Vadde Obanna: రేనాటి వీరుడా వందనం!
ABN, Publish Date - Jan 11 , 2025 | 04:04 AM
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తెలుగునాట తొలిసారి సవాల్ చేసిన సైరా... ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి మిత్రుడు,
నేడు అధికారికంగా వడ్డే ఓబన్న జయంతి వేడుకలు
ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఓబన్న స్నేహితుడు
భరణాన్ని అధికారులు ఎగ్గొట్టడంతో మొదలైన పోరు
సైరాకు ప్రధాన అనుచరుడు.. ఏడాదిపాటు సమరం
గెరిల్లా పద్ధతుల్లో బ్రిటిష్ ఖజానాపై దాడులు
నల్లమల కేంద్రంగా పోరాట వ్యూహాలకు పదును
జగన్నాథకొండ వద్ద పట్టుబడి 39 ఏళ్లకే అమరత్వం
(నంద్యాల - ఆంధ్రజ్యోతి): రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తెలుగునాట తొలిసారి సవాల్ చేసిన సైరా... ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి మిత్రుడు, జీవితంలోను, పోరాటంలోను, మరణంలోను స్నేహితుడి వెంట నిలిచిన వీరుడు వడ్డే ఓబన్న జయంతి నేడు. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి ఆయనను స్వాతంత్ర సమరయోధునిగా గుర్తించింది. ఇకపై... ప్రతి జనవరి 11న వడ్డే ఓబన్న జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వడ్డే ఓబన్న చరిత్ర ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేపుతోంది. నంద్యాల జిల్లాలోని సంజామల మండలం నొస్సం గ్రామానికి చెందిన వడ్డె సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు ఓబన్న 1807 జనవరి 11న జన్మించారు. ఉయ్యాలవాడ తాత చెంచుమళ్ల జయరామరెడ్డిది ఇదే గ్రామం. ఓబన్న తండ్రి గ్రామ రక్షకునిగా(తలారీ)గా పనిచేసేవారు. ఈ రెండు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉండేవి. నరసింహారెడ్డి, ఓబన్నల మిత్రత్వం చిన్ననాడే మొదలై, మరణం వరకు కొనసాగింది. అప్పట్లో గ్రామ రక్షకుల జీతాలను తెల్లదొరలు రద్దుచేశారు. ఉయ్యాలవాడ వంశానికి ఎప్పటినుంచో అందుతున్న భరణాలను ఎగ్గొట్టారు. రైతులపై అధిక పన్నులు విధించారు. కరువు, కాటకాలతో పంటలు పండకపోయినా.. బలవంతంగా రైతులనుంచి శిస్తు వసులు చేసేవారు. వస్తుమార్పిడికి విరుద్ధంగా డబ్బులు కట్టాలంటూ హింసించేవారు. దీనికి వ్యతిరేకంగా 1845లో సైరా.. నరసింహారెడ్డి నాయకత్వంలో ఉద్యమం మొదలైంది.
