రోడ్ల అనుసంధానంతో గ్రామాల అభివృద్ధి

ABN, Publish Date - Apr 07 , 2025 | 11:31 PM

గ్రామాల అభివృద్ధికి రోడ్లు దోహదపడతాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు.

రోడ్ల అనుసంధానంతో గ్రామాల అభివృద్ధి

నరసన్నపేట/పోలాకి, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధికి రోడ్లు దోహదపడతాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని నరసన్నపేట, పోలాకి మండలాల్లో పలు రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. బొడ్డవానిపేట వద్ద కిళ్లాo కాలువపై వంతెన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఉప్పరిపేట, ముసుడుగట్టు మీదుగా లుకలాం వరకు బీటీ రోడ్డును ప్రారంభించారు. పోలాకి మండలం జొన్నాం, డోల గ్రామాలకు, చెల్లాయివలస కూడలి నుంచి దేశవానిపేటకు బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సంద ర్భంగా ఆయా గ్రామాల్లో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలో రాక ముందు గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా ఉండేవని, అభివృద్ధి లేక తలసరి ఆదాయం తగ్గి పోయిందన్నారు. ఎన్డీఏ సర్కారు వచ్చిన ఆరునెలల్లో అభివృద్ధికి బాటలు వేసిం దన్నారు. నదీ తీర గ్రామాల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పిస్తా మన్నారు. భావనపాడు, పలాస వద్ద విమానాశ్రయాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, దీనివల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా రూ.పది వేల కోట్లు వెచ్చించామన్నారు. చెల్లాయివలస పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతామన్నారు. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ నదీ తీర గ్రామాలకు రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నా మన్నారు. తాగు, సాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
నరసన్నపేటలో స్టేడియం నిర్మాణం పూర్తి చేయాలని పట్టణవాసులు కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. సోమవారం స్థానిక ప్రజాసదన్‌లో ఆయన వినతులను స్వీకరించారు. జమ్ము పంచాయతీ పొన్నానపేట గ్రామానికి రోడ్డు సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫోన్‌లో కేంద్ర మంత్రి సూచించారు. కార్యక్రమంలో కాళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ రోణంకి కృష్ణంనాయుడు, నరసన్నపేట మార్కెట్‌కమిటీ చైర్‌పర్సన్‌ పాగోటి ఉమాకుమారి, టీడీపీ నేతలు శిమ్మ చంద్రశేఖర్‌, జల్లు చంద్రమౌళి, సాసుపల్లి కృష్ణబాబు, గొద్దు చిట్టిబాబు, సరియపల్లి మధు, బోయన సతీష్‌, బలగ ప్రహర్ష, బోయన ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2025 | 11:31 PM