Pellikuthuramma Cheruvu: పెళ్లి కూతురమ్మ వేడుక!
ABN, Publish Date - Jan 13 , 2025 | 03:18 AM
అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు పెళ్లికూతురమ్మ చెరువు. వినడానికి విచిత్రంగా ఉంది కదూ..! ఈ పేరు వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఉంది.
నేటి నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు
(ఆచంట-ఆంధ్రజ్యోతి)
అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు పెళ్లికూతురమ్మ చెరువు. వినడానికి విచిత్రంగా ఉంది కదూ..! ఈ పేరు వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం శేషమ్మ చెరువు పంచాయతీ, పెనుగొండ మండలం దేవ గ్రామం సరిహద్దుల్లో ఈ గ్రామం ఉంది. కొన్ని దశాబ్దాల నుంచి ప్రతి ఏటా సంక్రాంతికి మూడురోజులు పాటు ఇక్కడి ఆలయంలోని పెళ్లికూతురమ్మవారికి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ సమయంలో పెద్దసంఖ్యలో భక్తులు కానుకలు సమర్పించి తమ కుటుంబం చల్లగా ఉండాలని మొక్కుకుంటారు. చలిమిడి, పానకాలతో కావిడ్లు, అరటి గెలలు, ఇంకా అనేక కానుకలు సమర్పించి పూజలు చేస్తారు. ఈ ఏడాది కూడా పెళ్లి కూతురమ్మ ఉత్సవాలు 13, 14, 15 తేదీల్లో నిర్వహించడానికి ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఆచంట మండలంతో పాటు చుట్టుపక్కల పలు గ్రామాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు.
ఆలయ చరిత్ర ఆసక్తికరం..
కొన్ని దశాబ్దాల కిందట ఆచంటకు చెందిన ఒక యువకుడికి పెనుగొండకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. పెనుగొండలోని వధువుఇంట పెళ్లి ఏర్పాటు చేశారు. సరైన రహదారులు లేని ఆ రోజుల్లో వరుడు పల్లకీలో ఆచంట నుంచి బయలుదేరి శేషమ్మచెరువు సమీపం నుంచి పెనుగొండ వెళ్తుండగా అటవీ ప్రాంతంలో ఎదురైన ఒక పామును చంపుతాడు. వివాహం అనంతరం అదే దారిలో భార్యతో కలసి వెళ్తూ సరిగ్గా అదే ప్రదేశంలో ఆగుతారు. ఆ సమయంలో అతను చంపిన పాము తల కాటేయడంతో వరుడు మరణిస్తాడు. ఇది చూసిన నవ వధువు తన బంధువులకు కబురు పెట్టించి అక్కడే నిప్పుల గుండం ఏర్పాటు చేసుకుని భర్త మృతదేహంతో పాటు కాలి బూడిదైంది. ఆమె జ్ఞాపకంగా అక్కడ ఒక చిన్నగుడిని నిర్మించారు. 1982లో ఆలయాన్ని పునరుద్ధరించారు.
Updated Date - Jan 13 , 2025 | 03:18 AM