Share News

Road accident: ఆలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం

ABN , Publish Date - Apr 14 , 2025 | 03:02 AM

పరిగి మండలం ధనాపురం క్రాస్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. ఆటోను కంటైనర్ ఢీకొట్టి ప్రమాదం సంభవించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Road accident: ఆలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం

ముగ్గురు మహిళల దుర్మరణం, 11 మందికి గాయాలు

ఆగి ఉన్న ఆటోను వెనుక నుంచి ఢీకొన్న కంటైనర్‌

శ్రీసత్యసాయి జిల్లాలో దుర్ఘటన

సీఎం చంద్రబాబు, మంత్రుల దిగ్ర్భాంతి

హిందూపురం, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): అమ్మవారి ఆలయంలో జాగరణ చేసి తిరిగివస్తున్న భక్తుల ఆటోను కంటైనర్‌ ఢీకొట్టడంతో ముగ్గురు మహిళలు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. శ్రీసత్యసాయి జిల్లా పరిగి మండలం ధనాపురం క్రాస్‌ సమీపాన 544ఈ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. హిందూపురం మండలం కొటిపిలోని చౌడేశ్వరీమాత ఆలయంలో పౌర్ణమి జాగరణ కోసం రొద్దం మండలం దొడగట్ట గ్రామానికి చెందిన 13 మంది గోనిమేకలపల్లి వాసి బాబు ఆటోలో శనివారం రాత్రి వచ్చారు. రాత్రి జాగరణ చేసి, తెల్లవారుజామున 4.30గంటల సమయంలో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో పరిగి మండలం ధనాపురం క్రాస్‌ వద్ద జాతీయ రహదారి పక్కన ఆటో ఆపి, డ్రైవర్‌ బాబు మొహం కడుక్కుంటుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్‌ ఢీకొట్టి, ఆగకుండా వెళ్లిపోయింది. ఆటో రోడ్డు పక్కనున్న ముళ్ల పొదల్లోకి ఎగిరిపడటంతో అందులోని ఆదిలక్ష్మమ్మ(60), అలివేలమ్మ(40), సాకమ్మ (70) అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారంతో పరిగి పోలీసులు క్షతగాత్రులను 108 వాహనంలో హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో అంజినరెడ్డి, ఆయన భార్య ప్రమీల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. కంటైనర్‌ను సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా బెంగళూరులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. రోడ్డు ప్రమాదంపై జిల్లా ఇన్‌చార్జి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆరాతీశారు. జిల్లాకి చెందిన బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత.. బాధిత కుటుంబాలను ఫోన్‌లో పరామర్శించారు. హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి ఆస్పత్రిలో మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. గాయపడిన వారిని పరామర్శించారు.


fgh.jpg

ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ.. తండ్రీకొడుకు దుర్మరణం

బలిజిపేట, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలంలో ఆదివారం ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొన్న ఘటనలో తండ్రీ కొడుకు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. బలిజిపేటకు చెందిన ముడుసు రామయ్య (30) ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. తన మూడేళ్ల కుమారుడు పవన్‌ పేరిట మొక్కు చెల్లించేందుకు శనివారం సాయంత్రం ఆటోలో శ్రీకాకుళం జిల్లా గార మండలం వత్సవలస రాజులమ్మ యాత్రకు బయలుదేరాడు. మార్గమధ్యంలో రాజాంలో బంధువులను ఎక్కించుకుని వెళ్లాడు. దర్శనం అనంతరం బంధువులను రాజాంలో విడిచిపెట్టి తండ్రీకొడుకు స్వగ్రామానికి వస్తుండగా కొల్లివలస సమీపంలో ఆర్టీసీ బస్సు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రామయ్య, పవన్‌ అక్కడికక్కడే మృతి చెందారు.


పాడేరు ఘాట్‌లో అదుపుతప్పిన బొలెరో

మాడుగుల, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): బతుకు తెరువుకోసం పొట్టచేత్తో పట్టుకొని వలస వెళుతున్న కూలీలు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న బొలెరో వ్యాన్‌ లోయలోకి దూసుకుపోవడంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో 11 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఒడిశా రాష్ట్రం కొరాపుట్‌ జిల్లా సిద్ధలమామిడి, రాళ్లగెడ్డ, కొత్తవలస, బొడ్డుగూడ గ్రామాలకు చెందిన 18 మంది కూలీలు, తెలంగాణలో కూలి పనుల నిమిత్తం శనివారం మధ్యాహ్నం బొలెరో వాహనంలో బయలుదేరారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పాడేరు ఘాట్‌రోడ్డులో వంట్లమామిడి దాటిన తరువాత కోమాలమ్మ పనుకు వద్దకు వచ్చే సరికి బ్రేకులు ఫెయిలై వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకుపోయింది. చీకటిగా ఉండడంతో లోయలో నుంచి పైకి రాలేక, బాధితులు పెద్దగా కేకలు వేస్తున్నారు. కొంతసేపటి తరువాత ద్విచక్ర వాహనదారులు గమనించి, సెల్‌ఫోన్‌ లైట్లతో పరిశీలించారు. క్షతగాత్రులను రోడ్డుపైకి తీసుకువచ్చే అవకాశం లేకపోవడంతో తెల్లవారుజామున 3గంటల సమయంలో మాడుగుల అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి లోయలో నుంచి క్షతగాత్రులను మాడుగుల సీహెచ్‌సీకి తీసుకొచ్చారు. తీవ్రంగా గాయపడిన ఏడుగురిని అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. స్వల్ప గాయాలైన మిగిలిన వారికి మాడుగులలో చికిత్స అందించారు. క్షతగాత్రుల కుటుంబ సభ్యులు, బంధువులు అనకాపల్లి, మాడుగుల ఆస్పత్రులకు చేరుకుని చికిత్స పొందుతున్న వారిని తీసుకెళ్లారు. కోరాపుట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటామని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ

AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..

TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 14 , 2025 | 03:02 AM