ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేయరే?
ABN, Publish Date - Jan 09 , 2025 | 11:27 PM
విద్యుత్ శాఖఅధికారులు, కాంట్రాక్టుర్లు కుమ్మక్కై ఎస్టీ రైతులకు బిగించాల్సిన ట్రాన్సుఫార్మర్లు, సామగ్రిని పక్కదారి పట్టించారు. దీంతో అధికారులు తమ పొట్టకొట్టారని ఎస్టీ రైతులు ఆవేదనతో ఆరోపిస్తున్నారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మంజూరు
12 మంజూరుకాగా, తొమ్మిది మాత్రమే బిగింపు
స్తంభాలు వేసి సామగ్రి మరిచిన అధికారులు
వాటిని అమ్మేసుకున్నారంటున్న రైతులు
నేడు నియోజకవర్గంలో ఆ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన
ఎర్రగొండపాలెం రూరల్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి) : ‘విద్యుత్ శాఖఅధికారులు, కాంట్రాక్టుర్లు కుమ్మక్కై ఎస్టీ రైతులకు బిగించాల్సిన ట్రాన్సుఫార్మర్లు, సామగ్రిని పక్కదారి పట్టించారు. దీంతో అధికారులు తమ పొట్టకొట్టారని ఎస్టీ రైతులు ఆవేదనతో ఆరోపిస్తున్నారు. మండలంలోని చెర్లోతండాలోని ఎస్టీ రైతులు పంటసాగుకు అవసరమైన విద్యుత్ ట్రాన్సుఫార్మర్లు ఏర్పాటు కోసం గత టీడీపీ హయాంలో ఎస్టీ కార్పొరేషన్‌కు దరఖాస్తు పెట్టుకొన్నారు. అప్పటి ఎస్టీ కార్పొరేషన్ విభాగం అధికారులు గ్రామంలో 12 ట్రాన్సుఫార్మర్ల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. ఆ తరువాత ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. 2022 చివరిలో వైసీపీ నాయకులతో కలసి ఎస్టీలు ట్రాన్సుఫార్మర్లు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. గ్రామంలో 9 ట్రాన్సుఫార్మర్లు బిగించినట్లు రైతులు తెలిపారు. వాటిని పూర్తిస్థాయి సామగ్రితో బిగించలేదని అప్పుడే ఆరోపణలున్నాయి. ఇక మిగిలిన 3 ట్రాన్సుఫార్మర్లు బిగించకుండా స్తంభాలు వేసి వదిలేశారు. తమ పొలాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని ఆరేళ్లగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు పాత్లవత్ రాములు నాయక్, పి.బోడే నాయక్, పి. శ్రీనునాయక్, పి. మంత్రునాయక్, పి. వెంకటేశ్వర నాయక్, పి. బాలునాయక్, పి. బాలాజీ నాయక్ కోరుతున్నారు. ట్రాన్సుఫార్మర్ లేకపోవడంతో పొలాలకు విద్యుత్ సరఫరా ఉండడం లేదని మోటార్లతో నీళ్లు పెట్టుకొనే వసతి లేక తమ పొలాలు దెబ్బతింటున్నాయని రైతులు వాపోతున్నారు. దీనిపై ఏఈ అల్లూరయ్యను వివరణ కోరగా స్పందించేందుకు నిరాకరించారు.
ట్రాన్సుఫార్మర్లు అమ్ముకొన్నారని ఆరోపణ
నూరుశాతం రాయితీతో తమకు మంజూరైన ట్రాన్సుఫార్మర్లను విద్యుత్‌శాఖ అధికారులు అమ్ముకొన్నారని పలువురు రైతులు ఆరోపించారు. దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు. ఇక ఎస్టీలకు బిగించిన ట్రాన్స్‌ఫార్మర్లు కూడా పాతవి నాశిరకం ఉన్నవాటిని తెచ్చారని విమర్శించారు. కొత్తవాటిని కూడా అధికారులు అక్రమంగా అమ్ముకున్నారన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. నేడు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో తమ సమస్యపై దృష్టిసారించాలని స్థానికులు కోరుతున్నారు.
Updated Date - Jan 09 , 2025 | 11:27 PM