Narayanapuram: ‘నారాయణా’.. నీటి కష్టాలు తీరేనా?
ABN, Publish Date - Feb 09 , 2025 | 11:52 PM
Water Issues నారాయణపురం ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో ఆయకట్టు రైతులకు ఏటా సాగునీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. గతేడాది ఖరీఫ్ సీజన్‌లో కూడా ఎచ్చెర్ల నియోజకవర్గంలో శివారు ప్రాంత రైతులకు సాగునీరు అందక ఇబ్బందులు ఎదురయ్యాయి.

పూర్తికాని ఆధునికీకరణ పనులు
గత ఐదేళ్లు పట్టించుకోని వైసీపీ
రైతులకు తప్పని ఇబ్బందులు
కూటమి ప్రభుత్వంపైనే ఆశలు
ఎచ్చెర్ల, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): నారాయణపురం ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో ఆయకట్టు రైతులకు ఏటా సాగునీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. గతేడాది ఖరీఫ్ సీజన్‌లో కూడా ఎచ్చెర్ల నియోజకవర్గంలో శివారు ప్రాంత రైతులకు సాగునీరు అందక ఇబ్బందులు ఎదురయ్యాయి. 2019లో టీడీపీ ప్రభుత్వ హయాంలో నారాయణపురం కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణకు రూ.112 కోట్లు జైకా నిధుల విడుదలకు ఒప్పందం కుదిరింది. టెండర్లు కూడా ఖరారయ్యాయి. ఇందులో కుడి కాలువకు సుమారు రూ.38.7కోట్లు కేటాయించారు. ఇంతలో సార్వత్రిక ఎన్నికలు సమీపించి.. వైసీపీ అధికారంలోకి రావడంతో పనుల్లో జాప్యమైంది. తొలుత కొవిడ్, ఆ తర్వాత నిధుల కొరత కారణంగా ఆధునికీకరణ పనులు అంతంతమాత్రమే జరిగాయి. గత ఐదేళ్లూ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పనులు పూర్తికాలేదు. ఇప్పటికే రెండుసార్లు పనులు పూర్తికి చేసుకున్న అగ్రిమెంట్లకు కాలం చెల్లింది.
నారాయణపురం ఆనకట్ట కింద కుడి, ఎడమ కాలువలు ఉన్నాయి. కుడి కాలువ కింద సంతకవిటి, పొందూరు, ఎచ్చెర్ల మండలాల పరిధిలో సుమారు 50.6 ఎకరాల పొడవునా కాలువ ఉంది. ఈ కాలువ పరిధిలో సుమారు 40శాతం వరకు మాత్రమే పనులు జరిగాయి. పనులు ప్రారంభించేందుకు అధికారులు కార్యచరణ సిద్ధం చేశారు. ఆధునికీకరణ పనుల్లో భాగంగా తోలాపి నుంచి శివారు ఆయకట్ట వరకు సుమారు 23 కిలోమీటర్లు కాలువ లైనింగ్ చేయాల్సి ఉంది. ఫరీద్‌పేట నుంచి భగీరథపురం కృష్ణసాగరం వరకు ఎర్త్‌వర్క్, గట్టు బలపర్చడం, జంగిల్ క్లియరెన్స్ చేపట్టాల్సి ఉంది. అలాగే ఆమదాలవలస, శ్రీకాకుళం రూరల్, బూర్జ, గార మండలాల పరిధిలో ఎడమ కాలువ వ్యాపించి ఉంది. ఈ కాలువ పనులు కూడా సక్రమంగా సాగని పరిస్థితి నెలకొంది.
శిథిలావస్థలో షట్టర్లు, వంతెనలు
నారాయణపురం ఆనకట్ట ఏర్పాటు చేసిన సమయంలో కుడి కాలువ పొడవునా బిగించిన సుమారు 60 షట్టర్లు పాడయ్యాయి. షట్టర్లు లేకపోవడంతో సాగునీరు వృథాగా పోతోంది. అలాగే వాసుదేవపట్నం, చిన్నయ్యపేట, బూరాడపేట, మంతిన, గోకర్ణపల్లి, దుప్పలవలస సమీపంలోని బ్రిడ్జిలు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎచ్చెర్ల మండలం దుప్పలవలస బ్రిడ్జి పరిస్థితి మరింత దారుణంగా ఉండడంతో దీనిపై రాకపోకలు సాగించేందుకు ప్రజలు హడలి పోతున్నారు. ఆధునికీకరణ పనుల్లో భాగంగా బ్రిడ్జిలను నిర్మించాల్సి ఉంది. అలాగే మాల కుశాలపురం, పెయ్యలవానిపేట, పొందూరు మండలం కింతలి పరిధిలోని దోమగుండం చెరువు వద్ద పూర్తిగా పాడైన రెగ్యులేటర్స్‌ను మార్చాలి. దోమగుండం చెరువు వద్ద పాడైన మదుమును పునర్నిర్మించకపోతే నీరు వృథా అయ్యే అవకాశం ఉంది.
తప్పని కష్టాలు
నారాయణపురం కుడి కాలువ కింద శివారున ఎచ్చెర్ల మండలంలోని తోటపాలెం, కొత్తపేట, ముద్దాడ, ధర్మవరం, పొన్నాడ, బొంతలకోడూరు, భగీరథపురం తదితర గ్రామాల పరిధిలోని ఆయకట్టుకు ఏటా అతికష్టమ్మీద సాగునీరు సరఫరా చేస్తున్నారు. మొక్కుబడిగానే పనులు చేస్తుండడంతో ఏటా అన్నదాతలు సాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. గత ఖరీఫ్ సీజన్‌లో స్థానిక ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ప్రత్యేక చొరవతో నవభారత్ జంక్షన్ నుంచి దుప్పలవలస వరకు కాలువలో పూడికలు, జంగిల్ క్లియరెన్స్ చేయించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం స్పందించి ఆధునికీకరణ పనులు పూర్తిచేయాలని, సాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
ఆధునికీకరణ పూర్తయితేనే..
ఏటా శివారు గ్రామాల రైతులకు సాగునీటికి ఇబ్బంది తప్పడంలేదు. ఆధునికీకరణ పనులు పూర్తయితే తప్ప శివారు గ్రామాలకు పూర్తిస్థాయిలో సాగునీరందే పరిస్థితి లేదు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఆధునికీకరణ పనులకు నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఈ పనులు పూర్తవుతాయనే నమ్మకం ఉంది.
- పంచిరెడ్డి కృష్ణారావు, నారాయణపురం ప్రాజెక్ట్ కమిటీ ఉపాధ్యక్షుడు
పనుల ప్రారంభానికి చర్యలు
నారాయణపురం ఆధునికీకరణ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. ఉన్నతాధికారులు కూడా ఈ అంశంపై చర్చిస్తున్నారు. నిర్ధేశించిన గడువులోగా పనుల పూర్తికి ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తాం.
- కె.రాంబాబు, ఏఈఈ, జలవనరుల శాఖ
Updated Date - Feb 09 , 2025 | 11:52 PM