ముక్కోటికి ఆలయాలు సిద్ధం
ABN, Publish Date - Jan 10 , 2025 | 12:05 AM
ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని మార్కాపురం పట్టణంలోని వైష్ణవ ఆలయాలను సిద్ధం చేశారు.
మార్కాపురం వన్‌టౌన్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని మార్కాపురం పట్టణంలోని వైష్ణవ ఆలయాలను సిద్ధం చేశారు. స్థానిక శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయంలో శుక్రవారం తెల్లవారుజామున 4గంటల నుంచి శ్రీమహావిష్ణువు శ్రీదేవి, భూదేవి సమేతంగా శేషపాన్పుపై ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో గొలమారి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లను పూర్తి చేశారు. పట్టణంలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం, శివాజీనగర్‌లోని ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఉత్తరద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.
గిద్దలూరు : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెల్లవారుజామున 4 గంటల నుంచే వివిధ ఆలయాలకు భక్తులు పోటెత్తనున్నారు. దీంతో పలు దేవాలయాల్లో తగు ఏర్పాట్లను చేస్తున్నారు. పట్టణం లోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో తెల్లవారు జామున 4గంటల నుంచి ప్రత్యేక పూజలు అనంతరం స్వామి వారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునేందు కు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు దేవస్థాన అధ్యక్షులు వాడకట్టు రంగసత్యనారాయణ తెలిపారు. షరాఫ్ బజారుని వెంకటేశ్వరస్వామి దేవాలయంలో కళాశాల రోడ్డులోని షిర్డిసాయిబాబా మందిరం, వరసిద్ది వినాయకస్వామి దేవాలయం, అభయాంజనేయస్వామి దేవాలయం, రాచర్ల రోడ్డులోని వేంకటేశ్వరస్వామి దేవాలయం, పలు ఆలయాలలో స్వామి వారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునేందుకు వీలుగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.
కంభం : కంభం వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 3.40 గంటల నుండి ఉత్తర ద్వారదర్శనం నుంచి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రధాన అర్చకులు ఆంజనేయ శర్మ తెలిపారు. భక్తులు పాల్గొని తీర్ధప్రసాదాలు స్వీకరించాలన్నారు.
ఎర్రగొండపాలెం రూరల్ : ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని శుక్రవారం ఎర్రగొండ పాలెంలోని దేవాలయాలు ముస్తాబవుతున్నాయి. స్థానిక మిల్లంపల్లి వేణగోపాలస్వామి దేవాలయం, శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయాల కమిటి సభ్యుల ఆధ్వర్యంలో ఏకాదశికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఆయా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసేందుకు భక్తులకు ఏటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉదయం నుంచి ఆలయాల్లో పూజలు ఉంటాయన్నారు.
Updated Date - Jan 10 , 2025 | 12:05 AM