IPL Bettings: బగ్ పెట్టి బురిడీ
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:00 AM
ఐపీఎల్ ఫీవర్ నడుస్తున్నప్పుడు బెట్టింగ్ బుకీలు హీరో సినిమాల్లో వంటివి 'బగ్' విధానాన్ని అనుసరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సైబర్ నిపుణులు, పోలీసులు ఈ బగ్‌ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

బెట్టింగ్ యాప్‌ల తయారీలోనే బగ్ ఏర్పాటు
ఎవరెవరు ఎక్కడున్నారో తెలిసేలా నిఘా
ఎవరు పరిధి దాటినా ప్రధాన బుకీలు అప్రమత్తం
పోలీసులకు చిక్కకపోవడానికి ఇదే కారణమా..?
అనుమానం వ్యక్తంచేస్తున్న దర్యాప్తు బృందాలు
బగ్ పెట్టే అవకాశాలున్నాయంటున్న సైబర్ నిపుణులు
(విజయవాడ - ఆంధ్రజ్యోతి)
ఒక సినిమాలో హీరోకి బుల్లెట్ గాయమవుతుంది. అతడికి ఆపరేషన్ చేసే సమయంలో వైద్యుల సాయంతో విలన్.. హీరోకి తెలియకుండా అతడి శరీరంలో ఒక బగ్‌ను అమరుస్తాడు. తర్వాత నుంచి హీరో ఎవరితో మాట్లాడినా.. ఆ సమాచారం మొత్తం విలన్‌కు తెలిసిపోతుంది. అయితే.. ఇదంతా సినిమా..! దేశమంతా ఐపీఎల్ ఫీవర్ కొనసాగుతున్న వేళ ఇప్పుడు బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న ప్రధాన బుకీలు కూడా ఇలాగే ‘బగ్’ విధానాన్ని అనుసరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే.. బెట్టింగ్ ఆడేవాళ్లు, ప్లంటర్లు, సబ్‌బుకీలు పోలీసులకు చిక్కుతున్నప్పటికీ ప్రధాన బుకీలు మాత్రం తప్పించుకుంటున్నారు. వారికోసం పోలీసులు ఎంతగా గాలించినా ఫలితం ఉండడం లేదు. కొంతమంది బుకీలు ఇతర రాష్ట్రాలకు పారిపోతుంటే.. మరికొంత మంది దేశ సరిహద్దులు దాటేస్తున్నారు. ఇటీవల ఒక కేసులో జరిగిన పరిణామాలతో పోలీసు అధికారుల్లో ‘బగ్’ అనుమానం వ్యక్తమైంది. బెట్టింగ్ యాప్ సాఫ్ట్‌వేర్‌లోనే బుకీలు బగ్‌లు అమర్చుతున్నట్టు భాస్తున్నారు. ఇలా చేయడానికి అవకాశాలున్నాయని సైబర్ నిపుణులు కూడా చెబుతున్నారు.
సమాచారం పక్కా..
అయినా ప్రధాన బుకీ మిస్..
బెట్టింగ్‌లకు సంబంధించి విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొద్దిరోజుల క్రితం ఒక ఆపరేషన్ నిర్వహించారు. విజయవాడ నుంచి పెడన వరకు ఈ బెట్టింగ్ ముఠాకు లింక్‌లు ఉన్నాయని గుర్తించారు. అవనిగడ్డకు చెందిన వైసీపీ నాయకుడి కుమారుడు పటమటలోని దర్శిపేటలో ఓ ఇంటి నుంచి బెట్టింగ్ నిర్వహిస్తుండగా దాడిచేసి పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకున్నాక పెనమలూరులో మరో ఇద్దరు ఉన్నారని గుర్తించి వారిని కూడా అరెస్టు చేశారు. ఇలా.. వారందరినీ జీపులోకి ఎక్కించగానే వారివద్ద నుంచి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిచ్చిన సమాచారంతో అవనిగడ్డలో ఉన్న వారిని కూడా అదుపులోకి తీసుకోవడానికి వెళ్లారు. అయితే అక్కడకు వెళ్లిన తర్వాత ప్రధాన బుకీ పెడనలో ఉంటాడని తేలింది. అతడు