Sand: మా ఇసుక.. మా ఇష్టం
ABN, Publish Date - Jan 13 , 2025 | 12:10 AM
local resources జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. తమ ప్రాంతంలో ఇసుక.. తమ ఇష్టం అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలోకి తొక్కి ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నారు.
బరితెగిస్తున్న అక్రమార్కులు
జిల్లాలో అక్రమంగా ఇసుక తవ్వకాలు
రాత్రుళ్లు ట్రాక్టర్లలో తరలించి తోటల్లో నిల్వ
ఉదయం లారీల్లో ఇతర ప్రాంతాలకు రవాణా
అధికారపార్టీ నేతల అనుచరులే దందా
పట్టించుకోని అధికారులు
‘ఆ ఇసుకా మాదే.. ఆ కుప్పలూ మావే’.. అంటూ ఇసుకాసురులు బరి తెగిస్తున్నారు. జిల్లాలోని వంశధార, నాగావళి నదుల్లో ఇసుక ర్యాంపులను ప్రభుత్వం గుర్తించింది. కొన్నిచోట్ల ర్యాంపులకు అనుమతులిచ్చి.. నిబంధనలు విధించింది. కానీ ‘మా ఇసుక.. మా ప్రాంతం.. మేమే నాయకులం.. మాకు మాత్రమే హక్కు ఉంది’ అంటూ అధికారపార్టీకి చెందిన బడా, చోటా నేతలు, వారి అనుచరులు పెత్తనం చెలాయిస్తూ ఇసుక అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. విశాఖపట్నానికి లారీల్లో ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కలెక్టర్ హెచ్చరికలను సైతం బేఖాతరు చేస్తున్నారు.
శ్రీకాకుళం, జనవరి 12(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. తమ ప్రాంతంలో ఇసుక.. తమ ఇష్టం అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలోకి తొక్కి ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నారు. అధికారిక ర్యాంపుల్లో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే తవ్వకాలు చేపట్టాలనే నిబంధన ఉంది. కానీ, రాత్రిళ్లు యంత్రాలతో వచ్చి ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టి విశాఖ, ఒడిశా వంటి ప్రాంతాలకు రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. కొత్తూరు, హిరమండలం, ఎచ్చెర్ల, ఆమదాలవలస, సరుబుజ్జిలి మండలాల్లో ఇసుక దందా హెచ్చుమీరింది. ఓ నియోజకవర్గంలో అయితే.. అధికార పార్టీ నేత కూడా అదుపు చేయలేని పరిస్థితి నెలకొంది. మరికొన్ని చోట్ల అధికారపార్టీ నేతల అనుచరులే దర్జాగా ఇసుకను విక్రయిస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. అన్ని రీచ్‌ల్లో చినబాబులు.. పెదబాబుల పేర్లు మార్మోగుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
కొత్తూరు, హిరమండలంలో..
జిల్లాలో అత్యధికంగా ఇసుక నిల్వలు కలిగిన నియోజకవర్గం పాతపట్నం. ఈ నియోజకవర్గంలోని కొత్తూరు, హిరమండలం మండలాల గుండా వంశధార ప్రవహిస్తుంటుంది. ఇది ఇసుకాసురులకు కలిసి వచ్చింది. కొత్తూరు మండలంలోని నివగాం, ఆకులతంపరలో ఇసుక ర్యాంపులను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ రాత్రివేళ తవ్వకాలు నిషేధం. కానీ, ఈ నిబంధన అమలు కావడం లేదు. రాత్రి వేళ ఇసుక తవ్వకాలు చేపట్టి సమీపంలోని ఒడిశా రాష్ట్రం పర్లాఖిమిడి మండలానికి చెందిన పొన్నుటూరు, గారబంద, గోసాని గ్రామాల సరిహద్దులకు ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. అక్కడ భారీగా కుప్పలు వేసి ప్రతిరోజూ అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. అలాగే, హిరమండలంలోని అంబావిల్లి, భగీరథపురంలో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ నుంచి లారీల్లో ఒడిశాకు తరలించి విక్రయిస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పలుమార్లు ఇసుక వాహనాలను పట్టించారు. అయినా అక్రమ తవ్వకాలు మాత్రం ఆగడం లేదు.
నాగావళి నుంచి అడ్డదారిలో..
ఎచ్చెర్ల మండలంలోని తమ్మినాయుడుపేట, పొన్నాడ, బొంతలకోడూరు, తోటపాలెం, ముద్దాడపేట వద్ద నాగావళి నదీ తీరంలో ఇసుక నిల్వలు భారీగా ఉన్నాయి. తమ్మినాయుడుపేట వద్ద రాత్రివేళల్లో తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్లతో మరోచోటకు తరలించి నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి లారీల్లో విశాఖకు తరలించి అమ్ముకుంటున్నారు. అదేవిధంగా పొన్నాడ, బొంతలకోడూరు, తోటపాలెం నుంచి కూడా ఇసుక అక్రమంగా తరలిపోతుంది. ట్రాక్టర్ల ద్వారా అడ్డదారుల్లో రణస్థలం మండలం కోష్ఠ వరకు చేరుస్తున్నారు. అక్కడనుంచి హైవే మీదకు వచ్చి విజయనగరం జిల్లాలోకి వెళ్లిపోతున్నారు. ఇది నిత్యకృత్యమైపోయింది. ఇందులో అధికార పార్టీ అనుచరులతో పాటు వైసీపీకి చెందినవారు కూడా ఉన్నారు.
కలెక్టర్ తనిఖీ చేసినా మారలే..
సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం ర్యాంపు నుంచి రాత్రివేళల్లో ఇసుక తవ్వకాలు చేపట్టి విశాఖపట్నం, తదితర ప్రాంతాలకు తరలించుకుపోతున్నారు. ఇటీవల ఈ ర్యాంపును కలెక్టర్ తనిఖీ చేశారు. ర్యాంపులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఏడు లారీలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, అదేరోజు ఇసుకాసురులు పురుషోత్తపురం ర్యాంపు నుంచి బిల్లులు ట్యాంపరింగ్ చేసి ఎంచక్కా విశాఖకు వాహనాలను తరలించుకుపోయారు. అలాగే ఆమదాలవలస మండలం చవ్వాకులపేట, రావాడపేట, చిట్టివలస, నిమ్మతొర్లాడ, కొత్తవలస, దూసి, తోటాడ ప్రాంతాల్లో కూడా యథేచ్ఛగా ఇసుక దందా సాగుతుంది. సమీప తోటల్లో ఇసుకను నిల్వ చేసి బయటకు విక్రయించుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - Jan 13 , 2025 | 12:10 AM