ఆయన వెంట ప్రజలు సాయుధులై నిలిచారు. ఈ ఉద్యమం ఏడాది సాగింది. వడ్డే ఓబన్న తన స్నేహితుడికి బాసటగా ఉద్యమంలో ముందువరుసలో నిలిచారు. ఆయనను ఈ పోరాటానికి సైన్యాధికారిగా సైరా.. ప్రకటించారు. నరసింహారెడ్డి తన అనుచరులతో కలిసి 1846 జూలై 10న కోవెలకుంట్ల సబ్ ట్రెజరీపై దాడి చేశారు. అక్కడినుంచి 3నెలల పాటు, అంటే అక్టోబరు 6 వరకు బ్రిటీష్ పాలకులతో వీరోచితంగా పోరాడారు. అధికారులపై మెరుపు దాడులు సాగించిన తర్వాత నల్లమలలోకి వెళ్లి ఓబన్న నాయకత్వంలో కొత్త దాడులకు వ్యూహరచన సాగించేవారు. దీంతో తెల్లదొరలు ఇతర ప్రాంతాల్లోని బలగాలను రప్పించి అణచివేతను తీవ్రతరం చేశారు. ఇన్‌ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటుచేసుకుని పోరాటవీరుల సమాచారం సేకరించారు. సంజామల మండలం గిద్దలూరు గ్రామ సమీపంలోని జగన్నాథకొండ వద్ద నరసింహారెడ్డి, ఓబన్న తమ బలగాలతో ఉన్నట్టు ద్రోహి ఇచ్చిన సమాచారంతో బ్రిటిష్ బలగాలు అక్కడకు పెద్దఎత్తున చేరుకున్నాయి. సైరా సేనలను ఓబన్న.. బ్రిటిష్ సైన్యాన్ని లెఫ్ట్‌నెంట్ వాట్సన్, కెప్టెన్ రసూల్ నడిపారు. 1846 అక్టోబరు 6న జగన్నాథకొండ వద్ద భీకర పోరాటం సాగింది. నరసింహారెడ్డి అనుచరుల్లో చాలామంది మరణించారు. అయినా, ఓబన్న, సైరా.. చివరివరకు పోరాడారు. ముందుగా వడ్డే ఓబన్న వీరమరణం పొందారు. అప్పటికి ఆయన వయసు 39 ఏళ్లు. ఆ తర్వాత నరసింహారెడ్డిని బందీగా పట్టుకుని కోవెలకుంట్లలో గుమ్మానికి ఉరితీశారు.
ప్రతి ఉగాదికీ భోజనాలు
‘‘వడ్డే ఓబన్నకు ముందు తరం నొస్సంలో స్థిరపడింది. ఓబన్నని చంపేసిన తర్వాత నొస్సంలోని ఆయన స్థావరాలు, వంశీయులపై తెల్లదొరలు దాడులు చేశారు. దీంతో నొస్సం వదిలి, అదే మండలంలోని రూపనగుడికి 10 కుటుంబాలు వెళ్లి స్థిరపడ్డాయి. అక్కడ కూడా అణచివేత కొనసాగడంతో ఉయ్యాలవాడ మండలం ఆర్.పాపంపల్లికి వచ్చాయి. ఓబన్న వంశంలో నాది ఐదోతరం. నా సోదరులందరూ చనిపోయారు. నేను ఒక్కడినే బతికి ఉన్నా. నేను, నా చిన్న కుమారుడు ఇక్కడే వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాం. వంశీయులందరం కలిసి కొన్నేళ్ల పాటు ప్రతి ఉగాదికీ ఆయన జయంతి రోజు అన్నదానం చేసేవాళ్లం. ప్రభుత్వం మా వడ్డె ఓబన్నను గుర్తించడం సంతోషంగా ఉంది’’
- వడ్డే వెంకటేశులు, ఐదోతరం వారసుడు
నమ్మినబంటుగా ఉండేవారు
‘‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి వడ్డే ఓబన్న నమ్మినబంటుగా ఉండేవారు. ఆంగ్లేయుల నుంచి వచ్చే భరణాన్ని ఓబన్న తీసుకుని వచ్చి నరసింహారెడ్డికి ఇచ్చేవారు. అంతగా నమ్మి ఉండేవారు. సైన్యాధిపతిగా ఎన్నో సేవలందించారని మా పూర్వీకులు చెప్పేవారు’’
- కర్ణాటి ప్రభాకర్‌రెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశీయుడు, రూపనగుడి
చాలా సంతోషం
‘‘వడ్డెర జాతికే కాదు.. ప్రపంచానికే రేనాటి వీరుడు వడ్డే ఓబన్న చరిత్రను తెలియ జేసే విధంగా ఆయన జయంతిని అధికారింగా ప్రకటిస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉంది. వందల సంవత్సరాలు మరుగునపడిన ఆయన ఖ్యాతిని వెలుగులోకి తెచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, సబిత, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డికి కృతజ్ఞతలు’’
- వడ్డే బాల నరసింహుడు, ఆరో తరం వారసుడు
Updated Date - Jan 11 , 2025 | 09:00 AM