సుళేకేరి మహిళ కర్ణాటకలో హత్య
ABN, Publish Date - Jan 10 , 2025 | 11:33 PM
మండల పరిధిలోని సుళేకేరి గ్రామానికి చెందిన మహిళ కర్ణాటకలోని మురవళి గ్రామ పొలాల్లో శుక్రవారం దారుణ హత్యకు గురైనది.
కౌతాళం, జనవరి 10(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని సుళేకేరి గ్రామానికి చెందిన మహిళ కర్ణాటకలోని మురవళి గ్రామ పొలాల్లో శుక్రవారం దారుణ హత్యకు గురైనది. వివరాలను పరిశీలీస్తే.. సుళేకేరి గ్రామానికి చెందిన కురువ బసమ్మ(52)కు ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామానికి చెందిన కురువ మారెప్పతో వివాహమైంది. వీరికి సంతానం కలగలేదు. భర్త మారెప్ప కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందాడు. బసమ్మ మూడేళ్లుగా పుట్టిన ఊరిలో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నది. గురువారం ఉదయం కర్ణాటకలోని హచ్చొళ్ళిలో ఉచితంగా ఇచ్చే గ్యాస్ సిలిండర్ తెచ్చుకుంటానని గ్రామస్థులకు తెలిపింది. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం మురవళి గ్రామ పొలాల్లో హత్యకు గురైంది. పొలాల పనులకు వెళుతున్న కూలీలు విగత జీవిగా పడివ ఉన్న మహిళ శవాన్ని గుర్తించి స్థానిక హచ్చోళ్లి పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు చేపట్టగా సాయంత్రం హత్యకు గురైన మహిళ కౌతాళం మండలం సుళేకేరి గ్రామానికి చెందిన కురువ బసమ్మగా గుర్తించారు. కర్ణాటక పోలీసులు స్థానిక కౌతాళం పోలీసుల సహకారంతో సుళేకేరి గ్రామానికి వచ్చి విచారించారు. కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టు మార్టం కోసం సిరుగుప్ప ఆసుపత్రి తరలిస్తున్నట్లు తెలిపారు. హత్యకు గురైన మహిళను ఎవరు హత్య చేశారో, ఎందుకు చేశారో దర్యాప్తు చేసి కేసును త్వరలో ఛేదిస్తామని కర్ణాటక పోలీసులు తెలిపారు.
Updated Date - Jan 10 , 2025 | 11:33 PM