొండపాలెం రూరల్ : ముక్కోటి ఏకాదశి సందర్భంగా మిల్లంపల్లి వేణుగోపాలస్వామి దేవాలయం శ్రీదేవి భూదేవి సమేత కొప్పుకొండ వెంకటేశ్వరస్వామి దేవాలయం, వెంకటాద్రిపాలెం లక్ష్మీచెన్నకేశవస్వామి దేవాలయాలకు భక్తులు బారులుతీరారు. ఆయా దేవాలయాల్లో గణపతి పూజ, పుణ్యహవనము, నవగ్రహ మండపారాధనతో పాటు 108 మంది దంపతులతో శ్రీలక్ష్మి అమ్మవారికి విశేష కుంకుమ పూజలు నిర్వహించారు. రాత్రి 7 కిలోల కర్పూర జ్యోతి వెలిగించారు. ఆయా దేవాలయాల కమిటి ఆధ్వర్యంలో భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
త్రిపురాంతకం : వైకుంఠ ఏకాదశి పూజలను మండలంలోని అన్ని వైష్ణవాలయాలలో భక్తులు శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈసందర్భంగా మండల కేంద్రంలోని ఎన్నెస్పీ కాలనీలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఉదయం నుంచే భక్తులు పాల్గొని ఉత్తర ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించి స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు రామశ్రీనివాసరావు స్వామివారిని ప్రత్యేకంగా అంకరించారు. గ్రామంలోని కోదండరామస్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం అనంతరం స్వామివారికి పూజలు నిర్వహించారు. పాతరామాలయం వద్ద సీతారామస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా వాసవీ భజన బృందం భక్తులు నగర సంకీర్తన చేశారు.
గిద్దలూరు : ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ప్రజలు భక్తిశ్రద్దలతో నిర్వహించారు. శుక్రవారం తెల్లవారు జాము నుంచే భక్తులరాకతో ఆలయాలు కిటకిట లాడాయి. శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అనంతరం ఉత్తర ద్వారం ద్వారా భక్తుల దర్శనానికి అనుమతించారు. దేవస్థాన కమిటీ అధ్యక్షులు వాడకట్టు సత్యనారాయణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. షరాఫ్ బజారులోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో స్వామి వారు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. కమిటీ అధ్యక్షులు గంజి వీరయ్య, కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్ పెద్దన్న, తదితరులు పూజల్లో పాల్గొన్నారు. వరసిద్ది వినాయకస్వామి, షిర్డి సాయిబాబా, అభయాం జనేయస్వామి, రాచర్ల రోడ్డులోని వేంకటేశ్వరస్వామి పలు ఆలయాలలో, గ్రామీణ ప్రాంతాలలోని ఆల యాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు.
పొదిలి : వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్ష్మీపద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి దేవాలయం, శ్రీవేణుగోపాలస్వామి దేవాలయం, శ్రీఆంజనేయస్వామి దేవాలయాల వద్ద స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. శీలక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి దేవాలయంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చకస్వాములు ప్రత్యేక పూజలు చేశారు. ఉభయదాత వరికుంట్ల అనీల్ స్వామివారిని పలురకాల స్వీట్‌లు, కాయలు, పూలు, పులిహోరతో స్వామివారి ఆకారాన్ని ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. అదే విధంగా అమ్మవారిశాల సమీపంలో వెలసిన శ్రీవేణుగోపాలస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని గ్రామంలో ఊరేంగించి భక్తులకు దర్శనం కల్పించారు.
తర్లుపాడు: తర్లుపాడులో వెలసిన శ్రీరుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలంయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహిం చారు. ఆలయ ప్రధాన అర్చకులు కారంపూడి వెంకట రమణాచార్యులు, పవన్‌కుమార్ శర్మ ఆధ్వర్యంలో స్వామి వారికి వివిధ రకాల అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారు జామున 4 గంటల నుంచి భక్తులు బారులు తీరి 7 గంటల వరకు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిం చారు. అనంతరం స్వామివారిని గరుడ వాహనంపై తర్లుపాడు పురవీధుల్లో అంగరంగ వైభవంగా గ్రామో త్సవం నిర్వహించారు. భక్తులు వార్లుపోసి కాయా కర్పూరాలు సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త జవ్వాజి విజయ భాస్కర్‌రావు, కార్యనిర్వాహాణాధికారి ఈదుల చెన్నకేశవరెడ్డి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Updated Date - Jan 10 , 2025 | 11:23 PM