Tourism: ‘మెండు’గా.. పర్యాటకం
ABN, Publish Date - Feb 09 , 2025 | 11:55 PM
Creation of city forest పర్యాటకాభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పట్టణాలు, నగరాలకు సమీపాన ఉన్న అటవీ ప్రాంతాల్లో నగర వనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాకు సంబంధించి పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధి కోసంగిపురం జంక్షన్ సమీపంలో 125 ఎకరాల్లో ‘మెండు నగర వనం’ ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది.

కాశీబుగ్గ సమీపాన నగర వనం ఏర్పాటు
125 ఎకరాల అటవీ భూమిలో నిర్మాణాలు
శరవేగంగా సాగుతున్న పనులు
పర్యాటకులకు శుభవార్త. పలాస-కాశీబుగ్గ జంట పట్టణాలకు కూతవేటు దూరంలో జాతీయ రహదారి చెంతనే ‘మెండు నగర వనం’ అందుబాటులోకి రానుంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ సేదదీరేలా అత్యాధునిక నిర్మాణాలతో దీనిని ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకోసం రూ.2కోట్ల నిధులు విడుదల చేసింది. ఇప్పటివరకూ ఇటువంటి నిర్మాణాలు పర్యాటక శాఖ ద్వారా జరిగేవి. కానీ తొలిసారిగా అటవీ శాఖ ఈ నగర వనం నిర్మాణానికి పూనుకోవడం గమనార్హం.
కాశీబుగ్గ, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): పర్యాటకాభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పట్టణాలు, నగరాలకు సమీపాన ఉన్న అటవీ ప్రాంతాల్లో నగర వనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాకు సంబంధించి పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధి కోసంగిపురం జంక్షన్ సమీపంలో 125 ఎకరాల్లో ‘మెండు నగర వనం’ ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. జాతీయ రహదారి చెంతనే ఈ ప్రాంతంలో 650 ఎకరాల విస్తీర్ణంలో మెండు ఫారెస్టు ఏరియా విస్తరించి ఉంది. పలాస, మందస, మెళియాపుట్టి మండలాల వరకూ అంతటా అటవీ ప్రాంతమే. అరుదైన జంతువులు, పక్షులు, ఇతర మూగజీవాలు ఇక్కడ నివసిస్తుంటాయి. జీడి చెట్లు అధికంగా ఉన్నాయి. ఎంతో ఆహ్లాదంగా ఉన్న ఈ ప్రాంతంలో అటవీశాఖ ఆధ్వర్యంలో నగర వనం నిర్మించేందుకు ప్రభుత్వం రూ.2కోట్ల నిధులు మంజూరు చేసింది. అడవుల సంరక్షణ, వర్షపునీటి పరిరక్షణ ధ్యేయంగా ఈ నగరవనాన్ని నిర్మిస్తోంది. ఇక్కడ అటవీ శాఖ కార్యకలాపాల ద్వారా మెండు అటవీ ప్రాంతాన్ని రక్షించవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. మరోవైపు అటవీ ఉత్పత్తుల క్రయ విక్రయాలు కూడా ఇక్కడ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా చిల్డ్రన్స్ పార్కు, అడ్వంచర్ పార్కులు అందుబాటులోకి రానున్నాయి. ట్రేకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నారు. చెరువులు, స్విమ్మింగ్ ఫూల్స్, ట్యాంకులు సైతం నిర్మిస్తున్నారు. అన్ని వంటకాలను అందించే రెస్టారెంట్, యోగా సెంటర్, పర్ణశాల ఏర్పాటు చేస్తున్నారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు వీలుగా భారీ జంతువుల బొమ్మలు సిద్ధం చేస్తున్నారు. అటవీ శాఖ పర్యవేక్షణ ఉండేలా అడ్మినిస్ర్టేషన్ కార్యాలయాన్ని సైతం అందుబాటులోకి తెస్తున్నారు.
ఆహ్లాదం పంచే ప్రాంతం..
