వస్త్ర వ్యాపారానికి కేరాఫ్ చీరాల
ABN, Publish Date - Jan 02 , 2025 | 11:12 PM
చీరాల వస్త్ర వ్యాపారానికి ప్రసిద్ధి. చీరాలను చినముంబయి అని కూడా పిలుస్తారు. క్షీరపురి అని కూడా వాడుకలో ఉంది. చీరాల మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ (ఎంజీసీ మార్కెట్‌గా) ప్రసిద్ధి. పలు జిల్లాల నుంచి ఇక్కడకు వస్త్రాల కొనుగోలుకు వస్తుంటారు. సాధారణ వ్యక్తులతో పాటు రిటైల్ విక్రయాలు జరిపే వారు ఇక్కడ హోల్‌సేల్‌గా కొంటారు.
చిన ముంబయిగా పేరు
సంక్రాంతి పండుగ వేళ వ్యాపారాలపై ప్రత్యేక దృష్టి
సంవత్సరానికి రూ.1000 కోట్ల టర్నోవర్
వెయ్యి మందికి పైగా ఉపాధి
దేశంలోనే రెండో అతిపెద్ద వస్త్ర సముదాయం
చీరాల, జనవరి 2 (ఆంధ్రజ్యోతి) : చీరాల వస్త్ర వ్యాపారానికి ప్రసిద్ధి. చీరాలను చినముంబయి అని కూడా పిలుస్తారు. క్షీరపురి అని కూడా వాడుకలో ఉంది. చీరాల మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ (ఎంజీసీ మార్కెట్‌గా) ప్రసిద్ధి. పలు జిల్లాల నుంచి ఇక్కడకు వస్త్రాల కొనుగోలుకు వస్తుంటారు. సాధారణ వ్యక్తులతో పాటు రిటైల్ విక్రయాలు జరిపే వారు ఇక్కడ హోల్‌సేల్‌గా కొంటారు. సంవత్సరానికి రూ.1000 కోట్ల టర్నోవర్ ఉంటుంది. దుకాణ యజమానులు కాకుండా వెయ్యి మందికి పైగా గుమస్తాలు ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం సంక్రాంతి విక్రయాలపై దుకాణదారులు ప్రత్యేక దృష్టి సారించారు.
నిర్మాణం ఎప్పుడు జరిగింది.. ఎన్ని దుకాణాలు ఉన్నాయి
మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ కొణిజేటి రోశయ్య సహకారంతో ఎంజీసీ మార్కెట్ పురుడు పోసుకుంది. 1977లో సుమారు 3 ఎకరాల స్థలంలో వస్త్ర దుకాణాల నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. స్థలం, దుకాణ నిర్మాణానికి కలిపి ఒక్కొక్కరికీ రూ.19,100 ఖర్చయింది. తొలుత 320 దుకాణాలను నిర్మించారు. నిర్మాణం అనంతరం 1979 మార్చి 19న అప్పటి గవర్నర్ కేసీ అబ్రహం, కొనిజేటి రోశయ్య చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఆ తరువాత 70 దుకాణాలను నిర్మిచారు. దాదాపుగా అన్ని షాపులకు పై అంతస్తులో మరో షాప్ ఉంటుంది. దీంతో సుమారు 750 దుకాణాలున్నాయి.
అతిపెద్ద వస్త్ర దుకాణ సముదాయం
ఎంజీసీ మార్కెట్ దేశంలోనే అతిపెద్ద వస్త్ర దుకాణ సముదాయం. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో ఉన్న వస్త్ర దుకాణ సముదాయం అతి పెద్దది. తరువాత చీరాల ఎంజీసీ మార్కెట్. వీటితో పాటు ఆర్‌ఆర్ రోడ్డు, కామధేను కాంప్లెక్స్, ఇతర హోల్‌సేల్, రిటైల్ దుకాణాలన్నీ కలిపితే సుమారు 1500 దుకాణాల వరకూ ఉన్నాయి.
ఏడాదికి రూ.1000 కోట్ల టర్నోవర్.. 1000 మంది గుమస్తాలకు ఉపాధి
ఎంజీసీ మార్కెట్‌లో ఉన్న వస్త్ర దుకాణాల్లో ఏడాదికి రూ.1000 కోట్ల టర్నోవర్ జరుగుతుంది. ఇక ఆర్‌ఆర్ రోడ్డు, కామధేను కాంప్లెక్స్, ఇతర హోల్‌సేల్, రిటైల్ దుకాణాల్లో మొత్తంగా చీరాల నియోజకవర్గంలో ఏడాదికి మరో రూ.1000 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఎంజీసీ మార్కెట్‌లో దుకాణ యజమానులు కాకుండా సుమారు వెయ్యి మందికి పైగా గుమస్తాలు ఉపాధి పొందుతున్నారు. ఇతర ప్రాంతాల్లో దుకాణ సముదాయాలను ఏర్పాటు చేసుకునే సమయంలో చీరాల ఎంజీసీ మార్కెట్ బైలాపై అవగాహన కల్పించుకుని, తమ కార్యాచరణ రూపొందించుకుంటుంటారు.