ఇంట్లోనే ఉన్నాడని నిర్ధారించుకున్న పోలీసులు వెంటనే పెడన బయల్దేరి వెళ్లారు. మరో ఐదు నిమిషాల్లో పోలీసులు ఇంటికి చేరుకుంటారనగా ఆ ప్రధాన బుకీ అక్కడి నుంచి పరారయ్యాడు. ఎంత పకడ్బందీగా ఆపరేషన్ నిర్వహించినప్పటికీ ప్రధాన బుకీ తప్పించుకోవడంతో పోలీసులకు ‘బగ్’పై అనుమానం వచ్చింది. గతంలో బుకీలు ప్లేస్టోర్‌లో ఉన్న బెట్టింగ్ యాప్‌ల ద్వారా పందేలు నిర్వహించేవారు. ఈ యాప్‌ల గుట్టు మొత్తం పోలీసులకు ఇట్టే తెలిసిపోతుండడంతో వారు రూటు మార్చారు. బెట్టింగ్ నిర్వహణ కోసం సొంతంగా
యాప్‌లు తయారు చేయించు కుంటు
న్నారు. ఒక్కో బెట్టింగ్ బ్యాచ్ దొరికినప్పుడల్లా ఒక్కో కొత్త యాప్ పేరు వెలుగులోకి వస్తోంది. విజయవాడ పోలీసులు కొద్దిరోజుల క్రితం రెండు బెట్టింగ్ బ్యాచ్‌లకు సంకెళ్లు వేశారు. అవనిగడ్డ బ్యాచ్‌ను అరెస్టు చేసినప్పుడు వారు ‘పార్కర్ ఎక్స్‌చేంజ్’ యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహించినట్టు నిర్ధారణ అయింది. ఇటీవలే గన్నవరం బ్యాచ్‌ను పట్టుకున్నప్పుడు ‘రాధే ఎక్స్‌చేంజ్’ యాప్ పేరు వెలుగులోకి వచ్చింది.
జియో ఫెన్సింగ్ తరహాలో.. పరిధి దాటితే అలర్ట్..
విజయవాడ పోలీసులు రాత్రిపూట నిర్వహించే గస్తీకి సంబంధించి ఈ బీట్ విధానం అమలు చేస్తున్నారు. గస్తీ నిర్వహించే ప్రాంతానికి జియో ఫెన్సింగ్ చేశారు. గస్తీ పోలీసులు ఈ ప్రాంతం పరిధి దాటినా, ఆ పరిధిలోకి వెళ్లకపోయినా అధికారులకు వెంటనే అలర్ట్ మెసేజ్ వెళ్తుంది. సిబ్బందిపై నిఘాకు అధికారులు ఈ జియో ఫెన్సింగ్‌ను ఉపయోగిస్తుంటే... బుకీలు మాత్రం పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు యాప్‌ల్లో ఈ తరహా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక ప్రధాన బుకీ యాప్‌ను రూపొందించి.. తన దిగువన ఉండే సబ్ బుకీలకు లాగిన్, పాస్‌వర్డ్ ఇస్తాడు. ఆ సబ్‌బుకీలు తమ కింద ఉండేవారికి ఇస్తారు. ఈ వ్యవస్థ ఎన్ని దశల్లో అయినా ఉంటుంది. ఇప్పటి వరకు బెట్టింగ్‌లు ఆడేవారు, వారి నుంచి డబ్బులు వసూలు చేసే ప్లంటర్లు, సబ్ బుకీలు మాత్రమే పోలీసులకు చిక్కారు. ప్రధాన బుకీలు చిక్కకపోవడానికి జియో ఫెన్సింగ్ వంటి నెట్‌వర్క్ కారణమని భావిస్తున్నారు. ప్రధాన బుకీకి యాప్‌లో ఎంతమంది ఆడుతున్నారు, ఎంతెంత బెట్టింగ్ పెట్టారు, ఎంతమంది సబ్‌బుకీలు ఉన్నారన్న సమాచారం ఎప్పటికప్పుడు తెలిసిపోతుంటుంది. ఎవరెవరు ఏ ప్రాంతాల్లో ఉన్నారన్న సమాచారం కూడా వారు తెలుసుకుంటున్నారు. ఈ కారణంగానే వారు పోలీసులకు చిక్కడం లేదని తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Visakhapatnam: మరో 24 గంటల్లో డెలివరీ కానున్న భార్య.. భర్త ఎంత దారుణానికి ఒడికట్టాడో..
PM Narendra Modi: కంచ గచ్చిబౌలి భూములు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ..