Sports: క్రీడా పరికరాలు వస్తున్నాయ్!
ABN, Publish Date - Jan 11 , 2025 | 12:07 AM
Sports equipment వైసీపీ ప్రభుత్వ హయాంలో క్రీడా రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. గత ఐదేళ్ల పాటు ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడల నిర్వహణను పూర్తిగా విస్మరించింది. ఎలాంటి క్రీడా పరికరాలను మంజూరు చేయలేదు. దీంతో విద్యార్థులు ఆటలకు దూరమయ్యారు.
పాఠశాలలకు సమకూర్చనున్న ప్రభుత్వం
కొనుగోలుకు నిధుల కేటాయింపు
ఇప్పటికే ఆన్‌లైన్‌లో వివరాల నమోదు
గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యం
హరిపురం, జనవరి 10(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో క్రీడా రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. గత ఐదేళ్ల పాటు ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడల నిర్వహణను పూర్తిగా విస్మరించింది. ఎలాంటి క్రీడా పరికరాలను మంజూరు చేయలేదు. దీంతో విద్యార్థులు ఆటలకు దూరమయ్యారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం.. క్రీడా రంగానికి మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. విద్యార్థుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు వారికి పోషకాహారం, క్రీడా సామగ్రి సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు పాఠశాలల వారీగా వివరాలను కోరుతూ సమగ్ర శిక్ష ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో విద్యార్థులకు ఇష్టమైన క్రీడాంశాలను క్రోడీకరించి, దీనికి అనుగుణంగా ఏఏ పరికరాలు అవసరం వంటి వివరాలను ఇప్పటికే ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. వీటి కొనుగోలుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది.
ఐదేళ్లూ నిర్లక్ష్యం..
జిల్లావ్యాప్తంగా 80శాతానికి పైగా ప్రభుత్వ పాఠశాలలకు మైదానాలు ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాపరిషత్, సర్వశిక్ష అభియాన్ నుంచి నిధులు వెచ్చించి పాఠశాలలకు క్రీడా పరికరాలు సమకూర్చేవారు. వాలీబాల్, ఖోఖో, క్రికెట్, బ్యాడ్మింటన్ తదితర క్రీడా కిట్లను అందించేవారు. వాటితో ప్రతిరోజూ సాయంత్రం విద్యార్థులు సాధన చేసేవారు. అయితే, వైసీపీ ప్రభుత్వం వచ్చాక పాఠశాలల్లో క్రీడల నిర్వహణను గాలికొదిలేసింది. ఎలాంటి క్రీడా సామగ్రి మంజూరు కాకపోవడంతో విద్యార్థులు ఆటలకు దూరమయ్యారు. అలాగే మైదానాల అభివృద్ధిని కూడా పట్టించుకోలేదు. ఫలితంగా తుప్పలు, గుంతలతో అధ్వానంగా మారాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం క్రీడా సామగ్రి పంపిణీకి శ్రీకారం చుట్టింది. అవసరమైన పరికరాల వివరాలను గత నెలలోనే సంబంధిత అధికారులకు పాఠశాలల నుంచి సమర్పించారు. క్రీడా కిట్ల కొనుగోలు కోసం ప్రాథమిక పాఠశాలలకు రూ.7వేలు, ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.14వేలు, ఉన్నత పాఠశాలలకు రూ.30వేలు చొప్పున అందించనున్నారు. దీనివల్ల జిల్లాలోని 2,329 పాఠశాలల్లో 1,26,236 మంది విద్యార్థులకు లబ్ధి కలుగనుంది.
విద్యార్థులకు ప్రయోజనం
ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలగనుంది. ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులకు అవసరమయ్యే క్రీడా సామగ్రిని ఎంపిక చేసుకొనే అవకాశం కల్పించారు. నాణ్యత కలిగిన కంపెనీలను జాబితాలో పెట్టారు. ఇది మంచి పరిణామం. క్రీడలు, విద్యార్థులపై విద్యాశాఖామంత్రి లోకేశ్‌కు ఉన్న అంకిత భావానికి నిదర్శనమిది.
- ఎంవీ రమణ, అధ్యక్షుడు, జిల్లా పీఈటీ అసోసియేషన్, శ్రీకాకుళం
Updated Date - Jan 11 , 2025 | 12:07 AM