Road works: రహదారుల పనుల్లో.. నాణ్యత పరిశీలన

ABN, Publish Date - Mar 22 , 2025 | 12:33 AM

road maintenance సీతంపేట ఐటీడీఏ పరిధిలో రహదారి పనుల నాణ్యతను శుక్రవారం క్వాలిటీ కంట్రోల్‌ ఈఈ హరికృష్ణ ఆధ్వర్యంలో అధికారులు పరిశీలించారు.

Road works: రహదారుల పనుల్లో.. నాణ్యత పరిశీలన
మామిడిగుడ్డి రహదారి పనులను పరిశీలిస్తున్న క్వాలిటీ కంట్రోల్‌ అఽధికారి హరికృష్ణ
  • ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

  • మెళియాపుట్టి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ పరిధిలో రహదారి పనుల నాణ్యతను శుక్రవారం క్వాలిటీ కంట్రోల్‌ ఈఈ హరికృష్ణ ఆధ్వర్యంలో అధికారులు పరిశీలించారు. ఐటీడీఏ పరిధిలోని ఓ ఇంజనీరింగ్‌ అధికారి కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తూ.. నాణ్యతలోపంతో పనులు చేపట్టి.. బిల్లులు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపై ఈ నెల 8న ‘ఆంధ్రజ్యోతి’లో ‘ఆ అధికారే కాంట్రాక్టర్‌’ శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. పనుల నిర్వహణపై గిరిజన సంక్షేమశాఖ ఈఎన్‌సీ శ్రీనివాసరావు, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌తోపాటు ఐటీడీఏ పీవో యశ్వంత్‌ కుమార్‌రెడ్డికి కొంతమంది వేర్వేరుగా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రహదారుల పనుల నాణ్యతాప్రమాణాలు పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వాలని క్వాలిటీ కంట్రోల్‌ ఈఈ హరికృష్ణను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు గురు, శుక్రవారం మెళియాపుట్టి మండలంలోని మామిడిగుడ్డి, దీనబందుపురం, రాజపురం, బురదరామచంద్రపురం, ముఖందుపురం రహదారులను పరిశీలించామని క్వాలిటీకంట్రోలు ఈఈ హరికృష్ట తెలిపారు. ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. ఆయనతోపాటు డీఈ సిమ్మన్న, ఏఈ శ్రీకాంత్‌ ఉన్నారు.

  • మెళియాపుట్టి మండలంలో సుమారు రూ.25కోట్లతో ఐటీడీఏ ద్వారా పనులు చేస్తుండగా, ఐటీడీఏ ఇంజనీరింగ్‌ అధికారులు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై కొంతమంది అధికారపార్టీ నాయకులు అధిష్ఠానానికి, సీఎంవోకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఇంజనీరింగ్‌ శాఖలో అలజడి రేగుతోంది. రెండు రోజులుగా క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు కూడా రహదారుల పనులు పరిశీలిస్తుండడంతో ఆ అధికారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది చర్చనీయాంశమవుతోంది.

Updated Date - Mar 22 , 2025 | 12:33 AM