Sankranti: కాయ్.. రాజా కాయ్!
ABN, Publish Date - Jan 13 , 2025 | 03:49 AM
తెలుగు లోగిళ్లు సంక్రాంతి సొబగును సంతరించుకున్నాయి. సోమవారం భోగితో ప్రారంభమయ్యే మూడు రోజుల అతి పెద్ద పండుగ అందరినీ మురిపించనుంది.
తెలుగు వారి అతిపెద్ద పండుగ సంక్రాంతి. పిల్లాపాపల సందళ్ల నుంచి యువతుల రంగవల్లుల వరకు సంక్రాంతి శోభ ద్విగుణీకృతం!! అంతేనా.. కోడిపందేలు, పేకాట, గుండాటలతో పందెం రాయుళ్లు చేసే సందడి మరో లెవెల్. వెరసి భోగి నుంచి కనుమ వరకు మూడు రోజుల పాటు పల్లెల్లో ‘కాయ్.. రాజా కాయ్’!!
కోడి పందేలకు బరులు సిద్ధం
పేకాట, గుండాటలు కూడా
కోస్తా పల్లెల్లో సంక్రాంతి కోలాహలం
పల్లెలు దాటి పట్టణాలకు పందేలు
విజయవాడ నగరానికి చేరిన సంస్కృతి
గెలిచిన వారికి భారీ కానుకలు కూడా
బుల్లెట్లు, జీపుల వంటి వాహనాలు
తెలంగాణ సహా పలు రాష్ట్రాల నుంచి
నోట్ల కట్టలతో పందెంరాయుళ్లు సై
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
తెలుగు లోగిళ్లు సంక్రాంతి సొబగును సంతరించుకున్నాయి. సోమవారం భోగితో ప్రారంభమయ్యే మూడు రోజుల అతి పెద్ద పండుగ అందరినీ మురిపించనుంది. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెట్టపీట వేస్తూ పల్లెల్లో సంక్రాంతి సంబరాలు మిన్నంటనున్నాయి. ఇదే సమయంలో సంక్రాంతి సంబరాల్లో భాగమైన కోడి పందేలు కూడా భారీ ఎత్తున జరగనున్నాయి. వీటితోపాటు గుండాట, లోన బయట, పేకాటలు కూడా పందెంరాయుళ్లను ఖుషీ చేయనున్నాయి. మందు-విందు-చిందు వంటి ప్రత్యేక ఏర్పాట్లతో కోస్తా సహా పలు జిల్లాల్లో కోడి పందేల బరులు ఈ దఫా భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. చిత్రం ఏంటంటే.. ఈ ‘సంస్కృతి’లో తరతమ భేదాలు కానీ, రాజకీయ విభేదాలు కానీ లేకుండా అందరూ చేతులు కలపడమే!!
ఉమ్మడి కృష్ణాలో..
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని అంపాపురం బరిని రూ.3 కోట్లకు ఓ పార్టీ నాయకులు కొనుగోలు చేశారు. ఈ మొత్తాన్ని రాబట్టుకునేందుకు ఇక్కడ కోడిపందేలతో పాటు పేకాట, గుండాట, కోత ముక్కాట, లోనబయట నిర్వహణకు రంగం సిద్ధం చేశారు. మద్యం విక్రయాలకు ప్రత్యేకంగా స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ జిల్లాలోని అంబాపురం, జక్కంపూడిలోని పాములకాల్వ ప్రాంతాల్లో బరులను ఏర్పాటు చేయడానికి ఇద్దరు ప్రజాప్రతినిధుల అనుచరులు సిద్ధమయ్యారు. తెలంగాణకు సరిహద్దు గ్రామాలుగా ఉన్న గరికిపాడు, బూదవాడ, తొర్రగుంటపాలెం, తిరుమలగిరి, జగ్గయ్యపేటలో బరులు సిద్ధం చేశారు. పెనుగంచిప్రోలు, కంచికచర్లలో హైటెక్ జూదం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. విజయవాడ నడిబొడ్డున ఉండే రామవరప్పాడులో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నివాసం ఉండే ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీ చెంతనే ఓ ప్రజాప్రతినిధి అనుచరులు కోడిపందేల బరులు ఏర్పాటు చేశారు. విజయవాడలోని పటమటలంకలో భోగి నుంచి కనుమ వరకు పందేలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతి పండుగ వేళ బాపట్ల జిల్లాలో ఏర్పాటు చేసిన బరుల్లో కోళ్లు కాళ్లు దువ్వుతున్నాయి. మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా పేకాట నిర్వహిస్తున్నారు. కోడి పందేలు ఒక రోజు ముందే అంటే ఆదివారమే ప్రారంభమయ్యాయి. ఇక, పేకాట మాత్రం గడచిన రెండు రోజుల నుంచి రేపల్లె, వేమూరు, బాపట్ల నియోజకవర్గాల పరిధిలో జోరుగా సాగుతోంది. రేపల్లె శివారులోని ఉప్పూడి పరిధిలో రాత్రి 7 గంటల నుంచి మొదలై తెల్లవారే వరకు పేకాట కొనసాగుతోంది.
