TDP 43rd Foundation Day: రథ సారథులు కార్యకర్తలే
ABN , Publish Date - Mar 30 , 2025 | 04:59 AM
తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు టీడీపీ కార్యకర్తల సమర్పణను ప్రశంసించారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని, తెలుగు ప్రజల గౌరవాన్ని కాపాడేందుకు ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ 43 ఏళ్లుగా నిలిచిందని అన్నారు. పార్టీ కార్యాలయానికి ఢిల్లీలో స్థలం కేటాయించేందుకు కేంద్రం అంగీకరించిందని లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.

తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే
ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని స్థాపించారు
తెలుగోళ్లను సీఎం చంద్రబాబు ప్రపంచ స్థాయిలో నిలబెట్టారు
పార్టీ ఆవిర్భావ వేడుకల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు
ఢిల్లీలో పార్టీ కార్యాలయం కోసం దరఖాస్తు చేశాం: టీడీపీపీ నేత లావు
న్యూఢిల్లీ, మార్చి 29(ఆంధ్రజ్యోతి): ‘తెలుగుదేశం పార్టీ మాకు కన్న తల్లితో సమానం. టీడీపీని నడిపించే రథ సారథులు కార్యకర్తలే. వారి కోసం మేం పనిచేస్తాం’ అని కేంద్ర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం ఇక్కడ టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించారు. పార్టీ జెండాను లావు శ్రీకృష్ణదేవరాయలు ఎగురవేసి, కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. ‘సీఎం చంద్రబాబు, లోకేశ్ నాయకత్వంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తాం. తెలుగువారికి జరుగుతున్న అన్యాయాన్ని ఆపేందుకు, తెలుగువారికి దేశ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉండాలనే కాంక్షతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఈ దేశంలో ఎన్నో పార్టీలు వచ్చి కాలగర్భంలో కలిసిపోయాయి. టీడీపీ మాత్రం గత 43 ఏళ్లలో ఎన్నో చారిత్రాత్మక ఘటనలకు వేదికగా నిలిచింది. అందుకు కారణం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, పార్టీ కార్యకర్తలే. టీడీపీ బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలిచి ప్రోత్సహించింది. అందుకు మా కుటుంబమే ఉదాహరణ. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఎర్రన్నాయుడుకు 25 ఏళ్లకే టికెట్ ఇచ్చి ఎన్టీఆర్ ఎమ్మెల్యేను చేశారు. ఎర్రన్నాయుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదగడంలో టీడీపీ వెన్నంటి నిలిచింది. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెడితే సీఎం చంద్రబాబు తెలుగువారికి ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చారు. ఇప్పుడు నారా లోకేశ్... ఎన్టీఆర్, చంద్రబాబు నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ పార్టీని నడిపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో టీడీపీని అడ్రస్ లేకుండా చేస్తామని కొంతమంది సవాల్ విసిరారు. వారే అడ్రస్ లేకుండా పోయారు. రాష్ట్రం బాగుండాలి. దేశం బాగుండాలన్న భావన టీడీపీది. ఏపీ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సర్వనాశనం అయిన రాష్ట్రాన్ని గాడినపెట్టేందుకు, ఎన్నికల హామీలను నెరవేరుస్తూ, రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. సీఎం విజన్ స్వర్ణాంధ్ర 2047ను సాకారం చేసేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలి.’ అని రామ్మోహన్‌నాయుడు అన్నారు.
రెండు నెలల్లో ఢిల్లీలో పార్టీకి స్థలం: లావు
ఇటీవల కేంద్రాన్ని ఢిల్లీలో టీడీపీ కార్యాలయం కోసం స్థలం కేటాయించమని అడిగామని లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఈ మధ్యకాలంలో అన్ని పార్టీల ఆఫీసుల కోసం ఢిల్లీలో స్థలాలు ఇస్తున్నందున టీడీపీకి కూడా స్థలం ఇస్తే పార్టీ కార్యాలయం కట్టుకుంటామని దరఖాస్తు పెట్టుకున్నామని తెలిపారు. నెల రెండు నెలల్లో స్థలం ఇస్తామని కేంద్రం తెలిపిందన్నారు.
60వేల మంది కార్యకర్తలు, నాయకులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు 60 వేల మంది కార్యకర్తలు, నాయకులతో శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 43 ఏళ్లుగా పార్టీ వెన్నంటి ఉన్న కార్యకర్తలు, నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అధికారం కోసం కాకుండా తెలుగు జాతిని అన్ని విధాలా ముందుంచాలన్న లక్ష్యంతో ప్రజలే ముందు అనే నినాదంతో టీడీపీ పనిచేస్తోందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..
Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్‌పై మంత్రి రామానాయుడు ఫైర్
Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం
For More AP News and Telugu News