Supreme Court : డాక్టర్‌ ప్రభావతి ‘బెయిల్‌’పై విచారణ వాయిదా

ABN, Publish Date - Mar 18 , 2025 | 05:59 AM

మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో గుంటూరు జనరల్‌ ఆస్పత్రి (జీజీహెచ్‌) మాజీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతి ముందస్తు బెయిల్‌...

Supreme Court : డాక్టర్‌ ప్రభావతి ‘బెయిల్‌’పై విచారణ వాయిదా

న్యూఢిల్లీ, మార్చి 17(ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో గుంటూరు జనరల్‌ ఆస్పత్రి (జీజీహెచ్‌) మాజీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎంపీగా ఉన్న తనను సీఐడీ కస్టడీలో తీవ్రంగా వేధించారంటూ గుంటూరులోని నగరంపాలెం పోలీసు స్టేషన్‌లో రఘురామ ఫిర్యాదు చేశారు. ఆ కేసులో నాటి జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభావతి ఏ-5గా ఉన్నారు. ముందస్తు బెయిల్‌ కోరుతూ ఆమె హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం కొట్టివేసింది. ఈ తీర్పును ఆమె జనవరి 22న సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఆ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. పోలీసుల విచారణకు సహకరించాలని ప్రభావతిని ఆదేశించింది.


అలాగే నాలుగు వారాల వరకు ఆమెను అరెస్టు చేయొద్దని స్పష్టంచేసింది. ఆమె పిటిషన్‌ సోమవారం మళ్లీ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. రాష్ట్రప్రభుత్వం తరఫున వర్చువల్‌గా హాజరైన సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా.. విచారణను వాయిదా వేయాలని కోరారు. అంగీకరించిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఏప్రిల్‌ 1కి వాయిదా వేసింది. గత విచారణ సందర్భంగా తామిచ్చిన ఆదేశాలు అప్పటి వరకు అమల్లో ఉంటాయని తెలిపింది.

Updated Date - Mar 18 , 2025 | 05:59 AM