లాడ్జిలన్నీ ఫుల్..
తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన పందెం రాయుళ్లు బాపట్లలో తిష్ట వేశారు. రెండు రోజుల క్రితమే తీర ప్రాంత గ్రామాలకు వచ్చిన వాళ్లు కొంతమంది గుంటూరులోని లాడ్జిల్లో, మరికొంత మంది రేపల్లెలో బస చేశారు. ఒక్కో ఆటకు 5 లక్షల నుంచి పది లక్షల వరకు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది.
పశ్చిమలో జోష్
పశ్చిమగోదావరిలో సంక్రాంతి జోష్ అంబరాన్ని తాకుతోంది. ఎన్నడూ లేనివిధంగా ఈసారి పల్లెలకు కుటుంబ సమేతంగా ఇతర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు విచ్చేశారు. సంక్రాంతి అంటే పశ్చిమలో సంప్రదాయ కోడి పందేలకు నెలవు. నేతలతో సహా సామాన్య ప్రజల వరకు పందేల కోసం తహతహలాడుతుంటారు. భీమవరం మండలం డేగానగర్, పెదఅమిరం, సీసలి గ్రామాల్లో పెద్ద బరులు ఏర్పాటు చేశారు. బుల్లితెర నటులు పశ్చిమబాట పడుతున్నారు. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే దా దాపు 300కి పైగా బ రులు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని హోటళ్లు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ వాసులతో నిండిపోయాయి. వసతుల కోసం ఎన్నడూ లేని డి మాండ్ ఏర్పడింది.
హెచ్చరికలు ‘కామన్’
ఒకవైపు పందెం రాయుళ్లు కోడిపందేలు, పేకాట, గుండాట వంటి వాటిలో బిజీగా ఉంటే.. పోలీసులు మాత్రం హెచ్చరికలు చేస్తున్నారు. కోడి పందేలు, పేకాట, గుండాటలు జరిపితే చర్యలు తప్పవని అన్ని జిల్లాల అధికారులు చెబుతున్నారు. కానీ, పందెం రాయుళ్లు ఈ హెచ్చరికలను తేలికగా తీసుకోవడం గమనార్హం.
విలువైన కానుకలు
కోడి పందేల బరుల వద్ద ఎన్‌ఫీల్డ్ వాహనాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. బాపట్ల జిల్లా కొల్లూరు, జంపని కోడి పందాల బరుల వద్ద నిర్వాహకులు ప్రతిపాదించిన పందేలు నెగ్గిన వారికి ఎన్‌ఫీల్డ్ ద్విచక్ర వాహనాలు బహుమతులుగా ఇవ్వనున్నారు. గత ఏడాది కొల్లూరు మండలం పెసర్లంక వద్ద ఏర్పాటు చేసిన కోడి పందాల బరిలో రెండు ఎన్‌ఫీల్డ్ వాహనాలను నిర్వాహకులు.. ఒక్కొక్క కోడి పుంజు ఐదు పందాలు గెలిచిన వారికి బహుమతిగా అందజేశారు.
Updated Date - Jan 13 , 2025 | 03:49 AM