ఎగుమతి.. దిగుమతి
చీరాల వస్త్ర వ్యాపారులు దేశంలో వివిధ ప్రాంతాల్లో వస్త్రోత్పత్తి జరిగే మిల్లుల నుంచి టోకున కొనుగోలు చేస్తారు. అందులో సూరత్, అహ్మదాబాద్, వారణాశి, ఈ-రోడ్డు, బెంగళూరు, సేలం తదితర ప్రాంతాల్లో మిల్లుల నుంచి దిగుమతి చేసుకుంటారు. ఆ సరుకును స్థానికంఆ హోల్ సేల్, రిటైల్‌గా విక్రయిస్తుంటారు.
పండుగలు.. పెళ్లిల సీజన్‌లో భారీగా కొనుగోళ్లు
పెళ్లిల్లు, పండుగల సీజన్‌లో వస్త్ర వ్యాపారాలకు అనుకూలం. దసరా, క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు ప్రధానంగా గిరాకీ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో అయితే సందడే సందడి. కొనుగోలుదారుతో కొట్లు కిటకిటలాడుతాయి.
వ్యాపారం .. ఆధ్యాత్మిక కార్యక్రమాలు
గత 34 సంవత్సరాల నుంచి వినాయక చవితి ఉత్సవాలను ఇక్కడ నిర్వహిస్తున్నారు. మార్కెట్ ప్రఽధాన ముఖద్వారం వద్ద ఉన్న అమ్మవారి ఆలయం వద్ద దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. వ్యాపారంతో పాటు ఆధ్యాత్మికతకు అక్కడ ప్రాధాన్యత ఉంటుంది.
రోశయ్య ఆశీస్సులతోనే నిర్మాణం
- వేముల చంద్రశేఖర్, మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ డెవల్‌పమెంట్ సొసైటీ అధ్యక్షుడు, చీరాల
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఉన్నంత కాలం ఆయన మాకు అండగా ఉన్నారు. ఆయన ప్రోద్భలం, సహకారంతోనే ఈ మార్కెట్ నిర్మాణం జరిగింది. అదే విధంగా హౌసింగ్ కాలనీ, గుమస్తాల కాలనీ నిర్మాణాలకు ఆయన అందించిన సహకారం ఎప్పటికీ మరువలేం. మార్కెట్ కమిటీ నిర్ణయాలకు అనుగుణంగా నడుస్తోంది. క్రమశిక్షణగా ఉంటాం.
వస్త్ర వ్యాపారంలో చీరాలకు ప్రత్యేక గుర్తింపు
- తాతా కుమారస్వామి, సొసైటీ సెక్రటరీ, చీరాల
వస్త్ర వ్యాపారంలో చీరాలకు ప్రత్యేక స్థానం ఉంది. అన్ని వర్గాల ప్రజల అభిరుచుల మేరకు ఇక్కడ దుకాణాల్లో వస్త్రాలు అందుబాటులో ఉంటాయి. ఽవినియోగదారుల అభిరుచి మేరకు మేం కూడా ట్రెండ్‌ను ఫాలో అవుతుంటాం.
ఒక్కో దుకాణం, ఒక్కో వైరైటీలో ప్రత్యేకత
- మేటూరి శేషసాయి, సొసైటీ కార్యవర్గ సభ్యుడు, చీరాల
హ్యాండ్లూమ్, ప్యూర్‌సిల్క్ శారీస్, జెంట్స్ క్లాత్, రెడీమేడ్, జరీ, లుంగీలు, బనియన్లు, పంజాబీ డ్రెస్ మెటీరియల్, దుప్పట్లు, కార్పెట్ మ్యాట్ తదితరాలకు సంబంధించి ఒక్కో దుకాణం ఒక్కో రకానికి ప్రత్యేకంగా గుర్తింపు ఉంటుంది. కొనుగోలుదారుల ఆదరణతో ముందుకు సాగుతున్నాం.
Updated Date - Jan 02 , 2025 | 11:13 PM