పలాస-కాశీబుగ్గ జంట పట్టణాలకు 5 కిలోమీటర్ల దూరంలో.. జాతీయ రహదారి పక్కనే కాశీబుగ్గ మెండు నగర వనం ఉంది. చుట్టూ పచ్చని చెట్లు, మధ్యలో రైల్వేట్రాక్, పక్కనే పచ్చిక బయళ్లతో పొలాలు ఉంటాయి. మనసుకు ఆహ్లాదనిచ్చే వాతావరణం ఉన్నచోట.. అత్యాధునిక వసతులతో నగర వనం నిర్మిస్తుండడం శుభ పరిణామం. ఈ నగర వనం జిల్లాలోనే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. పలాసతోపాటు ఇచ్ఛాపురం, పాతపట్నం, టెక్కలి నియోజకవర్గాల ప్రజలకు సైతం ఈ పర్యాటక ప్రాంతం అందుబాటులో ఉంటుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
సిటీ ఫారెస్ట్‌గా తీర్చిదిద్దుతాం: జిల్లా అటవీశాఖ అధికారి
జిల్లాలో ఈ ఏడాది రూ.2.5 కోట్ల నిధులతో వృక్ష సంపద అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జిల్లా అటవీశాఖ అధికారి శంబంగి వెంకటేష్ తెలిపారు. వన్యప్రాణులతోపాటు వృక్ష సంపద రక్షణకు కృషి చేస్తున్నామన్నారు. ‘జిల్లాలో ప్రస్తుతం 18శాతం వృక్ష సంపద ఉంది. దీనిని మరింత పెంచేందుకు కాశీబుగ్గలో మెండు నగర వనాన్ని రూ.1.4కోట్లతో సిటీ ఫారెస్ట్‌గా తీర్చిదిద్దనున్నాం. నర్సరీల అభివృద్ధికి చర్యలు చేపట్టాం. ఉపాధిహామీ పథకం కింద జిల్లాలో ఈ ఏడాది జూన్ నాటికి 21 లక్షల మొక్కలు నాటనున్నాం. సముద్ర తీర ప్రాంతంలో వృక్ష సంపదను పెంచేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. వన్యప్రాణుల సంరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం. తీరప్రాంత ప్రజలతో ప్రతీ నెల అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. తీర ప్రాంతాల్లో మరబోటు వలలకు చిక్కి తాబేళ్లు మరణిస్తున్నాయి. వాటి సంరక్షణ కోసం 40 మంది మత్స్యకారులకు శిక్షణ కల్పించాం. తాబేళ్లు గుడ్లు పెట్టే కాలంలో వాటి రక్షణ కోసం ఐదు నెలల పాటు వారికి వేతనాలు కూడా చెల్లిస్తున్నాం. దీని కోసం రూ.25లక్షల నిధులు కేటాయిస్తున్నాం. ఇటీవల జిల్లాలో పులి సంచారం వాస్తవమే. ఒక చిరుత ఒడిశా- విజయనగరం- శ్రీకాకుళం అటవీ ప్రాంతంలో చాలాకాలంగా సంచరిస్తోంది. ప్రస్తుతం ఒడిశా వైపు వెళ్లిపోయింది. పులి సంచారంపై నిఘా పెట్టాం. అటవీ ప్రాంతంలో జీడి తోటలకు సమీపంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అని డీఎఫ్‌వో వెంకటేష్ సూచించారు.
చురుగ్గా నిర్మాణాలు..
కాశీబుగ్గ నగర వనంలో చురుగ్గా పనులు సాగుతున్నాయి. ప్రభుత్వం రూ.2 కోట్లు నిధులు మంజూరు చేసింది. తొలివిడతగా రూ.1.60 కోట్లు విడుదల చేసింది. మిగతా నిధులతో సైతం అన్ని హంగులు కల్పిస్తాం. కొద్ది నెలల్లో ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకుంటున్నాం.
- ఎ.మురళీకృష్ణ నాయుడు, అటవీశాఖ అధికారి, పలాస
Updated Date - Feb 09 , 2025 | 11:55 PM