AMC chairmen:ఏఎంసీ చైర్మన్ల రిజర్వేషన్లకు కసరత్తు
ABN, Publish Date - Jan 01 , 2025 | 11:42 PM
AMC chairmen:మార్కెట్ కమిటీల చైర్మన్ల నియామకానికి సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
- ఎమ్మెల్యేల చుట్టూ ఆశావహుల ప్రదక్షిణ
నరసన్నపేట, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): మార్కెట్ కమిటీల చైర్మన్ల నియామకానికి సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో ఇప్పటి నుంచే ఆశావహులు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లాలో శ్రీకాకుళం, నరసన్నపేట, కోటబొమ్మాళి, ఆమదాలవలస, పొందూరు, జలుమూరు, ఇచ్ఛాపురం, కంచిలి, పలాస, ఎచ్చెర్ల, పాతపట్నం, హిరమండలం మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటిలో ఆరు మార్కెట్ కమిటీలు జనరల్ అభ్యర్థులకు కేటాయిస్తారు.
జనరల్‌లో మూడు మహిళలకు కేటాయించనున్నారు. మిగతా ఆరు కమిటీల్లో మూడు బీసీలకు, రెండు ఎస్సీలకు, ఒకటి ఎస్టీకి కేటాయించే అవకాశం ఉంది. రిజర్వేషన్ ఉన్న ఆరు కమిటీల్లో మూడు మహిళలకు కేటాయిస్తారు. వీటిలో రెండు బీసీ మహిళలకు, మరోకటి ఎస్సీ లేదా ఎస్టీ మహిళకు కేటాయించే అవకాశం ఉంది. ఒక్కొక్క కమిటీలో 12 మంది రైతులు, ముగ్గురు ట్రేడర్స్‌ను తీసుకోనున్నారు. 12 మంది రైతుల్లో ఐదుగురు చిన్నకారు, ఐదుగురు పాడి రైతులతో పాటు భూమి ఎక్కువగా మరో ఇద్దరు రైతులను డైరెక్టర్లుగా తీసుకుంటారు.
ఇప్పటికే మార్కెట్ కమిటీల చైర్మన్లు, డైరెక్టర్లకు సంబంధించి జాబితాను తయారు చేయాలని ఎమ్మెల్యేలకు ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. దీంతో ఆశావహులు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. నేడో, రేపో రిజరేషన్లు ఖరారుకానున్నాయి. సంక్రాంతి నాటికి మార్కెట్ చైర్మన్ల నియా మకం పూర్తిచేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Updated Date - Jan 01 , 2025 | 11:42 PM